





Best Web Hosting Provider In India 2024

ఆపిల్ హల్వా ఇలా సింపుల్ గా చేస్తే పదినిమిషాల్లో రెడీ అయిపోతుంది, రెసిపీ తెలుసుకోండి
ఆపిల్ హల్వా రుచి అద్భుతంగా ఉంటుంది. ఇంట్లో పుట్టినరోజు వేడుకల సమయంలో ఇలా సింపుల్ గా తక్కువ సమయంలోనే ఆపిల్ హల్వా చేసేందుకు ప్రయత్నించండి. పండుగల సమయంలో దీన్ని నైవేద్యంగా కూడా ప్రసాదించవచ్చు..
ఆపిల్ హల్వా ఒక సూపర్ టేస్టీ డెజర్ట్. దీన్ని వండడం చాలా సులువు. ఇంట్లో విందులు వినోదాల సమయంలో ఆపిల్ హల్వా సింపుల్ గా వండేయచ్చు. మీ పిల్లల పుట్టినరోజు సమయంలో కూడా దీన్ని మీరు తయారుచేయవచ్చు. దీన్ని పంచదార, ఆపిల్ ప్యూరీతో చేస్తారు. నెయ్యి వేసి చేసే ఈ హల్వా నోట్లో పెడితే కరిగిపోయేలా ఉంటుంది. ఆపిల్ హల్వా ఎలా చేయాలో తెలుసుకోండి.
ఆపిల్ హల్వా రెసిపీకి కావలసిన పదార్థాలు
ఆపిల్ పండు – ఒకటి
పంచదార – ఒక కప్పు
యాలకుల పొడి – అర స్పూను
నెయ్యి – అర కప్పు
జీడిపప్పులు – పది
బాదం పప్పులు – అయిదు
ఎండు ద్రాక్షలు – గుప్పెడు
ఆపిల్ హల్వా రెసిపీ
1. ఆపిల్ ను శుభ్రంగా కడిగి తుడిచి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2. కట్ చేసిన వెంటనే రంగు మారకుండా నీటిలో వేయాలి.
3. ఆ నీటిలో ఉప్పు, కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. లేదా సాధారణ నీటిలా తీసుకోవచ్చు.
4. ఆపిల్ ను మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేయాలి.
5. కళాయిలో ఒక చెంచా నెయ్యి వేసి వేడయ్యాక అందులో జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష వేసి బాగా వేయించాలి.
6. అవి బంగారు రంగులోకి మారిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
7. ఇప్పుడు అదే పాన్ లో నూనె వేసి వేడి అయ్యాక తురిమిన ఆపిల్ పేస్ట్ వేసి నెయ్యి వేసి కలపాలి.
8. ఆపిల్ లో నీరు ఇంకిపోయే వరకు చిన్న మంట మీద కలుపుతూ ఉండండి.
9. తర్వాత పంచదార వేసి కరిగి మళ్లీ మెత్తబడేలా కలపాలి.
10. యాలకుల పొడి చల్లి బాగా కలుపుకోవాలి.
11. తర్వాత మిగిలిన నెయ్యి వేసి చిక్కబడే వరకు కలియబెట్టాలి.
12. ఇది హల్వాలాగా అయ్యాక కళాయికి అంటుకోకుండా వచ్చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో వేయించిన జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష చల్లాలి.
13. అంతే సూపర్ టేస్టీ ఆపిల్ హల్వా తయారైనట్టే.
ఈ హల్వాను పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. ఒకసారి రుచి చూసిన తర్వాత మళ్లీ కావాలంటారు. ఇది తయారుచేయడం చాలా సులభం. దీన్ని చేయడానికి ఇంట్లో ఉన్న వస్తువులే చాలు. ఈ ఆపిల్ హల్వా చాలా రుచిగా ఉంటుంది. ఈ స్వీట్ రెసిపీ అందరికీ నచ్చుతుంది.
సంబంధిత కథనం