



Best Web Hosting Provider In India 2024

మామిడి రైతులకు ‘అకాల’ దెబ్బ, ఈదురుగాలులకు ఓరుగల్లులో తీవ్ర నష్టం
అకాల వర్షాలు ఉమ్మడి వరంగల్ జిల్లా మామిడి రైతులకు అపారనష్టం మిగిల్చాయి. మంగళవారం అర్ధరాత్రి వీచిక ఈదురుగాలులు, వర్షాలకు మామిడి కాయలు నేలరాలాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. వందల ఎకరాల్లో మామిడి పంట నష్టపోయిందని రైతులు తెలిపారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా మామిడి రైతులను అకాల వర్షాలు కోలుకోలేని దెబ్బ తీశాయి. మంగళవారం అర్ధరాత్రి వీచిన ఈదురుగాలులకు ఉమ్మడి జిల్లాలోని చాలా చోట్ల మామిడి కాయలు రాలిపోయాయి. పంట చేతికొచ్చే సమయంలో కాయలన్నీ నేలరాలడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందల ఎకరాల్లో మామిడి కాయలు నేలరాలగా.. అధికారులు పంట నష్టంపై వివరాలు సేకరించే పనిలో పడ్డారు.
34 వేల ఎకరాల్లో సాగు
మామిడి తోటలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 34 వేల ఎకరాల్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో అత్యధికంగా మహబూబాబాద్ జిల్లాలోనే ఎక్కువ శాతం మామిడి తోటలు ఉన్నాయి. ఈ జిల్లాలో మొత్తంగా 14,560 ఎకరాల మేర మామిడి తోటలు ఉండగా, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో 9,600, జనగామ జిల్లాలో 6,700, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1,500, ములుగు జిల్లాలో 750 ఎకరాల పైగా మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి.
ఎకరాకు వేలల్లో పెట్టుబడి
ఏటా పూత పూసింది మొదలు.. కాయలు కోతకు వచ్చే వరకు మామిడి రైతులు పెట్టుబడి రూపంలో రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. అయినా వాతావరణ పరిస్థితులు అనుకూలించక పూత రాలడం, అకాల వర్షాలు, వడగండ్ల వానలు దిగుబడిని చాలావరకు దెబ్బ తీస్తున్నాయి. ఫలితంగా ఏటా మామిడి రైతులకు నష్టాలే మిగులుతుండగా, ఈసారి కూడా పరిస్థితి అలాగే ఉందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పెట్టుబడులు కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు.
అకాల వర్షంతో నష్టం
ఇప్పటికే మామిడి పంట్ల సీజన్ నడుస్తుండటంతో చాలా చోట్లా కాయలు కోతకు వచ్చాయి. ఈ క్రమంలోనే నాలుగైదు రోజుల కిందట ఉమ్మడి జిల్లాలోని మహబూబాబాద్, జనగామ, వరంగల్ జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో ప్రధానంగా కోతకు వచ్చిన మామిడి కాయలు రాలాయి. ఇదిలాఉంటే మంగళవారం అర్ధరాత్రి కురిసిన ఈదురుగాలుల వానకు నష్టం మరింత ఎక్కువైంది. ప్రధానంగా మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలతో పాటు హనుమకొండ జిల్లాలోని పరకాల, నడికూడ, శాయంపేట మండలాల్లో కురిసిన వర్షానికి చాలాచోట్ల మామిడి పంటలు దెబ్బతిన్నాయి. చెట్లకు ఉన్న కాయలన్నీ నేలరాలడంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.
నష్టం అంచనాల్లో ఆఫీసర్లు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి వీచిన ఈదురు గాలులు, భారీ వర్షాలకు చాలా చోట్లా పంటలు దెబ్బతిన్నాయి. పరకాల, శాయంపేట, ఆత్మకూరు, నడికూడ మండలాల్లో నష్ట తీవ్రత ఎక్కువగా ఉంది. చాలా చోట్లా కోతకు వచ్చిన వరి నేలవాలగా, కళ్లాల్లో ఆరబోసిన వడ్లు తడిసి ముద్దయ్యాయి. ఇక మొక్కజొన్న కూడా నేలవాలగా, మామిడి తోటల్లో చాలావరకు కాత నేలరాలి తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కాగా పంట నష్టంపై నివేదిక తయారు చేసేందుకు వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు ఫీల్డ్ విజిట్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ.. ఏఏ పంటలు.. ఎంత మేర దెబ్బతిన్నాయో రిపోర్ట్ తయారు చేస్తున్నారు. నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని ఆఫీసర్లు చెబుతుండగా, నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.
(రిపోర్టింగ్: హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)
సంబంధిత కథనం
టాపిక్