





Best Web Hosting Provider In India 2024

ఉద్యోగాల్లో తొలగించినా అప్కాస్‌లో తొలగించరు.. అధికారుల తీరుతో సంక్షేమ పథకాలకు కూడా దూరం…
ఏపీలో ప్రభుత్వాన్ని నడిపించే అధికార పార్టీ మారినపుడల్లా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై వేటు వేయడం రివాజుగా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఉద్యోగాల నుంచి తొలగించిన వారి పేర్లను అప్కోస్ జాబితాల నుంచి తొలగించక పోవడంతో సంక్షేమ పథకాలకు కూడా దూరం అవుతున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు కోల్పోయిన వారిని ఏపీ కార్పొరేషన్ ఆఫ్ ఔట్ సోర్స్డ్ సర్వీసెస్- అప్కోస్ జాబితాల నుంచి తొలగించక పోవడంతో వారికి సంక్షేమ పథకాలు కూడా అందడం లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో అధికార పగ్గాలు చేపట్టే రాజకీయ పార్టీలు మారినపుడల్లా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై వేటు వేయడం రివాజుగా మారింది. ప్రభుత్వ ఉద్యోగాల కల్పన ఆర్థికంగా భారంగా మారుతోందని, కాంట్రాక్టు విధానంలో ఉద్యోగుల్ని నియమించుకునే విధానానికి 90వ దశకంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మొదలైంది.
ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ విధానంలో అనేక మార్పులు తీసుకు వచ్చాయి. కాంట్రాక్టు విధానంలో ఉద్యోగాల కల్పన కాస్త ఏజెన్సీల ద్వారా నియమించుకునే పద్ధతి తర్వాత కాలంలో అమలైంది. నిర్ణీత కాల వ్యవధితో నియామకాలు, ఏజెన్సీల ద్వారా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ప్రభుత్వంలో భాగం అయ్యాయి.
ప్రభుత్వ నియామకాలకు చెల్లు…
2014లో రాష్ట్ర విభజన తర్వాత రెండేళ్లకు 2016లో హైదరాబాద్ నుంచి పూర్తి స్థాయిలో ప్రభుత్వ శాఖలను విజయవాడు తరలించారు. సచివాలయ శాఖలు, అసెంబ్లీను కూడా అమరావతికి షిఫ్ట్ చేశారు. ఈ క్రమంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో అయా శాఖల అవసరాలకు అనుగుణంగా కాంట్రాక్టు ఉద్యోగుల్ని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని నియమించుకున్నారు.
అప్పట్లో అన్ని శాఖల్లో రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉద్యోగ నియామకాలు జరిగాయి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా భర్తీ చేసేవారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాత విధానాల్లో కీలక మార్పులు తీసుకు వచ్చారు. టీడీపీ అనుకూల ముద్రతో పెద్ద సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించారు.
దీంతో పాటు ప్రైవేట్ ఏజెన్సీలకు కమిషన్లు చెల్లించడం, ఉద్యోగులకు జీతాల చెల్లింపుల్లో ఏజెన్సీలు చేతివాటం ప్రదర్శిస్తున్నాయనే ఆరోపణలతో ప్రభుత్వ ఏజెన్సీని ఏర్పాటు చేశారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం అప్కోస్ ఏర్పాటు చేసి దాని ద్వారా జీతాలు చెల్లించేవారు. అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగుల జీతభత్యాల నుంచి పిఎఫ్ చెల్లింపుల వరకు అప్కోస్ పర్యవేక్షణలో జరిపారు.
కొంత మేలు బోలేడు నష్టం…
అప్కోస్ ద్వారా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కొంత మేలు జరిగినా ఆ తర్వాత వారిని ప్రభుత్వ ఉద్యోగులుగానే పరిగణించి 2022లో వారికి సంక్షేమ పథకాలకు అనర్హులుగా ప్రకటించారు. దీంతో దాదాపు లక్షన్నర మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు చెందిన కుటుంబాలకు సామాజిక పెన్షన్లను తొలగించారు.
ఒకే రేషన్ కార్డులో పేర్లు ఉన్నాయనే సాకుతో అప్పట్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలను దూరం చేశారు. రూ.25-30వేల లోపు జీతాలు ఉన్న వారిని ఈ నిబంధనల నుంచి మినహాయించాలని వేడుకున్నా అప్పట్లో ప్రభుత్వం కరుణించలేదు.
కూటమిలో భారీగా ఉద్యోగాల కోత…
2024 జూన్‌లో వైసీపీ ఓటమి పాలై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వ హయంలో నియమించిన వారిని పెద్ద సంఖ్యలో ఉద్యోగాల నుంచి తొలగించారు. వైసీపీ సానుభూతిపరులనే ముద్ర వేసి పెద్ద సంఖ్యలో ఉద్యోగుల్ని ఇళ్లకు పంపారు. ఉద్యోగ నియామకాలు చేసే సమయంలోనే కో టెర్మినస్ వర్తించే నిబంధనలు ఉండటంతో ఎవరి దారి వారు చూసుకున్నారు. ప్రస్తుతం అప్కోస్ తొలగించి మళ్లీ ఏజెన్సీలను తీసుకు రావాలని ప్రభుత్వం నిర్ణయించింది.
నెరవేరని ఎన్నికల హామీలు..
ఎన్నికల సమయంలో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తొలగించిన సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 30వేల జీతంలోపు ఉన్న వారికి పథకాలను వర్తింప చేస్తామని హామీ ఇచ్చినా అది అమలు కాలేదు.మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగల నుంచి తొలగించిన వారిని ఇంకా అప్కోస్ జాబితాల్లోనే కొనసాగిస్తున్నారు.
ఉద్యోగాలు కోల్పోయి జీతాలు అందకపోయినా అప్కోస్ జాబితాల్లోనే ఉండటంతో వారికి సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. ఒకే రేషన్ కార్డులో ఉన్నారనే కారణంతో వారి కుటుంబాల్లో అర్హులైన వారిని సామాజిక పెన్షన్లకు అనర్హులుగా పరిగణిస్తున్నారు. అప్కోస్ జాబితాల నుంచి తొలగించి తమకు ప్రభుత్వ పథకాలు వర్తింప చేయాలని ఉద్యోగాలు కోల్పోయిన వారు డిమాండ్ చేస్తున్నారు.
సంబంధిత కథనం
టాపిక్