





Best Web Hosting Provider In India 2024

అమరావతి నిర్మాణంలో మరో ముందడుగు- రూ.4668 కోట్లతో 5 టవర్లు, టెండర్లు పిలిచిన సీఆర్డీఏ
అమరావతి నిర్మాణం వేగం పుంజుకుంటుంది. తాజాగా 5 టవర్లకు సీఆర్డీఏ టెండర్లు ఆహ్వానించింది. సచివాలయం నాలుగు టవర్లు, హెచ్వోడీ ఆఫీస్ టవర్ తో కలిపి మొత్తం 5 టవర్ల నిర్మాణానికి రూ.4668 కోట్ల పనులకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. వీటికి మే 1 నాటికి బిల్డు వేయాలని సూచించింది.
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. మే 2న అమరావతిలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ…రాజధాని పునర్ నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. రాజధానిలో రాష్ట్ర సచివాలయ టవర్ల నిర్మాణానికి సీఆర్డీఏ టెండర్లు ఆహ్వానించింది. సచివాలయానికి చెందిన 4 టవర్లు, హెచ్వోడీ ఆఫీస్ టవర్ నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది. హెచ్‌వోడీ టవర్ నిర్మాణానికి రూ.1,126 కోట్లకు టెండర్ ఆహ్వానించగా, సచివాలయానికి సంబంధించి 1, 2 టవర్ల కోసం రూ.1,897 కోట్లు, సచివాలయం 3,4 టవర్ల కోసం రూ.1,664 కోట్లతో టెండర్లు పిలిచారు. మొత్తంగా 5 టవర్లను రూ.4,668 కోట్ల పనులకు టెండర్లను ఆహ్వానించారు. మే 1న సచివాలయం, హెచ్‍వోడీ టవర్లకు టెక్నికల్ బిడ్లు తెరవనున్నారు.
మే 1వ తేదీన బిడ్లు
పాలవాగు దక్షిణాన ఏపీ ఇంటిగ్రేటెడ్ సెక్రటేరియట్, హెచ్వోడీ కార్యాలయాల నిర్మాణం కోసం టెండర్లు ఆహ్వానించారు. అమెనిటీ బ్లాక్‌లు, స్టిల్ట్ ప్రాంతాలు, బేస్‌మెంట్, పీటీ బేస్‌మెంట్ స్లాబ్, ఆర్సీ కోర్, స్ట్రక్చరల్ స్టీల్ ఫ్లోర్ బీమ్‌లు, స్ట్రక్చరల్ స్టీల్ డయాగ్రిడ్, వాటర్‌ఫ్రూఫింగ్, డెక్ షీట్ ఇందులో ఉన్నాయి. 45 అంతస్తులు కలిగిన HoD కార్యాలయానికి ఒక టవర్, అమరావతి సచివాలయంలో 40 అంతస్తులు కలిగిన ఇతర టవర్లను ప్లాన్ చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ ఏపీ స్టేట్ సెక్రటేరియట్, HoD కార్యాలయాల టెండర్ల కోసం 01.05.2025 నాటికి బిడ్లు సమర్పించాలని సీఆర్డీఏ సూచించింది.
సీఆర్డీఏ టెండర్ షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగా అన్ని టవర్లను డయాగ్రిడ్ లో నిర్మించాలని పేర్కొంది. సెక్రటేరియట్ టవర్ల నిర్మాణం అమరావతి రాజధాని అభివృద్ధిలో కీలకమైన అంశమని సీఆర్డీఏ తెలిపింది. ఈ టవర్ల నిర్మాణం 2.5 నుంచి 3 సంవత్సరాలలోపు పూర్తవుతుందని పేర్కొంది.
రూ.64 వేల కోట్ల రాజధాని నిర్మాణ పనులు
అమరావతిలో రూ.64వేల కోట్లతో రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించినట్టు మంత్రి నారాయణ తెలిపారు. రాజధానిలోని అనంతవరంలో మంగళవారం మంత్రి నారాయణ, అధికారులు పర్యటించారు. అమరావతి నిర్మాణ పనులకు అవసరమైన గ్రావెల్ కోసం కొండలను పరిశీలించారు. గత ప్రభుత్వ నిర్వాకంతో అమరావతి పనుల ప్రారంభానికి ఆటంకాలు ఏర్పడ్డాయని, న్యాయపరమైన సమస్యలు అధిగమించేందుకు 8 నెలలు పట్టిందని వివరించారు. 68 పనులకు సంబంధించి రూ.42,360 కోట్ల విలువైన పనులకు టెండర్లు పూర్తయ్యాయని, ఈ పనులన్నీ ఇప్పటికే ప్రారంభం అయ్యాయన్నారు.
అమరావతి పనులకు అవసరమైన గ్రావెల్ కోసం గనుల శాఖ 851 ఎకరాలు సీఆర్డీఏకు కేటాయించిందని మంత్రి తెలిపారు. గతంలో అనంతవరం కొండను సీఆర్డీఏ కు కేటాయించారని గత ప్రభుత్వంలో 8 మీటర్ల లోతు వరకూ తవ్వేశారని, ఇక్కడ భూమిని కూడా ఏదోక అవసరానికి ఉపయోగించాలని చూస్తున్నామన్నారు.
రాజధానిలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కట్టాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన అని, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడలను కలిపి మెగాసిటీగా చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్టు మంత్రి నారాయణ వివరించారు. ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం కనీసం 5 వేల ఎకరాలు అవసరమవుతాయని, ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకుంటే 30 వేల ఎకరాలు అవసరం ఉంటుందన్నారు.
సంబంధిత కథనం
టాపిక్