





Best Web Hosting Provider In India 2024

ఎండల్లో వేడికి పొట్టను చల్లగా ఉంచి నోటికి కమ్మగా ఉండే మజ్జిగ చారు రెసిపీ ఇదిగో
మండే ఎండల్లో మజ్జిగ చారును చేసుకొని తాగే వారి సంఖ్య ఎక్కువే. దీన్ని చేయడం కూడా చాలా సులువు. మజ్జిగ చారుతో ఆరోగ్యం కూడా దక్కుతుంది.
మజ్జిగ చారు అనగానే అందరూ మజ్జిగ చేసి అందులో పోపు వేయడమే అనుకుంటారు. అలా చేయడం వల్ల మజ్జిగ రుచిగా ఉండదు. ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో మజ్జిగ చారు చేసి చూడండి. ఇది పొట్టను చల్లగా ఉంచడమే కాదు… నోటికి కూడా కమ్మగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం మజ్జిగ చారు టేస్టీగా ఎలా చేయాలో తెలుసుకోండి. పొట్టకు చలువ చేసేలా కూడా చేయడం చాలా ముఖ్యం.
మజ్జిగ చారు రెసిపీకి కావలసిన పదార్థాలు
పెరుగు – ఒక కప్పు
ఉప్పు – రుచికి సరిపడా
ఉల్లిపాయ – ఒకటి
పచ్చిమిర్చి – మూడు
అల్లం – చిన్న ముక్క
కొత్తిమీర తరుగు – ఒక స్పూను
నూనె – అర స్పూను
పచ్చిశనగపప్పు – అర స్పూను
మినప్పప్పు – అర స్పూను
జీలకర్ర – అర స్పూను
ఆవాలు – అర స్పూను
వెల్లుల్లి రెబ్బలు – నాలుగు
ఎండుమిర్చి – నాలుగు
కరివేపాకులు – గుప్పెడు
పసుపు – పావు స్పూను
మజ్జిగ చారు రెసిపీ
1. మజ్జిగ చారు చేసేందుకు ముందుగా ఒక గిన్నెలో పెరుగును వేసి బాగా గిలక్కొట్టుకోవాలి.
2. అందులోనే ఉప్పును కూడా వేసి బాగా కలుపుకోవాలి.
3. అందులో కొత్తిమీర తరుగును వేసి బాగా కలపాలి.
4. ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. దాన్ని పక్కన పెట్టుకోవాలి.
5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
6. ఆ నూనెలో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి.
7. తర్వాత శెనగపప్పు, మినప్పప్పు వేసి వేయించుకోవాలి.
8. దంచిన వెల్లుల్లి, ఎండుమిర్చి కూడా వేసి వేయించాలి.
9. ముందుగా మిక్సీలో రుబ్బుకున్న పచ్చిమిర్చి, అల్లం మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి.
10. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించాలి. పసుపును కూడా వేసి బాగా కలపాలి.
11. గుప్పెడు కరివేపాకులను కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి.
12. ఆ నూనెలో ముందుగా కలిపి పెట్టుకున్నా పెరుగు మిశ్రమాన్ని వేసి గరిటతోనే బాగా కలపాలి.
13. అంతే టేస్టీ మజ్జిగ చారు రెడీ అయినట్టే. దీన్ని తినే కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది.
14. ముఖ్యంగా ఈ మజ్జిగ చారును చల్లగా అయ్యాక అన్నంలో కలుపుకుని తింటే ప్రాణం లేచి వచ్చినట్టు అనిపిస్తుంది. రుచి కూడా అద్భుతంగా ఉంటుంది.
ఎండల్లో వడదెబ్బ కొట్టే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి మజ్జిగ, పెరుగు ఉండే ఆహారాలను తినాలి. చాలామంది సాంబారు తినేందుకు ఇష్టపడతారు. లేదా చారు వంటివి చేసుకొని తింటారు. ఆ రెండింటికన్నా కూడా వేసవిలో మజ్జిగ చారు తినడమే ఎంతో ఉపయోగం. ఇది శరీరానికి ఎంతో చలువ చేస్తుంది. పైగా ఇందులో మనం ఉల్లిపాయ ముక్కలను కూడా వేసాము. కాబట్టి మజ్జిగ ఉల్లిపాయలు కలిపి మన శరీరానికి మరింత చల్లదనాన్ని ఇస్తుంది. ఇక మిగతావన్నీ కూడా నోటికి కమ్మదనాన్ని ఇస్తాయి. కాబట్టి మజ్జిగ చారును మేము చెప్పిన పద్ధతిలో చేసి చూడండి. ఇది అద్భుతంగా ఉంటుంది. అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది.
సంబంధిత కథనం