




Best Web Hosting Provider In India 2024
అఫ్గానిస్థాన్‌లో భూకంపం- దిల్లీలో ప్రకంపనలు.. అంతా భయం భయం!
అఫ్గానిస్థాన్‌లో బుధవారం భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్‌పై తీవ్రత 5.6గా నమోదైంది. కాగా ఆ తర్వాత, దిల్లీ- ఎన్సీఆర్లో కూడా భూ ప్రకంపనలు వచ్చినట్టు తెలుస్తోంది.
భూకంపంతో అఫ్గానిస్థాన్ మరోసారి ఉలిక్కిపడింది. రిక్టార్ స్కేల్‌పై 5.6 తీవ్రతతో అఫ్గానిస్థాన్‌లో బుధవారం భూకంపం సంభవించింది. ఆ తర్వాత దిల్లీ-ఎన్సీఆర్లో కూడా ప్రకంపనలు సంభవించాయని సోషల్ మీడియా యూజర్లు ఎక్స్‌లో పేర్కొన్నారు.
అఫ్గానిస్థాన్‌లో భూకంపం..
అఫ్గాన్‌లోని బాగ్లాన్ నగరానికి తూర్పున 164 కిలోమీటర్ల దూరంలో, భూమికి 121 కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపనలు నమోదైనట్టు యూరోపియన్-మెడిటరేనియన్ భూకంప కేంద్రం (ఈఎంఎస్సీ) వెల్లడించింది.
భూకంపం తీవ్రత తొలుత 6.4గా నమోదైనట్లు ప్రకటించిన ఈఎంఎస్సీ ఆ తర్వాత దానిని 5.6కు సవరించింది.
కాగా భూకంపం వల్ల ప్రజలు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. అఫ్గానిస్థాన్ భూకంపంలో ప్రాణ, ఆస్తి నష్టంపై స్పష్టత రావాల్సి ఉంది.
అటు దిల్లీ ఎన్సీఆర్లోనూ భూప్రకంపనలు వెలుగులోకి వచ్చాయి.
“దిల్లీలో భూకంపాన్ని ఎవరైనా ఎక్స్‌పీరియెన్స్ చేశారా?” అని ఒక యూజర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
“దల్లీలో భూకంపం వచ్చినట్లు అనిపించిందా???” అని మరొకరు పోస్ట్ పెట్టారు.
కాగా అఫ్గానిస్థాన్‌లో భూకంపాలు తరచూ ప్రజలను భయపెడుతున్నాయి. శక్తివంతమైన భూకంపాలు చూసిన చరిత్ర అఫ్గానిస్థాన్‌కి ఉంది. హిందూ కుష్ పర్వత శ్రేణి భౌగోళికంగా చురుకైన ప్రాంతం. ఇక్కడ ప్రతి సంవత్సరం భూకంపాలు సంభవిస్తాయి. ఆఫ్గానిస్థాన్ అనేది భారత్- యురేషియా టెక్టోనిక్ ప్లేట్ల మధ్య అనేక ఫాల్ట్లైన్లలో ఉంది. ఒక ఫాల్ట్‌లైన్ నేరుగా హెరాత్ నగరం గుండా నడుస్తుంది.
భూకంపాలు సంభవించినప్పుడు, వాటి పరిమాణంతో పాటు వాటి లోతు కూడా ముఖ్యమైనది. లోతు ఎక్కువ ఉంటే ప్రభావం తక్కువ ఉంటుంది. కానీ లోతు తక్కువ ఉంటే, ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. దురదృష్టవశాత్తు అఫ్గానిస్థాన్‌లో తక్కువ లోతుతో కూడుకున్న భూకంపాలు వెలుగులోకి వస్తుంటాయి. ఎందుకంటే ఈ ప్రాంతంలోని టెక్టోనిక్ ప్లేట్లు నేరుగా ఢీకొట్టుకోకుండా, తరచుగా జారుతుంటాయి.
అఫ్గానిస్థాన్ మాత్రమే కాదు ఆసియా వ్యాప్తంగా కూడా భూకంపాల ఘటనలు ఇటీవలి కాలంలో తీవ్ర భయాందోళనలు గురిచేస్తున్నాయి. మార్చ్ చివరిలో సంభవించిన భూకంపంతో మయన్మార్ అల్లాడిపోయింది. ఆ తర్వాత ఏప్రిల్ నెలలో నేపాల్లోనూ భూమి కంపించింది. ఇక కొన్ని రోజుల క్రితం మయన్మార్, భారత్ (హిమాచల్ ప్రదేశ్), తజకిస్థాన్‌లోనూ భూకంపాలు వచ్చాయి. ఇప్పుడు అఫ్గానిస్థాన్‌ని భూకంపం కుదిపేసింది.
ఫిలిప్పీన్స్‌లో 5.6 తీవ్రతతో భూకంపం..
దక్షిణ ఫిలిప్పీన్స్‌లో 5.6 తీవ్రతతో భూకంపం సంభవించిన కొన్ని గంటల్లోనే ఆఫ్గానిస్థాన్‌లో భూ ప్రకంపనలు రికార్డు అయినట్టు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) తెలిపింది.
మిండనావో ద్వీపం తీరంలో 30 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు యూఎస్జీఎస్ తెలిపింది.
మైటమ్ పట్టణానికి నైరుతి దిశలో 43 కిలోమీటర్ల దూరంలో పర్వత ప్రాంతం, జనసాంద్రత తక్కువగా ఉన్న ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించింది ఫిలిప్పీన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వోల్కనాలజీ అండ్ సీస్మోలజీ.
భూకంపం వల్ల పెద్దగా నష్టం వాటిల్లలేదని ప్రాథమిక సంకేతాలు అందాయని అక్కడి స్థానిక అధికారులు తెలిపారు.
“భూకంపం బలంగా ఉంది. కాని ఎక్కువసేపు నిలవలేదు. మేము తనిఖీ చేశాము. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం గురించి తెలియలేదు,” అని మైటమ్లోని అగ్నిమాపక శాఖ అధికారి గిల్బర్ట్ రోలిఫోర్ చెప్పారు.
అంతేకాదు, ఈ ఘటనకు కొన్ని గంటల ముందు, తజికిస్థాన్‌లో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ఈఎంఎస్సీని పేర్కొంది. గత రెండు రోజుల్లో మధ్య ఆసియా దేశంలో సంభవించిన మూడో భూకంపం ఇది!
ఆదివారం తజికిస్థాన్‌లో రెండు భూకంపాలు సంభవించాయని, మొదటి భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా, రెండో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.9గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.
గంట వ్యవధిలో భారత్, ఇతర ఆసియా దేశాలను వణికించిన 4 భూకంపాలు రిక్టార్ స్కేలుపై 6.1 తీవ్రతతో 10 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు ఎన్ఎస్సీ తెలిపింది.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link