





Best Web Hosting Provider In India 2024

ఇంటర్మీడియట్ అర్హతతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే
ఇంటర్ తర్వాత చదువు కొనసాగించాలా.. ఉద్యోగం కోసం ప్రిపేర్ అవ్వాలా.. అని చాలామంది ఆలోచిస్తుంటారు. మరికొందరు చదువు కొనసాగిస్తూనే ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలు పెడతారు. అయితే.. అసలు ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు ఏం ఉంటాయో చాలామందికి తెలియకపోవచ్చు. ఆలాంటి వారి కోసం ఈ సమాచారం.
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అర్హతతో చాలా ప్రభుత్వ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. వాటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది. ఇంటర్మీడియట్ అర్హతతో దరఖాస్తు చేసుకునే కొన్ని ఉద్యోగాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు..
1.గ్రూప్-IV ఉద్యోగాలు.. జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ వంటి పోస్టులు ఉంటాయి.
2.వివిధ శాఖలలో అసిస్టెంట్ పోస్టులు.. నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖ, రవాణా శాఖ మొదలైన వాటిలో అసిస్టెంట్, ఇతర క్లరికల్ పోస్టులు.
3.పోలీస్ కానిస్టేబుల్, ఇతర పోలీస్ ఉద్యోగాలు.. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ వీటిని భర్తీ చేస్తుంది.
4.హైకోర్టు ఉద్యోగాలు.. రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్ వంటి పోస్టులు.
5.ట్రాన్స్‌కో, జెన్కోలలో.. జూనియర్ లైన్ మెన్, ఇతర టెక్నికల్ పోస్టులు.
6.మున్సిపల్ పంచాయతీ రాజ్ శాఖలలో.. వివిధ హోదాల్లో పోస్టులు ఉంటాయి.
7.తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కండక్టర్, ఇతర పోస్టులను ఇంటర్ అర్హతతో భర్తీ చేస్తారు.
8.వ్యవసాయ శాఖ, ఇతర శాఖలలో ఫీల్డ్ అసిస్టెంట్ వంటి పోస్టులను ఇంటర్మీడియట్ అర్హతతో భర్తీ చేస్తారు.
9.టెక్నికల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లలో ల్యాబ్ అసిస్టెంట్ వంటి పోస్టులు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా.. లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి పోస్టులు భర్తీ చేస్తారు. ఇవే కాకుండా.. వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఉంటాయి. బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ వంటి వివిధ సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ పోస్టులను కూడా ఇంటర్ అర్హతతో భర్తీ చేస్తారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో స్టెనోగ్రాఫర్ పోస్టులు ఉంటాయి.
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా..
క్లర్క్, టైపిస్ట్, స్టేషన్ మాస్టర్ వంటి వివిధ పోస్టులు ఉంటాయి. (కొన్ని పోస్టులకు గ్రాడ్యుయేషన్ అవసరం కావచ్చు). ట్రాక్ మెయింటైనర్, అసిస్టెంట్ (వర్క్స్), మొదలైన పోస్టులు ఉంటాయి. కొన్ని టెక్నీషియన్ పోస్టులకు ఇంటర్మీడియట్‌తో పాటు నిర్దిష్ట ట్రేడ్‌లో ఐటీఐ ఉండాలి.
డిఫెన్స్ ఉద్యోగాలు..
ఇండియన్ ఆర్మీలో.. సోల్జర్ (జీడీ), క్లర్క్, ట్రేడ్స్‌మెన్ వంటి పోస్టులు ఉంటాయి. ఇండియన్ నేవీలో.. సెయిలర్ (ఎస్ఎస్ఆప్/ఏఏ) పోస్టులు ఉంటాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో.. ఎయిర్‌మెన్ పోస్టులు ఉంటాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల కోసం (ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, ఫిజిక్స్ ఉండాలి).
ముఖ్యమైన విషయాలు..
ప్రతి ఉద్యోగానికి నిర్దిష్టమైన అర్హతలు, వయో పరిమితి, ఎంపిక విధానం ఉంటాయి. నోటిఫికేషన్లు విడుదలైనప్పుడు ఆయా సంస్థల అధికారిక వెబ్సైట్లలో పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం అధికారిక వెబ్సైట్లను క్రమం తప్పకుండా చూడాలి. ఏ ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించాలనుకుంటున్నారో.. దానిపై దృష్టి సారించి, అందుకు తగ్గట్టుగా సన్నద్ధం కావడం మంచిది.
టాపిక్