



Best Web Hosting Provider In India 2024
సిట్ విచారణకు హాజరైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి.. కీలక అంశాలపై ప్రశ్నిస్తున్న అధికారులు!
ఏపీలో మద్యం కుంభకోణం కేసు సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నేతలపై ఆరోపణలు వచ్చాయి. తాజాగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. తన లాయర్లతో కలిసి సిట్ ఆఫీసుకు వచ్చారు. ఆయన నుంచి అధికారులు కీలక సమాచారం రాబట్టడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
మద్యం కుంభకోణం కేసులో సిట్ విచారణకు హాజరయ్యారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. విజయవాడలో సిట్ కార్యాలయానికి ఇవాళ ఉదయం వచ్చారు. అనంతరం అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. భారీగా అనుచిత లబ్ధి పొందిన కంపెనీల్లో ఒకటైన అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెనక.. రాజ్ కసిరెడ్డితో పాటు ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.
మధ్యంతర రక్షణ..
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఇటీవల సుప్రీంకోర్టు అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పించింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో ఆయనను అరెస్టు చేయకుండా స్టే విధించింది. ఈ కేసులో మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోరుతూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఆయనకు మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతుందని, ఈ సమయంలో మిథున్ రెడ్డిని అరెస్టు చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
మద్యం విధానంలో మార్పులు..
2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాష్ట్రంలో మద్యం విధానంలో మార్పులు చేసింది. మద్యం అమ్మకాలను ప్రభుత్వ నియంత్రణలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌బీసీఎల్) ద్వారా మాత్రమే జరిపేలా చేసింది. ఈ విధానంలో అవినీతి, అక్రమాలు జరిగాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రభుత్వం కొన్ని కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించిందని.. తద్వారా వాటికి అక్రమంగా లాభాలు చేకూర్చిందనే ఆరోపణలు ఉన్నాయి.
రాజకీయ దుమారం..
మద్యం ధరలను పెంచి, ప్రజలపై అదనపు భారం మోపారని విమర్శలు వచ్చాయి. ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ ఆరోపణలను అప్పటి ప్రభుత్వం ఖండించింది. మద్యం విధానంలో పారదర్శకత, నియంత్రణ కోసమే మార్పులు చేశామని తెలిపింది. ఈ విషయంపై రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. ఈ కుంభకోణంపై ఇంకా విచారణ జరుగుతోంది.
విజయసాయి కీలక వ్యాఖ్యలు..
ఇదే కేసులో విజయవాడ సిట్ కార్యాలయంలో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని అధికారులు ప్రశ్నించారు. విచారణ ముగిసిన తర్వాత విజయసాయి రెడ్డిని మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. మద్యం అమ్మకాల విషయంలో తాను ఎప్పుడూ తాను జోక్యం చేసుకోలేదని.. అన్ని ప్రశ్నలకూ రాజ్ కసిరెడ్డే సరైన జవాబులు చెబుతాడని స్పష్టం చేశారు. సిట్ అధికారులు తనను 4 ప్రశ్నలు అడిగారని.. తన జవాబులతో సంతృప్తి చెందారని భావిస్తున్నానన్నారు. మరోసారి విచారణకు పిలిచినా వస్తానని సిట్ అధికారులకు చెప్పినట్టు వెల్లడించారు.
సంబంధిత కథనం
టాపిక్