



Best Web Hosting Provider In India 2024

ఒకేఒక్కడు రెండు కమిషనరేట్ లు 18 బైకులు-వరుస చోరీలకు పాల్పడుతున్న దుండగుడి అరెస్ట్
ఉపాధి కోసం ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న ఓ యువకుడు…ఈ డబ్బు సరిపోవకపోవడం రాంగ్ రూట్ ఎంచుకున్నాడు. ఈజీ మనీ కోసం బైక్ ల దొంగతనం మొదలుపెట్టాడు. ఇలా 18 బైక్ లో కొట్టేశాడు. వీటన్నింటిని ఒకేసారి అమ్మేందుకు ఒకచోట భద్రపరిచాడు. పోలీసుల తనిఖీల్లో పట్టుబడి అసలు విషయం చెప్పాడు.
ఉపాధి కోసం సొంతూరు విడిచి వరంగల్ నగర బాట పట్టిన ఓ యువకుడు ఈజీ మనీ కోసం రాంగ్ రూట్ ఎంచుకున్నాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో బైక్ చోరీలకు పాల్పడటం మొదలెట్టాడు. ఒక్కడే వరంగల్, రాచకొండ కమిషనరేట్ ల పరిధిలో ఏకంగా 18 బైక్ లు కొట్టేశాడు. అనంతరం వాటన్నింటినీ ఒకేసారి అమ్మేందుకు ప్లాన్ చేసి, ఇంటి వద్ద భద్రపరుచుకున్నాడు. చివరకు అనూహ్యంగా పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు.
రద్దీ ప్రాంతాల్లో పార్క్ చేసి ఉన్న బైక్ లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న దొంగను హసన్ పర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి దాదాపు రూ.10 లక్షల విలువైన 18 బైక్ లు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి అరెస్టుకు సంబంధించిన వివరాలను కాజీపేట ఏసీపీ తిరుమల్ బుధవారం హసన్ పర్తి పీఎస్ లో వెల్లడించారు.
బతుకుదెరువు కోసం వరంగల్ కు
జనగామ జిల్లా చిల్పూరు మండలం ఫతేపూర్ గ్రామానికి చెందిన గుగులోతు చందూలాల్ బతుకు దెరువు కోసం కొంతకాలం కిందట వరంగల్ నగరానికి వచ్చాడు. ప్రస్తుతం హనుమకొండ గోపాలపూర్ లో ఉంటున్నాడు. ఉపాధి కోసం ఫుడ్ డెలివరీ బాయ్ గా పని చేసేందుకు నిర్ణయించుకున్నాడు. కానీ తనకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడంతో తన ఫ్రెండ్ లాగిన్ ఐడీతో జొమాటో, స్విగ్గీ, ర్యాపిడో సంస్థల్లో పని చేస్తుండేవాడు. కానీ వీటి ద్వారా వచ్చే ఆదాయం జల్సాలకు సరిపోకపోవడంతో చందూలాల్ ఈజీగా మనీ సంపాదించాలని నిర్ణయానికి వచ్చాడు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన బైక్ లను చోరీ చేసి, వాటిని అమ్మి డబ్బులు సంపాదించాలని పథకం రచించాడు.
18 బైక్ లు చోరీ
తన ప్లాన్ లో భాగంగా చందూలాల్ బైక్ చోరీలు మొదలు పెట్టాడు. ఈ మేరకు హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో 7, హసన్ పర్తి స్టేషన్ పరిధిలో 3, కేయూ పీఎస్ పరిధిలో ఒక బైక్ దొంగిలించాడు. వీటితో పాటు రాచకొండ కమిషనరేట్ లో కూడా బైక్ చోరీలు చేశాడు. అక్కడ ఉప్పల్ స్టేషన్ పరిధిలో 4, భువనగిరి పరిధిలో 2, హైదరాబాద్ లో ఒకటి.. ఇలా మొత్తంగా 18 బండ్లు దొంగిలించాడు. ఈ మేరకు తాను దొంగిలించిన బైక్ లన్నీ ఒకే సారి అమ్మేందుకు వాటన్నింటినీ తన ఇంటి వద్ద భద్రపరుచుకున్నాడు.
పారిపోయే ప్రయత్నం చేసి..
బుధవారం ఉదయం హసన్ పర్తి పోలీసులు హసన్‌పర్తి మండల కేంద్రంలో వాహన తనీఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అక్కడికి బైక్ పై వచ్చిన చందూలాల్ పోలీసులను చూసి, పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో అతడిని పట్టుకున్న పోలీసులు తన వద్ద ఉన్న బైక్ కు సంబంధించిన ఆధారాలు చూపాల్సిందిగా కోరారు. కానీ చందూలాల్ వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అనుమానంతో పోలీసులు అతడిని విచారించారు. దీంతో చందూలాల్ అసలు విషయాన్ని ఒప్పుకున్నాడు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు చందూలాల్ ఇంటి వద్ద ఉన్న బైక్ లు అన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు.
సిబ్బందికి సీపీ అభినందనలు
నిందితుడిని పట్టుకోవడంతో పాటు చోరీకి గురైన వాహనాలను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ చూపిన సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, కాజీపేట ఏసీపీ తిరుమల్, హసన్‌పర్తి సీఐ చేరాలు, ఎస్సైలు దేవేందర్, రవి, సిద్దయ్యలు, ఏఏవో సల్మాన్ పాషా, హెడ్ కానిస్టేబుల్ వివేకానంద, కానిస్టేబుళ్లు క్రాంతికుమార్, తిరుపతయ్య, భరత్‌కుమార్, దేవేందర్, మహేందర్, రమేష్, పూర్ణాచారీ, రాజ్‌కుమార్, సోమన్న, ధనుంజయ, నాగరాజు, నవీన్‌లను వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ అభినందించారు.
(రిపోర్టింగ్: హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)
సంబంధిత కథనం
టాపిక్