



Best Web Hosting Provider In India 2024
చర్లపల్లి టు సికింద్రాబాద్.. ప్రతీ 10 నిమిషాలకో ఆర్టీసీ బస్సు.. రద్దీకి అనుగుణంగా చర్యలు
చర్లపల్లి నుంచి రైళ్ల రాకపోకలు పెరిగాయి. అటు సికింద్రాబాద్‌లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దీంతో చాలా రైళ్లను మళ్లించారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. చర్లపల్లి నుంచి సికింద్రాబాద్‌కు ప్రతీ 10 నిమిషాలకో బస్సు నడపాలని నిర్ణయించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి సికింద్రాబాద్‌కు 10 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉండేలా.. తెలంగాణ ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి రైళ్లరాకపోకలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే అధికారుల సహకారంతో.. రైళ్లలో వచ్చే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా పలు ప్రాంతాలకు సిటీ బస్సుల సంఖ్యను పెంచుతున్నట్లు చెబుతున్నారు. దీనివల్ల ప్రయాణికులకు మేలు జరగనుంది.
వివిధ ప్రాంతాలకు బస్సులు..
చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి సికింద్రాబాద్, ఉప్పల్, మోహిదీపట్నం, బోరబండ, కోఠి, అఫ్జల్‌గంజ్ ప్రాంతాలకు నడుపుతున్న బస్సులతో పాటు.. మరిన్ని బస్సులు పెంచే దిశగా ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. చర్లపల్లి నుంచి తెల్లవారుజామున 4.20 నుంచి.. రాత్రి 10.15 గంటల వరకు.. పది నిమిషాలకు ఒక ఆర్టీసీ బస్సు అందుబాటులో ఉందని అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం 88 సర్వీసులు..
ప్రస్తుతం చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి 88 ఆర్టీసీ సర్వీసులు నడుపుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. రైళ్ల సమయపాలనను బట్టి.. బస్సుల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు. స్టేషన్‌లో రైల్వే అధికారులతో సమన్వయం కోసం సూపర్‌వైజర్లను నియమించారు. దీంతో సర్వీసులు నడపడం, పెంచడం సులభం అవుతోంది.
ప్లాట్‌ఫామ్‌లు మూసివేత..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌లు మూసివేశారు. ఆధునీకరణ పనుల్లో భాగంగా ఆరు ప్లాట్‌ఫామ్‌లు క్లోజ్ చేశారు. ప్లాట్‌ఫారమ్ నంబర్ 2, 3, ప్లాట్‌ఫారమ్ నంబర్ 4, 5, ప్లాట్‌ఫారమ్ నంబర్ 9, 10 ను మూసివేశారు. 100 రోజుల పాటు ఈ ఆరు ప్లాట్‌ఫామ్‌లు మూసివేస్తున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. పనుల కారణంగా పలు రైళ్లను చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లికి మళ్లించారు.
రాకపోకలకు అంతరాయం..
ప్రయాణికులు తమ రైళ్ల వివరాలను ముందుగా తెలుసుకొని.. ప్రయాణానికి సిద్ధం కావాలని రైల్వే అధికారులు సూచించారు. ఈ మూసివేతల కారణంగా సికింద్రాబాద్ స్టేషన్‌లో రైళ్ల రాకపోకల్లో కొంత అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ప్రయాణికులు సహకరించాలని రైల్వే అధికారులు కోరుతున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు.. రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు రూ.720 కోట్లు వ్యయం చేయనున్నారు.
సంబంధిత కథనం
టాపిక్