




Best Web Hosting Provider In India 2024
Priyadarshi: ఆ పచ్చళ్ల అమ్మాయిలను ఎక్కడా కించపరచలేదు.. ట్రెండ్ వాడుకున్నామంతే: ప్రియదర్శి కామెంట్స్
Priyadarshi: నటుడు ప్రియదర్శి తన సారంగపాణి జాతకం మూవీ ప్రమోషన్లలో అలేఖ్య పచ్చళ్ల ట్రెండ్ ను వాడుకోవడంపై స్పందించాడు. తాము ఎక్కడా వాళ్లను కించపరచలేదని ఈ సందర్భంగా అతడు స్పష్టం చేశాడు.
Priyadarshi: టాలీవుడ్ నటుడు ప్రియదర్శి ఇప్పుడు సారంగపాణి జాతకం అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలుసు కదా. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ బుధవారం (ఏప్రిల్ 16) జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ప్రియదర్శి.. తన మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ లో ఉన్న అలేఖ్య పచ్చళ్ల వివాదాన్ని వాడుకోవడంపై స్పందించాడు.
ప్రియదర్శి ఏమన్నాడంటే?
అలేఖ్య చిట్టి పచ్చళ్ల వ్యాపారం చేసుకునే ముగ్గురు అమ్మాయిలు ఈ మధ్య ఓ వాట్సాప్ చాట్ లో కస్టమర్ ను బూతులు తిట్టి తమ వ్యాపారాన్ని పోగొట్టుకున్న సంగతి తెలుసు కదా. ఈ వివాదం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది. చాలా మంది ఈ పచ్చళ్ల వ్యాపారం నడిపే ముగ్గురు అమ్మాయిలను దారుణంగా ట్రోల్ చేశారు. సారంగపాణి జాతకం మూవీ ప్రమోషన్లలో భాగంగా ఆ మూవీ టీమ్ కూడా ఈ వివాదాన్ని వాడుకుంది. అందులో ప్రియదర్శి కూడా ఉన్నాడు.
దీనిపై తాజాగా ట్రైలర్ లాంచ్ సందర్భంగా అతడు స్పందించాడు. “మేము ఎక్కడగానీ వాళ్ల పచ్చళ్లుగానీ, ఆ అమ్మాయిలపైగానీ ఎలాంటి కామెంట్స్ చేయలేదు. దాని గురించి మేము ఏమీ చేయలనుకోలేదు. ఇంటర్నెట్ లో బాగా ట్రెండ్ అవుతున్న దాన్ని వాడుకొని దాని ద్వారా ముందుకు తీసుకెళ్లాలని అనుకున్నాం. అక్కడ కూడా నేను పచ్చళ్ల వ్యాపారం చేస్తానని వాళ్ల సైడ్ తీసుకున్నాను. ఓ సినిమా చూసో, ఓ రీల్ చూసో నేనూ దాని నుంచి ఇన్‌స్పైర్ అయ్యాను” అని ప్రియదర్శి అన్నాడు.
సారంగపాణి జాతకం మూవీ ట్రైలర్
సారంగపాణి జాతకం.. ఇప్పటికే పలుమార్లు రిలీజ్ వాయిదా పడిన ఈ సినిమా మొత్తానికి ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఓ బోల్డ్ డైలాగుతోపాటు ట్రైలర్ మొత్తం నవ్వులు పూయించేలా సాగింది. ప్రియదర్శి, వెన్నెల కిశోర్, హర్ష త్రయం పోటీ పడి మరీ నవ్వించడానికి ప్రయత్నించారు. మూవీలో ఫిమేల్ లీడ్ గా రూపా కొడువాయూర్ నటించింది.
సారంగపాణి జాతకం మూవీని ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. గతంలో అష్టాచెమ్మ, జెంటిల్మెన్, సమ్మోహనంలాంటి సినిమాలు డైరెక్ట్ చేసిన అతడు.. ఈసారి ఈ సారంగపాణి జీవితం మూవీతో ఓ పూర్తి నవ్వుల రైడ్ ను ప్రేక్షకులకు అందించడానికి సిద్ధమయ్యాడు.
ఈ సినిమాను శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించాడు. వివేక్ సాగర్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాలో మొత్తం తెలుగు మాట్లాడే నటీనటులే నటించినట్లు మేకర్స్ వెల్లడించారు. ప్రియదర్శితోపాటు వెన్నెల కిశోర్, హర్ష చెముడు, నరేష్, అవసరాల శ్రీనివాస్, రాజా చెంబోలు, తనికెళ్ల భరణిలాంటి వాళ్లు నటించారు. సారంగపాణి జాతకం మూవీ ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది.
సంబంధిత కథనం