





Best Web Hosting Provider In India 2024

Kesari 2 Movie: ఈ సినిమా చూసి భావోద్వేగానికి గురైన ఢిల్లీ సీఎం.. దేశం కోసం ఏదో ఒకటి చేయాలంటూ.. రానా దగ్గుబాటి కూడా..
Kesari 2 Movie: ఢిల్లీ సీఎం రేఖా గుప్తా హిందీ మూవీ కేసరి 2 చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఈ సినిమా చూసిన తర్వాత తన రోమాలు నిక్కబొడుచుకున్నాయని, దేశం కోసం తాను ఏం చేయడానికైనా సిద్ధమని ఆమె అనడం విశేషం.
Kesari 2 Movie: బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ కుమార్ నటించిన మూవీ కేసరి 2. ఈ సినిమా ఏప్రిల్ 18న థియేటర్లలో రిలీజవుతోంది. అయితే అంతకుముందు మంగళవారమే (ఏప్రిల్ 15) ఢిల్లీలో స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కూడా మూవీని చూసి భావోద్వేగానికి గురైనట్లు వెల్లడించారు.
కేసరి 2 మూవీపై రేఖా గుప్తా ఏమన్నారంటే..
అక్షయ్ కుమార్ గతంలో కేసరి మూవీతో వచ్చి ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించిన విషయం తెలుసు కదా. ఇప్పుడదే హీరో కేసరి 2తో వస్తున్నాడు. ఈసారి జలియన్ వాలా బాగ్ ఘటనపై సినిమాను రూపొందించారు. ఈ సినిమాను ఢిల్లీ సీఎం రేఖా గుప్తా చూశారు. ఆ తర్వాత ఆమె ఏఎన్ఐతో మాట్లాడుతూ.. తాను భావోద్వేగానికి గురైనట్లు చెప్పారు.
“ఈ సినిమా నా రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. ఆరోజు జలియన్‌వాలా బాగ్ లో ఎలా రక్తంతో నిండిన బైసాఖిని జరుపుకున్నారో చూస్తేనే గుండె తరుక్కుపోతుంది. ఎంతో మంది దేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను అర్పించారు. చరిత్ర పుటల్లోకి ఎక్కారు. మనకు కనీసం వాళ్ల పేర్లు కూడా తెలియదు.
ఇప్పుడు ఈ దేశంలో మనమందరం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నాం. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ దేశం కోసం బతుకుతూ, దేశానికి ఏదో చేయడం మన విధి. నా శరీరం, నా మెదడు, నా జీవితాన్ని ఈ దేశానికి అంకితమివ్వాలని నేను నిర్ణయించుకున్నాను. నేను చాలా ఎమోషనల్ అయ్యాను” అని రేఖా గుప్తా చెప్పారు.
రానా దగ్గుబాటి ఏమన్నాడంటే?
ఇక ఈ కేసరి 2 మూవీని ఇటు టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి కూడా చూశాడు. ఈ మూవీని ప్రతి భాషలోనూ రిలీజ్ చేయాలని, తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా చూపించాలని తాను అనుకుంటున్నట్లు తెలిపాడు. కేసరి ఫ్రాంఛైజీలో మరిన్ని సినిమాలను తీసుకురావాలని అనుకుంటున్నట్లు అక్షయ్ కుమార్ ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే.
2019లో తొలి సినిమా కేసరి రిలీజైంది. ఇది కూడా 1897లో జరిగిన నిజ జీవిత స్టోరీ. కేవలం 21 మంది సిక్కు సైనికులు 10 వేల మంది ఆఫ్ఘన్లతో ఎలా పోరాడారో ఈ సినిమాలో చూపించారు. సారాగర్హి యుద్ధంగా చరిత్రలో దీనికి పేరుంది. ఇక కేసరి 2లో జలియన్‌వాలా బాగ్ మారణకాండ గురించి చూపించబోతున్నారు. ఈ సినిమాలో మాధవన్, అనన్య పాండే కూడా నటించారు.