



Best Web Hosting Provider In India 2024

వేములవాడ ఆలయ పునర్నిర్మాణానికి ముహూర్తం ఖరారు… జూన్ 15న పనులు ప్రారంభం
దక్షిణ కాశిగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం మినీ కాశీగా మారబోతుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా రాబోయే వెయ్యేళ్ళకు సరిపడే విధంగా ఆలయం పునర్నిర్మాణం కానుంది. ఉన్నతాధికారుల బృందం వేములవాడ ను సందర్శించి ఆలయ పరిసరాలను పరిశీలించి జూన్ 15న ఆలయ పునఃనిర్మాణం పనులు చేపట్టాలని నిర్ణయించారు.
భక్తి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనులను జూన్ 15 నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. గత ఏడాది నవంబర్ 20న సీఎం రేవంత్ రెడ్డి వేములవాడలో ఆలయ విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. 47 కోట్లు మంజూరు చేయడంతోపాటు బడ్జెట్లో 100 కోట్లు కేటాయించారు.
పనులు వేగవంతం చేసేందుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నేతృత్వంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజా రామయ్యార్, కమిషనర్ శ్రీధర్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, ఎండోమెంట్ ఆర్కిటిక్, స్థపతులు, ఇంజనీరింగ్ అధికారులు వేములవాడ ను సందర్శించి పరిసరాలను పరిశీలించారు. ఆలయ పునః నిర్మాణపై సమీక్షించారు. ఈనెలాఖరులో శృంగేరి పీకాధిపతుల అనుమతుల కోసం వెళ్ళాలని నిర్ణయించారు. వారి సూచనలతో భక్తిభావం విరాజిల్లేలా జూన్ 15న పనులు చేపట్టాలని ముహూర్తం ఖరారు చేశారు.
విశాలంగా ఆలయ ప్రాంగణం…
రాజరాజేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణంతో పురాతన శిల్పకళ, సంప్రదాయానికి సౌందర్యానికి ప్రతిరూపంగా నిలిచేలా పలు డిజైన్లను సిద్దం చేశారు. శైవ సంప్రదాయాలు ఉట్టిపడేలా ఆలయాన్ని విస్తరించనున్నారు. పలు రకాల డిజైన్ లను సిద్ధం చేసి శృంగేరి పీఠాధిపతుల సమక్షంలో ఫైనల్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.
ఆగమ శాస్త్రం, వాస్తు అంశాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఆలయం పునః నిర్మాణం చేపట్టాలని కార్యాచరణ రూపొందిస్తున్నామని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యార్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ దేవాలయ అభివృద్ధి కోసం 38 కోట్ల ప్రకటించారని చెప్పారు.
పనులు ప్రారంభమైతే భీమేశ్వరాలయంలో భక్తులకు దర్శనం…
ఆలయ పునర్నిర్మాణం పనులు ప్రారంభమైతే స్వామివారికి జరిగే నిత్య పూజలకు ఎక్కడ ఆటంకం కలగదని, ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు యథావిధిగా ఏకాంతంగా కొనసాగుతాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. స్వామి దర్శనం కోసం వచ్చే భక్తుల ఇబ్బందులు తొలగించేందుకు, భక్తులకు స్వామి వారి దర్శనం వేగంగా కల్పించేందుకు మెరుగైన వసతులు కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
భక్తులకు ఇబ్బంది లేకుండా భీమేశ్వరాలయంలో దర్శనాలను కొనసాగించనున్నామని తెలిపారు. శృంగేరి పీఠం అనుమతులు తీసుకున్న తర్వాత ఆలయ అభివృద్ధి పనులు టెండర్ ప్రక్రియ పూర్తి చేసి జూన్ 15న ఆలయ పునర్నిర్మాణం పనులు ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు.
మే నెలలో టెండర్లు
శృంగేరి పీఠాధిపతుల అనుమతి, ఆశీర్వాదం తీసుకొని ఆలయ అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఆలయ అధికారులు తెలిపారు. రాబోయే మే నెలలో రోడ్డు వెడల్పు పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామని ఆది శ్రీనివాస్ తెలిపారు.
ఆలయ విస్తిర్ణం అభివృద్ధి కోసం ప్రభుత్వం 76 కోట్ల , అన్నదాన సత్రానికి 35 కోట్ల మంజూరు చేసిందని అన్నారు. వేములవాడ దేవాలయ అభివృద్ధి, పట్టణ అభివృద్ధి సమాంతరంగా జరగాలని లక్ష్యంతో రోడ్డు వెడల్పు పనులకు 47 కోట్ల నిధులు మంజూరు చేసిందని అన్నారు. అన్నదానం సత్రం నిర్మాణ పనులకు టెండర్ పూర్తి చేశామని త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని చెప్పారు.
భీమన్న ఆలయంలో ఏర్పాట్లు
రాజన్న ఆలయం పునర్నిమిస్తే భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు భీమేశ్వరాలయంలో ఏర్పాట్లను అధికారుల బృందం పరిశీలించింది. ఆలయ ఆవరణలో కళ్యాణ మండపం, అభిషేకం మండపం, కోడె కట్టుట, క్యూ లైన్ తదితరు ఆర్జిత సేవల కోసం చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో స్థపతి వల్లినాయగం, ఆర్కిటెక్ సత్యనారాయణ, ఈఓ వినోద్ తదితరులు పాల్గొన్నారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)
సంబంధిత కథనం
టాపిక్