





Best Web Hosting Provider In India 2024

హెల్తీగా క్యారెట్ మంచూరియా ఇలా చేయండి, పిల్లలకు ఇది కచ్చితంగా నచ్చుతుంది
క్యారెట్ మంచూరియా చేయడం చాలా సులువు. ఇది పిల్లలకు నచ్చేలా చేయవచ్చు. మిగతా మంచూరియాలతో పోలిస్తే క్యారెట్ మంచూరియా ఆరోగ్యానికి కూడా మంచిది.
క్యారెట్ తో చేసే ఆహారాలన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. అప్పుడప్పుడు పిల్లలు మంచూరియా వంటి జంక్ ఫుడ్ కావాలని అడుగుతూ ఉంటారు. బయట దొరికే మంచూరియాలతో పోలిస్తే ఇంట్లోనే మీరు తాజాగా, శుచిగా హెల్తీగా క్యారెట్ మంచూరియాను చేసి పెట్టవచ్చు. ఇది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇందులో ఉండే క్యారెట్ పిల్లలకు ఎన్నో పోషకాలను అందిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం… క్యారెట్ మంచూరియా రెసిపీ ఎలాగో చూసి ఒకసారి ఇంట్లోనే ట్రై చేయండి.
క్యారెట్ మంచూరియా రెసిపీకి కావలసిన పదార్థాలు
క్యారెట్ తురుము – ఒక కప్పు
వాము – పావు స్పూను
కొత్తిమీర తరుగు – మూడు స్పూన్లు
టమాటా సాస్ – ఒక స్పూను
నూనె – డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
శెనగపిండి – రెండు కప్పులు
కారం – ఒక స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక స్పూను
ఉల్లిపాయ – ఒకటి
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక స్పూను
కార్న్ ఫ్లోర్ – ఒక స్పూను
క్యారెట్ మంచూరియా రెసిపీ
1. ఒక గిన్నెలో శనగపిండిని వేసి అందులోనే కార్న్ ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, వాము వేసి బాగా కలుపుకోవాలి.
2. క్యారెట్ ను సన్నగా తురిమి ఆ తురుమును కూడా ఈ శెనగపిండి మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి.
3. ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ దీన్ని గట్టి పిండిలాగా కలపాలి.
4. గట్టి పకోడీకి ఎంత గట్టిగా మిశ్రమాన్ని తయారు చేస్తారో దీన్ని కూడా అలాగే చేయాలి.
5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేయాలి.
6. ఆ నూనె వేడెక్కాక క్యారెట్ తురుము మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసి అందులో వేసి వేయించుకోవాలి.
7. అవి రంగు మారేవరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక కళాయిని తీసి స్టవ్ మీద పెట్టాలి.
8. అందులో ఒక స్పూను నూనెను వేయాలి. ఆ నూనెలో ఉల్లిపాయ ముక్కలు పెద్ద పెద్దవి కట్ చేసి వేయాలి.
9. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలి.
10. అందులోనే సోయాసాస్, టమోటా సాస్ వేసి కొంచెం నీరు వేసి గ్రేవీలాగా చేసుకోవాలి.
11. ఆ మిశ్రమంలో అర స్పూను ఉప్పును కూడా వేసి కలుపుకోవాలి.
12. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న క్యారెట్ మంచూరియా బాల్స్ ను అందులో వేసి బాగా కలపాలి.
13. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. పైన కొత్తిమీర తరుగును చల్లుకోవాలి.
14. అంతే టేస్టీ క్యారెట్ మంచూరియా సిద్ధమైపోయింది. ఇంకెందుకు ఆలస్యం వేడివేడిగా తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.
క్యారెట్ మంచూరియా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎందుకంటే దీనిలో మనం మైదాను వాడలేదు. క్యారెట్, శెనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా ఎన్నో కొన్ని పోషకాలను కలిగి ఉంటాయి. మీరు బయట అమ్మే మంచూరియాను తింటే అందులో మైదాను వాడతారు. మైదా ఆరోగ్యానికి ఎంతో హానికరం. కాబట్టి ఇంట్లోనే ఇలా మంచూరియాను తయారు చేసుకొని తినేందుకు ప్రయత్నించండి. ఇది మీకు ఎంతో మేలు చేస్తుంది. పైగా రుచిగా కూడా ఉంటుంది. పిల్లలు జంక్ ఫుడ్ అడిగినప్పుడు ఇలా క్యారెట్ మంచూరియా చేసి పెట్టండి. వారికి నచ్చుతుంది. అయితే నూనె పీల్చుకోకుండా చూసుకోవడం అవసరం. బాల్స్ నూనె పీల్చినట్టు అనిపిస్తే టిష్యూ పేపర్ మీద వేసి నొక్కడం ద్వారా అదనపు బయటకు తీసేయవచ్చు.
సంబంధిత కథనం
టాపిక్