గెలుపోటములలో ఏది గొప్ప? ఏ ఫలితం దేనికి దారి తీస్తుందో తెలుసుకోవాలనుందా?

Best Web Hosting Provider In India 2024

గెలుపోటములలో ఏది గొప్ప? ఏ ఫలితం దేనికి దారి తీస్తుందో తెలుసుకోవాలనుందా?

Ramya Sri Marka HT Telugu

ఓటమి గొప్పదా? గెలుపు గొప్పదా? ఓడిన వాడు గెలిస్తే అది సంతోషం. మరి గెలిచిన వాడు ఓడితే అది పరాభవం. దీనిని బట్టి మీరే తేల్చుకోవాలి. ఓటమా, గెలుపా రెండింటిలో ఏది గొప్ప అని..! ఇప్పటికే మీకు ఓటమే గొప్ప అని ఒక క్లారిటీ వచ్చేస్తే అదెలాగో తెలుసుకుందాం.

గెలుపోటములలో ఏది గొప్పంటే..

“గెలిస్తే ప్రపంచానికి నువ్వు పరిచయమవుతావ్. అదే ఓడిపోతే ప్రపంచం నీకు పరిచయమవుతుంది” ఇది ఒక సినిమా డైలాగ్. కానీ, రియల్ లైఫ్‌లో కూడా పనికొచ్చే మాట ఇది. అందరూ గెలుపు వెంట పరుగెడుతుంటారు. తృటిలో తప్పినా కూడా గెలవలేకపోయామని ఎంతో బాధపడిపోతుంటారు. కానీ, గెలుపు చేజారక వచ్చే ఓటమి విజయం కంటే గొప్పది. చాలా విలువైనది. ఓటమి రుచి చూసిన వాడికి ఇక దేని గురించి దిగులు ఉండదు. గెలుపు గురించి భయముండదు. అదేంటీ.. ఓడిపోతే ఎలా బాగుంటుందనే సందేహం కలుగుతుందా? అయితే రండి. అదెలాగో చూద్దాం.

“ఓటమి గొప్పది” అని అనడం ఎందుకంటే అది మన విజయానికి దారి చూపుతుంది. గెలుపుకు బాట వేస్తుంది. మానసికంగా సిద్ధం చేసి ఆల్రెడీ ఓడిన వాడికి మరోసారి ఓడినా తట్టుకునే ధైర్యం ఉంటుందనే విషయాన్ని గుర్తు చేస్తుంది. అంతేకాదు, ఓటమి వల్ల మన జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు కూడా.

ఓటమి నేర్పే విషయాలేంటంటే,

1. ఓటమి సత్యాన్ని చూపుతుంది

ఓటమికి గురైన వాడి చుట్టూ అప్పటి వరకూ ఉన్న భ్రమలన్నీ తొలగిపోతాయి. డంబాసరి కబుర్లతో కీర్తిస్తూ భజన చేసే మనుషులు పారిపోతారు. మనం ఒక్కరమే మిగిలి నిజమైన స్థితికి వెళ్లిపోతాం. అప్పుడే గెలుపుకు చేరువ కాకుండా చేసిన మన లోపాలేంటో బయటపడతాయి. నిజానికి మిస్ అయిపోయిన అవకాశాలను గుర్తించడానికి ఇది చక్కటి అవకాశం.

2. అభిమానాల్ని తగ్గించి, అహంకారాన్ని తొలగిస్తుంది

గెలుపు వల్ల వచ్చే అభిమానం మనిషిలోని అహంభావాన్ని అందలం ఎక్కిస్తుంది. విజేతగా అందుకునే మర్యాదలు, హోదా అహంకారాన్ని తెచ్చిపెడతాయి. చాలా మంది అహంకారంతో కళ్లు మూసుకుపోయాయా అని తిడుతుంటారు. అది కూడా డబ్బు రూపంలోనో, పందెం రూపంలోనో, ఆస్తి రూపంలోనో దక్కిన విజయానికి కారణమే. కానీ, ఒక్కసారి ఓడిన వాడికి ఇవేమీ ఉండవు. అభిమానం కొరవడిపోతుంది. అప్పటివరకూ మనం తప్పులు చేసినా బాగుందని చెప్పేవారంతా, మన తప్పుల గురించే మాట్లాడుతుంటారు. అప్పుడే మనిషి ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. ప్రవర్తనలో మార్పు తెచ్చుకుని లోపాలు లేని వ్యక్తిగా ఎదగగలడు.

3. శిక్షణకు ప్రేరణ ఇస్తుంది

సానుకూలంగా ఆలోచిస్తే ఓడిపోయిన వాడిలో కసి పెరుగుతుంది. ఒకేసారి గెలిచినా రాని ఆనందం ఓటమి తర్వాత వచ్చే గెలుపులో దొరుకుతుంది. నిజానికి ఓడినవాడే “నేను ఇంకెక్కడ బాగా చేయాలి?” అని ఆలోచించగలడు. ఆ ఆలోచన మనలో మొదలైతే అది కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్‌కి దారి తీస్తుంది.

4. నిజమైన గెలుపు విలువ నేర్పిస్తుంది

ఒక వ్యక్తి ఓడిన తర్వాత గెలిచినపుడు, ఆ గెలుపు విలువను ఎంతో బాగా అర్థం చేసుకుంటాడు. అది సంతృప్తితో కూడిన గెలుపు మాత్రమే కాకుండా మరొకరు ప్రేరణగా కూడా మారుతుంది. ఓడిన వాడు చేసే జీవన ప్రయాణం నుంచి గెలుపు మజిలీ వరకూ మిమ్మల్ని చేర్చుతుంది.

5. విజయం పట్ల సహనం, పట్టుదల పెంచుతుంది

ఓటమి అనేది ఎదురుదెబ్బ తగిలిన రాయిగా భావించాలి. రాయిని తిట్టుకోకుండా దానినే మెట్టుగా మార్చుకుంటూ విజయ పర్వతాన్ని అధిరోహించాలి. కలలు సఫలం కావాలంటే ప్రతిఒక్కరూ కచ్చితంగా ఓడిపోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఓటమి ఎదురైనా గెలుపు ప్రయాణంలో భాగంగా అంగీకరించాలి.

సింపుల్‌గా చెప్పాలంటే ఓటమి లేకపోతే విజయం అసలే రుచించదు. ఈసారి మీరు ఓడిపోతే తిట్టుకుంటూ కూర్చోకండి. పాఠాలు నేర్చుకుని గెలుపు దిశగా సాగిపోండి.

Ramya Sri Marka

eMail
మార్క రమ్యశ్రీ హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ లైఫ్‌స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు.జర్నలిజంలో ఎనిమిదేశ్లకు పైగా అనుభవం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. 2024 నవంబరులో హెచ్.టి తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024