ఈ 5 రకాల పండ్లను తిన్న తర్వాత నీళ్లు తాగుతున్నారా? అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టే!

Best Web Hosting Provider In India 2024

ఈ 5 రకాల పండ్లను తిన్న తర్వాత నీళ్లు తాగుతున్నారా? అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టే!

Ramya Sri Marka HT Telugu

పండ్లు ఆరోగ్యకరమైనవే. పండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే కొన్ని పండ్ల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. లేదంటే ప్రమాదాలు తప్పనిసరి. ముఖ్యంగా ఈ 5 రకాల పండ్లను తిన్న తర్వాత నీళ్లు అస్సలు తాగొద్దట.

ఈ పండ్లు తిన్న తర్వాత నీరు తాగడం ప్రమాదకరమట! (Shutterstock)

మీ చిన్నతనంలో ఇంట్లో ఉండే అమ్మమ్మలు, అత్తమామలు కొన్ని పదార్థాలు తిన్న తర్వాత నీళ్లు తాగకూడదని వారించే ఉంటారు. అది గుర్తుంది కదా. అలాగే, పండ్లను తిన్న తర్వాత కూడా నీళ్లు తాగకూడదట. ఈ నియమం పాటించకపోతే ఆరోగ్యానికి హాని కలగడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివని అందరికీ తెలుసు. కానీ, కొన్ని పండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగితే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అలాంటి పండ్ల గురించి తెలుసుకుందామా..

కర్బూజ తిన్న తర్వాత నీళ్లు తాగకండి

వేసవిలో రుచికరమైన కర్బూజ తినడం ఇష్టపడని వారుండరేమో. వాస్తవానికి ఇది తినడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి కూడా. ఈ కర్బూజ పండ్లలో ఉండే ఫైబర్, నీరు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. అయితే, కర్బూజలో పెద్ద మొత్తంలో సహజ చక్కెర ఫ్రక్టోజ్ ఉంటుంది. కాబట్టి, కర్బూజ తిన్న వెంటనే నీళ్లు తాగితే ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది.

అరటి పండు తిన్న తర్వాత నీళ్లు తాగకండి

ఏడాది పొడవునా అందుబాటులో ఉండే పండు అరటి పండు. చాలా చౌక ధరలో దొరికే ఈ పండులో పుష్కలంగా కాల్షియం, పొటాషియం, ఫైబర్, ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా శ్రేయస్కరం. ఇదిలా ఉంటే, అరటి పండు తిన్న వెంటనే నీళ్లు తాగితే నష్టం తప్పదట. ఇది శరీరంలో ఇన్సులిన్ స్థాయిని పెంచుతుంది. అంతేకాకుండా రక్తంలో ఉండే చక్కెర స్థాయిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి, అరటి పండు తిన్న తర్వాత కనీసం 20 నిమిషాల తర్వాత నీళ్లు తాగాలి.

ఆపిల్ తిన్న తర్వాత నీళ్లు తాగకండి

ఆపిల్ తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. ఆపిల్‌లో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడటంతో పాటు మొత్తం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది కూడా. అయితే, ఆపిల్ తిన్న వెంటనే నీళ్లు తాగితే ఈ ఫైబర్ పేగులకు చేరదు. దీని వలన జీర్ణక్రియ సమస్యలు ఏర్పడతాయి. ఆపిల్ తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగడం వల్ల గ్యాస్ పెరగడం, అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది.

దానిమ్మ పండు తిన్న తర్వాత నీళ్లు తాగకండి

దానిమ్మ పండు అందరికీ ఇష్టం. ఆ పండులోని గింజల రంగు చూడగానే తినేయాలనిపిస్తుంది. ఈ ఎరుపు గింజలు రుచికరంగా ఉండటంతో పాటు దాని రసం చాలా ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది. కానీ, దానిమ్మ పండు తిన్న వెంటనే నీళ్లు తాగడం ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. ఇలా చేయడం వల్ల వికారం, వాంతులు, గ్యాస్, ఎసిడిటీ సమస్యలు కలుగుతాయి. కాబట్టి, దానిమ్మ పండు తిన్న తర్వాత సుమారు అరగంట తర్వాత నీళ్లు తాగాలి.

పుల్లని పండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగకండి

ద్రాక్ష, నారింజ, నిమ్మకాయ, ఉసిరి వంటి పుల్లని పండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగకూడదు. ఇలా చేయడం వల్ల శరీరంలోని pH స్థాయి దెబ్బతింటుంది. అంతేకాకుండా జీర్ణ సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. మీకు గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు ఉంటే, పుల్లని పండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగడం మానుకోవాలి.

Ramya Sri Marka

eMail
మార్క రమ్యశ్రీ హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ లైఫ్‌స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు.జర్నలిజంలో ఎనిమిదేశ్లకు పైగా అనుభవం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. 2024 నవంబరులో హెచ్.టి తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024