




Best Web Hosting Provider In India 2024

ఎన్నిసార్లు ఓడినా తగ్గేదేలే.. 24సార్లు ఓడినా 25వసారి ప్రభుత్వోద్యోగం సాధించాడు, ఇది ఒక సామాన్యుడి విజయం
ఒక్కసారి ఓడిపోతేనే మరో అడుగు వేయడానికి ఆలోచించేవారు ఎంతోమంది. అలాంటిది ఒక యువకుడు 24 సార్లు బ్యాంకు జాబ్ కొట్టలేకపోయినా 25వసారి కూడా ప్రయత్నించి విజేతగా నిలిచాడు. ఇది మనలాంటి ఒక సామాన్య వ్యక్తి విజయం.
ఎప్పుడూ ఎలన్ మస్క్, బిల్ గేట్స్ వంటి వారి గురించే చెబితే ఎలా? మనలో ఒకడిగా ఉండి, పేదరికంలో పుట్టి అనుకున్న విజయాన్ని సాధించిన ఒక సామాన్యుడి విజయగాథ ఇప్పుడు చెప్పుకుందాం. ఇతడు మనలాంటి వ్యక్తే. ఓటమితోనే స్నేహం చేసిన యువకుడు. కానీ ఓటమి ఆయన విజయాన్ని ఆపలేకపోయింది.
గవర్నమెంట్ ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకునే వారు ఎంతోమంది. కానీ ఆ ఆశయ సాధనలో అడుగు ముందుకు వేసేవారు చాలా తక్కువ. ఆ అడుగులు వేసిన వారు కూడా ఓటమి ఎదురైతే చాలు… ఇక దాని వైపే చూడరు. కానీ ఒక యువకుడు ఓటమికే ఎదురెళ్ళాడు. ఎన్నిసార్లు ఓడిపోయినా కూడా ఆగకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. చివరికి అనుకున్నది సాధించాడు. అతని పేరు శివాజీ. ఊరు శ్రీకాకుళం.
చిన్న ఉద్యోగమే కావచ్చు
శివాజీ సాధించినది చిన్న ప్రభుత్వ ఉద్యోగమే కావచ్చు. కానీ అతను 24సార్లు ఓడిపోయినా 25వసారి కూడా ప్రయత్నించాడు. ఆ పట్టుదల గురించే మనం ఇప్పుడు చెప్పుకోవాలి. అలాంటి పట్టుదల అందరికీ ఉంటే ఎవ్వరూ ఓడిపోరు. అందరూ తమ జీవితంలో అనుకున్న లక్ష్యాలను కచ్చితంగా సాధించే తీరుతారు.
ఇక శివాజీ విషయానికి వస్తే ఇతనిది శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం తలతంపర గ్రామం. అతడికి ఒకటే లక్ష్యంగా ఉండేది. అది బ్యాంకు ఉద్యోగం సాధించడం. ట్రిపుల్ ఐటీలో 2019లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. బ్యాంకుకు సంబంధించి ఏ ఉద్యోగాలు పడినా కూడా ప్రయత్నించేవాడు. ఇంటర్ అర్హతతో, డిగ్రీ అర్హతతో పడిన బ్యాంకు ఉద్యోగాలన్నింటికీ అప్లై చేశాడు. అన్ని పరీక్షలూ రాసేవాడు.
అలా అతను ఇప్పటివరకు 24 సార్లు బ్యాంకు పరీక్షలకు హాజరయ్యాడు. కానీ విఫలమవుతూనే వచ్చాడు. విఫలమైన ప్రతిసారీ తనను తాను తిట్టుకుంటూ, విధిని తిట్టుకుంటూ కూర్చోలేదు. పట్టు విడవకుండా మరొకసారి ప్రయత్నించేవాడు. అలా చివరికి యూనియన్ బ్యాంక్ పిఓగా ఎంపికయ్యాడు. అది కూడా 25వ ప్రయత్నంలో.
బ్యాంకు ఉద్యోగం చిన్నదే అని మీకు అనిపించవచ్చు. కానీ అన్నిసార్లు ఓడినా కూడా అతడు ప్రయత్నించడం అనేది మాత్రం ఎంతో మందికి ఆదర్శం.
ఓటమే లేదు
లక్ష్యసాధనలో మీరు ఎప్పుడూ ఓడిపోరు. ఓడేది మీరు చేసిన ప్రయత్నమే. ప్రయత్నం నుంచి మీరు చేసిన తప్పులను నేర్చుకుంటే మీకు అనుభవం వస్తుంది. మళ్ళీ ఆ తప్పును చేయకుండా ఉంటారు. ప్రయత్నించి ఓడిపోవడం వల్ల మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవచ్చు. మరింత ఉత్సాహంతో బరిలోకి దిగవచ్చు. ఓడిపోతున్న ప్రతిసారీ మీరు విజయానికి ఒక్కో మెట్టు దగ్గరవుతున్నారని అర్థం .
ఆత్మ విశ్వాసం అవసరం
రెండు మూడుసార్లు ఓడిపోతే చాలు… ఎంతోమందిలో తమకు ఉద్యోగాలు రావనే భావన కలిగి ఆత్మన్యూనత పెరిగిపోతుంది. ఇది వారిలో ఆత్మవిశ్వాసం కోల్పోయేలా చేస్తుంది. ఎప్పుడైతే మీలో ఆత్మన్యూనత మొదలైందో అక్కడ నుంచి ఆత్మవిశ్వాసం దూరంగా వెళ్ళిపోతుంది. మీపై మీకే నమ్మకం లేకపోతే ఈ ప్రపంచం మిమ్మల్ని ఎలా నమ్ముతుంది? కాబట్టి ఎన్నిసార్లు ఓడినా మీ మీద మీరు నమ్మకాన్ని కోల్పోవద్దు. నేను ఎందుకు విజేత కాను? అనే దృక్పథంతోనే కష్టపడండి. కచ్చితంగా విజయం మీకు దక్కి తీరుతుంది.
ఓటమి అంటే మీరు గెలవకపోవడం కాదు.. ప్రయత్నించకపోవడం. ఓడి గెలిస్తే వచ్చే ఆ అనుభవం మీకు జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది. గెలిచే దాకా ప్రయత్నిస్తూనే ఉండండి విజయం మీ సొంతమవుతుంది.
ఒక్కసారి ఓడిపోతే వచ్చే ప్రమాదం ఏమీ లేదు. అది విజయానికి స్ఫూర్తిగా మారుతుంది. ఓటమి కూడా ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. చివరికి అది కూడా మీతో స్నేహం చేసి విజయానికి బాటలు వేస్తుంది. విజయం సాధించాలంటే ముందు ఓటమి రుచిని చూడండి. అప్పుడే విజయం మరింత తీయగా అనిపిస్తుంది.
సంబంధిత కథనం