



Best Web Hosting Provider In India 2024
వక్ఫ్ చట్టంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టం 2025 రాజ్యాంగం ప్రకారం చెల్లుబాటు కాదంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ కొనసాగించింది. ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వానికి కీలక ఆదేశాలు వెలువరించింది.
వక్ఫ్ (సవరణ) చట్టం, 2025 రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై స్పందించడానికి సుప్రీంకోర్టు గురువారం కేంద్రానికి వారం రోజుల గడువు ఇచ్చింది. తదుపరి విచారణ తేదీ వరకు, నోటిఫికేషన్ ద్వారా ప్రకటించబడిన లేదా నమోదు చేయబడిన ‘ వక్ఫ్ బై యూజర్’తో సహా వక్ఫ్‌ను డీనోటిఫై చేయరు లేదా దాని స్వభావాన్ని మార్చరు అని కేంద్రం ఇచ్చిన హామీని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. తదుపరి విచారణ తేదీ వరకు, ‘వక్ఫ్ బై యూజర్’ సహా మిగతా వివాదాస్పద ప్రావిజన్స్ పై యథాతథ స్థితి కొనసాగుతుందని సుప్రీంకోర్టుకు కేంద్రం హామీ ఇచ్చింది. అంతేకాకుండా, వక్ఫ్ కౌన్సిల్ లేదా వక్ఫ్ బోర్డులకు ఎటువంటి నియామకాలు చేయబోమని కేంద్రం తెలిపింది.
మే 5 తరువాత..
ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న కేంద్రం, రాష్ట్రాలు, పిటిషనర్ల ప్రతిస్పందనలను దాఖలు చేసిన తరువాత, తదుపరి విచారణను మే 5 నుండి ప్రారంభించాలని కోర్టు నిర్ణయించింది. ఐదు పిటిషన్లను లీడ్ పిటిషన్లుగా ఎంపిక చేయాలని, వాటిని పిటిషనర్లు నిర్ణయిస్తారని కోర్టు సూచించింది. గతంలో 1995, 2013 వక్ఫ్ చట్టాలను సవాలు చేస్తూ హిందూ పార్టీలు దాఖలు చేసిన కేసులను కూడా సుప్రీంకోర్టు పరిశీలించింది.
ఏప్రిల్ 16న వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు ఏమి చెప్పింది?
బుధవారం, అత్యున్నత న్యాయస్థానం ధర్మాసనం ఈ చట్టంపై తన ఆందోళనలను వ్యక్తం చేసింది. చట్టంలోని మూడు అంశాలను ప్రశ్నించింది. ‘వక్ఫ్ బై యూజర్’ ఆస్తుల స్థితి, వక్ఫ్ కౌన్సిల్, వక్ఫ్ బోర్డులలో ముస్లిమేతర సభ్యులు మెజారిటీగా ఉండడం, ఒక ఆస్తిపై ప్రభుత్వ ఆస్తి అనే వివాదం తలెత్తితే, ఆ ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా నిర్ధారించకపోవడం.. అనే ఈ మూడు అంశాలను సుప్రీంకోర్టు లేవనెత్తింది.
చివరి నిమిషంలో ఉత్తర్వుల నిలిపివేత
ఈ అంశాల ఆధారంగా వక్ఫ్ చట్టం అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని సుప్రీంకోర్టు మొదట భావించింది. అయితే, ఈ కేసు తదుపరి విచారణకు రానున్న గురువారం పూర్తి వివరాలు అందజేస్తామని కేంద్రం చెప్పడంతో, వక్ఫ్ చట్టం అమలుపై స్టే విధించడాన్ని సుప్రీంకోర్టు నిలిపివేసింది.
పిటిషనర్లు వీరే
వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అమానతుల్లా ఖాన్, పౌర హక్కుల రక్షణ సంఘం, అర్షద్ మదాని, సమస్త కేరళ జమియతుల్ ఉలేమా, అంజుమ్ కడారి, తైయ్యబ్ ఖాన్ సల్మానీ, మహ్మద్ షఫీ, మహ్మద్ ఫజ్లుర్రహీమ్, ఆర్జేడీ నాయకుడు మనోజ్ కుమార్ ఝా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ (CPI), తమిళగ వెట్రి కజగం చీఫ్, నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ కూడా ఈ అంశంపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB), జమియత్ ఉలామా-ఇ-హింద్, ద్రవిడ మున్నేట్ర కజగం (DMK), కాంగ్రెస్ ఎంపీలు ఇమ్రాన్ ప్రతాప్‌గఢి, మహ్మద్ జావేద్ ఇతర కీలక పిటిషనర్లు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link