





Best Web Hosting Provider In India 2024

ఏపీలో ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ జారీ.. త్వరలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు
ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ సామాజిక రిజర్వేషన్లలో వర్గీకరణ అమలు చేసేందుకు మార్గం సుగమం చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేశారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని ఇప్పటికే అసెంబ్లీలో చట్ట సవరణ చేశారు. ఉభయ సభలు అమోదించిన బిల్లుకు గవర్నర్ అమోదం కూడా లభించింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేశారు. ఈ మేరకు న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీ, శాసన మండలిలో అమోదం పొందాయి. రాష్ట్ర ప్రభుత్వ బిల్లులకు గవర్నర్ అమోదం తెలపడంతో వాటిని తక్షణమే అమల్లోకి తెచ్చేందుకు వీలుగా ఆర్డినెన్స్ జారీ చేశారు.
ఏపీలో ఎస్సీ వర్గీకరణకు అవసరమైన చట్ట సవరణ అమల్లోకి రావడంతో ఉద్యోగ నియమాక ప్రక్రియ వేగం పుంజుకోనుంది. త్వరలోనే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే డిఎస్సీ నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం జూన్‌లోపు నియామకాలను పూర్తి చేస్తామని ప్రకటించింది.
ఆర్డినెన్స్ ప్రతిపాదనకు క్యాబినెట్ అమోదం
సమాజంలో వివిధ ఉప కులాల మధ్య ఏకీకృత మరియు సమానమైన పురోగతి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల మధ్య ఉప-వర్గీకరణను అమలు చేయటానికి సాంఘిక సంక్షేమ శాఖ చేసిన ముసాయిదా ఆర్డినెన్స్ ప్రతిపాదనకు రాష్ట్ర మండలి ఆమోదించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణను అమలు చేయడానికి చేసిన ప్రతిపాదనకు మంత్రివర్గ సమావేశంలో ఆర్డినెన్స్‌కు ఆమోదం లభించింది. సమాజంలో అన్ని షెడ్యూల్డ్ కులాల వర్గాల ఏకీకృత మరియు సమాన ప్రగతిని నిర్ధారించడమే ఆర్డినెన్స్ ముఖ్య ఉద్దేశ్యమని ప్రభుత్వం వివరించింది.
ఎస్సీ కులాల వర్గీకరణ ఇలా…
రాష్ట్రంలోని 59 షెడ్యూల్డ్ కులాలను జనాభా,వెనుకబాటుతనం మరియు సామాజిక సమైక్యతల ఆధారంగా మూడు కేటగిరీలుగా విభజించడం జరిగింది. ఈ మూడు కేటగిరీలకు రిజర్వేషన్ల శాతం క్రింది విధంగా నిర్ణయించబడింది:
గ్రూప్-I (12 కులాలు): 1% రిజర్వేషన్
• బవురి, చచాటి, చండాల, దండాసి, డొమ్, ఘాసి, గొడగలి, మెహతర్, పాకి, పామిడి, రెల్లి, సాప్రు
గ్రూప్-II (18 కులాలు): 6.5% రిజర్వేషన్
• అరుంధతీయ, బిందల, చమార్, చంభార్, దక్కల్, ధోర్, గొదారి, గోసంగి, జగ్గాలి, జంబువులు, కొలుపులవండ్లు, మాదిగ, మాదిగ దాసు, మాంగ్, మాంగ్ గరోడి, మాతంగి, సమగార, సింధోలు
గ్రూప్-III (29 కులాలు): 7.5% రిజర్వేషన్
• ఆది ద్రావిడ, అనముక్, అరయ మాల, అర్వ మాల, బారికి, బ్యాగర, చలవాది, ఎల్లమలవార్, హోలేయ, హోలేయ దాసరి, మదాసి కురువ, మహర్, మాల, మాల దాసరి, మాల దాసు, మాల హన్నాయి, మాలజంగం, మాల మస్తి, మాల సాలె, మాల సన్యాసి, మన్నే, ముండల, సంబన్, యాతల, వల్లువన్, ఆది ఆంధ్ర, మస్తి, మిట్టా అయ్యలవార్, పంచమ
200 పాయింట్ల రోస్టర్ అమలు…
ఎస్సీ ఉప వర్గీకరణ కోసం 200 పాయింట్ల రోస్టర్ వ్యవస్థను అనుసరించనున్నారు. ఇది రెండు సైకిల్స్ లో(ఒక్కొక్కటి 1-100 వరకు) పనిచేస్తుంది.ఈ ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని షెడ్యూల్డ్ కులాల వర్గాలకు విద్య మరియు ఉద్యోగ అవకాశాల్లో సమాన మరియు న్యాయమైన ప్రవేశం లభిస్తుందని దీని ద్వారా రాజ్యాంగ లక్ష్యాలను సాధించి సామూహిక అభివృద్ధిని నిర్ధారించగలమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఆర్డినెన్స్ రాష్ట్రంలోని 26 జిల్లాల్లో అమల్లోకి వస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్