




Best Web Hosting Provider In India 2024

ఏపీ బీజేపీ కొత్త సారథి ఎవరు..? రేసులో ‘ఆ నలుగురు’ నేతలు.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!
ఏపీ బీజేపీకి కొత్త సారథిని ఎంపిక చేయడానికి కసరత్తు జరుగుతోంది. మళ్లీ తనకే అవకాశం ఇవ్వాలని పురందేశ్వరి కోరుతున్నారు. కానీ.. తమకు అవకాశం ఇవ్వాలని మరో ముగ్గురు నేతలు లైన్‌లో ఉన్నారు. దీంతో కొత్త అధ్యక్షుడి ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అధిష్టానం ఆశీస్సులు ఎవరికి ఉంటాయో అని చర్చ జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై పార్టీ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షురాలు పురందేశ్వరిని కొనసాగిస్తారా.. కొత్త వారిని నియమిస్తారా అనే దానిపై ఆసక్తి నెలకొంది. పురందేశ్వరి 2024 ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆమెను తొలగించి.. వేరే వారికి బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉంది. అయితే.. బీజేపీ విధానాల ప్రకారం.. అధ్యక్ష పదవిలో వరసగా రెండుసార్లు కొనసాగేందుకు వీలుంది.
రేసులో వీరు..
ఈ నేపథ్యంలో.. మళ్లీ తనకే అవకాశం ఇవ్వాలని పురందేశ్వరి కోరుతున్నారు. ఆమెతోపాటు.. బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఎమ్మెల్యే సుజనా చౌదరి పేరు కూడా అధ్యక్ష పదవి రేసులో ఉంది. అటు ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పీవీ పార్థసారథి పేరును కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మరికొందరు ఇతర నేతలు కూడా అధ్యక్ష పీఠాన్ని ఆశిస్తున్నారు.
జాతీయ నేతలు వచ్చినప్పుడల్లా..
ఈ నేపథ్యంలో.. జాతీయ స్థాయి నేతలు రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు.. వారి వద్ద తమ కోరికను వ్యక్తం చేస్తున్నారు. జాతీయ సహ సంఘటనా ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ విజయవాడలోని రాష్ట్ర కార్యాలయానికి శుక్రవారం వచ్చారు. అక్కడ సీనియర్ నేతలు, ఆశావహుల సందడి కనిపించింది. అయితే.. ప్రస్తుత అధ్యక్షురాలు పురందీశ్వరిని తప్పిస్తే.. కేంద్ర కేబినెట్‌లో స్థానం కల్పించాలని ఆమె కోరినట్టు సమాచారం.
కీలకంగా వ్యవహరించిన పురందీశ్వరీ..
2014లో రాష్ట్ర విభజన తర్వాత పురందీశ్వరీ బీజేపీలో చేరారు. జూలై 2023లో ఏపీ బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు వివిధ జాతీయ స్థాయి పదవులను నిర్వహించారు. ఎన్నికల సమయంలో హైకమాండ్ ఆదేశాలకు అనుగుణంగా పనిచేశారు. మిత్రపక్షాలు టీడీపీ, జనసేనతో బలమైన సంబంధాలను కొనసాగించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.
మరింత బలోపేతం కావాలని..
ఇప్పుడు కూడా అధికార కూటమిలోని టీడీపీ, జనసేనలతో సమన్వయం చేసుకుంటూ.. పార్టీని నడిపే వారు అధ్యక్ష స్థానంలో ఉండాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు పార్టీ అగ్రనేతలకు దీటైన స్థాయిలో ఉండాలని, పార్టీ కార్యకలాపాల కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించే వారు కావాలని బీజేపీ భావిస్తోంది. 2029 ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేసుకోవాలని అధిష్ఠానం ఆలోచిస్తోంది.
సంబంధిత కథనం
టాపిక్