


Best Web Hosting Provider In India 2024

నంద్యాలలో కానిస్టేబుల్ దారుణ హత్య – వెలుగులోకి వివాహేతర సంబంధం..! పక్కా ప్లాన్ తో మర్డర్
వివాహేతర సంబంధం కోణంలో ఓ కానిస్టేబుల్ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన నంద్యాలలో వెలుగు చూసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టగా… కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహిళతో పాటు మరో వ్యక్తి హత్యకు ప్రణాళిక రచించినట్లు తేల్చారు. ఇతరుల పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నారు.
నంద్యాల జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళతో ఏపీఎస్పీ కానిస్టేబుల్ సంబంధం పెట్టుకున్నాడు. అయితే ఆ తరువాత అతడి స్నేహితుడు… ఆమెకు దగ్గరయ్యాడు. వీరిద్దరూ కలిసి కానిస్టేబుల్‌ను అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. విందు పేరుతో పిలిచి అతి ఘోరంగా హతమార్చారు. మృత దేహాన్ని సమీపంలోని వంతెన కింద పడేశారు.
ఈ దారుణ ఘటన నంద్యాల జిల్లా కేంద్రం శివారులో చోటు చేసుకుంది. తొలుత అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు విచారణలో వివాహేతర సంబంధంతో హత్య చేసినట్లు శుక్రవారం వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరుకు చెందిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ ముల్లా ఫరూక్ (36) ప్రస్తుతం మంగళగిరిలోని అక్టోపస్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఫరూక్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
మహిళతో వివాహేతర సంబంధం…
గతంలో ఫరూక్ కర్నూలులో విధులు నిర్వర్తించాడు. ఆ సమయంలో ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరుకు చెందిన ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే ఆమెకు అప్పటికే వివాహమైంది. అయితే ఆమె భర్త మరణించడంతో రెండో పెళ్లి చేసుకుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ ఫరూక్‌తో వివాహేతర సంబంధం కొనసాగించింది. అయితే ఈ క్రమంలోనే ఫరూక్ బదిలీలో భాగంగా మంగళగిరికి వెళ్లాడు. అయితే ఆమె మాత్రం నంద్యాలలోనే ఉండేది. ఆమెకు ఆర్థిక, ఇతర ఏమైనా అవసరాలు ఉంటే తీర్చే పనిని స్నేహితులకు అప్పగించాడు.
హత్యకు ప్రణాళిక…
ఆమెకు అవసరాలు తీర్చే క్రమంలో ఫరూక్ స్నేహితుల్లో ఒకరు ఆమెకు దగ్గరయ్యాడు. ఫరూక్ మంగళగిరిలో ఉండటంతో వీరికి ఇబ్బంది లేకుండా ఉంది. వీరద్దరూ వివాహేతర సంబంధాన్ని కొనసాగించారు. అయితే ఎప్పుడైనా ఈ విషయం ఫరూక్‌కు తెలిస్తే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశ్యంతో అతడిని అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం ప్రణాళిక రచించారు. వారు వేసుకున్న ప్రణాళిక ప్రకారమే ఈ నెల 9వ తేదీన విందు ఉందని…. దానికి రావాలని ఫరూక్‌ను నంద్యాలకు పిలిచారు.
ఫరూక్ ఈనెల 8వ తేదీనే విశాఖలో ఫైరింగ్ శిక్షణ ఉందని చెప్పి నంద్యాలకు వెళ్ళాడు. తొమ్మిదో తేదిన ఫరూక్‌ను నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరు గ్రామ శివారుకు తీసుకెళ్లారు. అక్కడ ఫరూక్‌ను మాటల్లో పెట్టి గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం మృత దేహాన్ని చాగలమర్రి సమీపంలో రోడ్డు పక్కనే పడేశారు. ఆ తరువాత మృత దేహాన్ని అక్కడి నుంచి తీసి, శిరివెళ్ల మండలం పచ్చర్ల సమీపంలోని ఒక వంతెన కింద పడేశారు.
విచారణలో కీలక విషయాలు….
ఫరూక్ సమాచారం తెలియకపోవటంతో పాటు అందుబాటులోకి రాకపోవటంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. దీంతో ఈనెల 14న మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాల్‌డేటా ఆధారంగా చివరిగా ఒక మహిళతో ఫరూక్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆమె వివరాలు సేకరించారు. ఆమె నంద్యాలకు చెందిన మహిళగా గుర్తించారు. విచారణ చేస్తున్న సమయంలో శుక్రవారం ఫరూక్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. దీనిపై ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా స్పందిస్తూ…. హత్యకు ఎవరెవరు సహకరించారన్న కోణంలో సమగ్ర దర్యాప్తు చేయాలని శిరివెళ్ల పోలీసులను ఆదేశించారు. అనుమానితులను మరికొందరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. దీంతో ఫరూక్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు.
(రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
టాపిక్