



Best Web Hosting Provider In India 2024

మిస్సింగ్ కాదు.. మర్డర్..! సోషల్ యాక్టివిస్ట్‌ను హత్య చేసి.. బావిలో పడేసిన దుండగులు
వరంగల్ నగరంలో ఓ సోషల్ యాక్టివిస్ట్ మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. ఈ నెల 15న ఆ యువకుడు అదృశ్యం కావడంతో మిస్సింగ్ కేసు నమోదు కాగా.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆయన డెడ్ బాడీని వరంగల్ శివారులోని ఓ బావిలో గుర్తించారు. ఓ అక్రమ సంబంధం విషయాన్ని బయటపెట్టడమే ఆయన హత్యకు దారి తీసినట్లు తెలుస్తోంది.
వరంగల్ యువకుడి అదృశ్యం విషాదాంతమైంది. సోషల్ యాక్టివిస్ట్ గా ఉన్న యువకుడి మృతదేహం నగర శివార్లలోని బావిలో గుర్తించారు. హత్యకు పాల్పడిన ముఠాను హనుమకొండ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. స్థానికులు తెలిపిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రానికి చెందిన చిడెం సాయి ప్రకాశ్ చేయూత అనే స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నాడు. ఈ నెల 15న తన బంధువులకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో తన కారులో హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చాడు. వారిని ఆసుపత్రిలో అడ్మిట్ చేసి, తాను ఇంటికి బయలుదేరాడు.
15వ తేదీ నుంచి మిస్సింగ్
ఆసుపత్రి నుంచి ఇంటికి బయలు దేరిన సాయి ప్రకాశ్ ఆ రోజు ఇంటికి చేరుకోలేదు. దీంతో కుటుంబ సభ్యులు కంగారు పడి ఆయన ఫోన్ కు కాల్ చేశారు. కానీ ఎంతకూ కనెక్ట్ కాలేదు. రెండు రోజులు వివిధ ప్రాంతాల్లో ఆరా తీసిన అనంతరం ఈ నెల 18న సాయి ప్రకాశ్ తమ్ముడైన సాయి తేజ హనుమకొండ పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో హనుమకొండ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఫోన్ సిగ్నల్ ఏపీలో..
సాయితేజ ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించిన పోలీసులు ముందుగా.. సాయి ప్రకాశ్ మొబైల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా దర్యాప్తు కొనసాగించారు. దీంతో ఏపీలోని పాలకొల్లులో సిగ్నల్ చూపిస్తున్నట్టు గుర్తించారు. ఈ మేరకు అక్కడి పోలీసుల సహకారంతో మొబైల్ ట్రేస్ చేసినట్లు తెలిసింది. ఆ ఫోన్ కూడా ఓ ట్రైన్ లోనే గుర్తించినట్లు సమాచారం.
వెంబడించి దారుణం!
సాయి ప్రకాశ్ ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆయన కారు వచ్చిన సమయాన్ని బట్టి హనుమకొండలోని సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు. ఈ క్రమంలో సాయి ప్రకాశ్ కారును ఓ ఆటోలో ఐదారుగురు వ్యక్తులు ఫాలో అవుతున్నట్లు గుర్తించారు. ఈ మేరకు ఆటో నెంబర్ ఆధారంగా అనుమానితులను గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
సాయి ప్రకాశ్ ను హత్య చేసి వరంగల్ శివారులో హుస్నాబాద్ సమీపంలోని ఓ బావిలో పడేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. దీంతో వారు ఇచ్చిన సమాచారం మేరకు బావిలో నుంచి సాయి ప్రకాశ్ డెడ్ బాడీని బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
సూత్రధారి కానిస్టేబుల్?
సాయి ప్రకాశ్ హత్యకు ఓ అక్రమ సంబంధం విషయాన్ని బయటపెట్టడమే కారణమని తెలుస్తోంది. ములుగు జిల్లా వెంకటాపురంలో శ్రీనివాస్ అనే కానిస్టేబుల్ స్థానిక మహిళతో అక్రమ సంబంధం నెరుపుతుండగా, ఆ విషయాన్ని సాయి ప్రకాశ్ బయటపెట్టాడు. దీంతో పోలీస్ ఉన్నతాధికారులు ఆయనను సస్పెండ్ చేశారు. అప్పటినుంచి కోపం పెంచుకున్న కానిస్టేబుల్ శ్రీనివాస్.. సాయి ప్రకాశ్ హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
వెంకటాపురంలో ఉద్రిక్తత
సాయి ప్రకాశ్ హత్య నేపథ్యంలో ములుగు జిల్లా వెంకటాపురంలో సోమవారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. సాయి ప్రకాశ్ హత్యకు కారణమైన దీపిక అనే మహిళపై మృతుడి బంధువులు, గ్రామస్థులు దాడికి ప్రయత్నించారు. దీంతో వారిని గమనించిన మహిళ ఇంట్లోకి వెళ్లి ఉరి వేసుకునేందుకు ప్రయత్నించింది. వెంటనే ఆమె కుటుంబ సభ్యులు, గ్రామస్థులు గమనించి, ఆమెను బయటకు తీసుకుని వచ్చారు.
తన ప్రియుడితో కలిసి సాయి ప్రకాశ్ ను హత్య చేయించిందని ఆరోపిస్తూ సదరు మహిళను స్థానిక పోలీసులకు అప్పగించారు. కాగా ఇప్పటికే పోలీసులు కానిస్టేబుల్ శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు. వెంకటాపురంలో పరిస్థితుల నేపథ్యంలో అక్కడ పోలీసు బలగాలను మోహరించారు. కాగా నేడు లేదా రేపు ఈ హత్యకు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉందని పోలీస్ వర్గాలు తెలిపాయి.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)
సంబంధిత కథనం
టాపిక్