కశ్మీర్లో దారుణం; టూరిస్ట్ లపై ఉగ్రవాదుల కాల్పులు

Best Web Hosting Provider In India 2024


కశ్మీర్లో దారుణం; టూరిస్ట్ లపై ఉగ్రవాదుల కాల్పులు

Sudarshan V HT Telugu

జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ లోని బైసరన్ లోయలో దారుణం చోటు చేసుకుంది. కశ్మీర్ అందాలను చూడడానికి వచ్చిన పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. టెర్రరిస్ట్ ల కాల్పుల్లో ఒకరు చనిపోయారని, 11 మంది గాయపడ్డారని సమాచారం. కాల్పుల శబ్దం వినిపించడంతో భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయి.

కశ్మీర్లో టూరిస్ట్ లపై ఉగ్రవాదుల కాల్పులు (Representational Image.)

జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ లోని బైసరన్ లో జరిగిన ఉగ్రదాడిలో 12 మంది పర్యాటకులు గాయపడ్డారు. వారిలో ఒకరు చనిపోయారని, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ లోని బైసరన్ లోయలో కాల్పుల శబ్దం వినిపించడంతో భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయి. పర్యాటకులు ఎక్కువగా సందర్శించే ప్రదేశాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇప్పటికే ఇంటలిజెన్స్ ప్రాథమిక నివేదికలు హెచ్చరించాయి. కాల్పుల ఘటన అనంతరం ఈ ప్రాంతానికి అదనపు భద్రతా బలగాలను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు.

అత్యంత సమీపం నుంచి..

గుర్తుతెలియని దుండగులు పర్యాటకులపై అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపారని, దీంతో పలువురికి గాయాలయ్యాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ దాడిలో తన భర్త తలపై కాల్పులు జరిగాయని, మరో ఏడుగురికి గాయాలయ్యాయని ఒక బాధితురాలు ఫోన్ ద్వారా పీటీఐకి తెలిపింది.

ఆసుపత్రులకు తరలింపు

క్షతగాత్రులను తరలించేందుకు అధికారులు హెలికాఫ్టర్ ను రంగంలోకి దించారని, క్షతగాత్రుల్లో కొందరిని స్థానికులు తమ గుర్రాలపై సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్లారని అధికారులు తెలిపారు. ఈ పర్యాటక ప్రదేశానికి కాలినడకన లేదా గుర్రంపై మాత్రమే చేరుకోవడానికి వీలు అవుతుందని అధికారులు తెలిపారు.

ఐదుగురు మృతి: మెహబూబా ముఫ్తీ

పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిని మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ఖండించారు. ఈ దాడిలో కనీసం ఐదుగురు చనిపోయారని ఆమె తెలిపారు. పహల్ గామ్ లో పర్యాటకులపై జరిపిన పిరికిపంద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని, ఇలాంటి హింస ఆమోదయోగ్యం కాదని, దీన్ని ఖండించాల్సిందేనని ముఫ్తీ అన్నారు. చారిత్రాత్మకంగా కశ్మీర్ పర్యాటకులకు సాదర స్వాగతం పలికిందని, ఈ అరుదైన సంఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. దోషులను శిక్షించడానికి, భద్రతా లోపాలను పరిశీలించడానికి సమగ్ర దర్యాప్తు అవసరమన్నారు. సందర్శకుల భద్రత అత్యంత ముఖ్యమని, భవిష్యత్తులో దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించిన సీఎం అబ్దుల్లా

జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కశ్మీర్లో పర్యాటకులపై జరిగిన దాడిని ఖండించారు. ‘‘నేను నమ్మలేనంత షాక్ కు గురయ్యాను. మా సందర్శకులపై ఈ దాడి హేయమైనది. ఈ దాడికి పాల్పడిన వారు మనుషులు కారు. వారు జంతువులతో సమానం. వారు శిక్షలకు అర్హులు. ఖండన మాటలు సరిపోవు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని అబ్దుల్లా పేర్కొన్నారు. పహల్ గామ్ లో జరిగిన ఘటనపై బీజేపీ నేత రవీందర్ రైనా స్పందిస్తూ దక్షిణ కశ్మీర్లోని అమాయక పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని పాక్ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.

పాకిస్తాన్ ఉగ్రవాదులు

నౌషెరాలో రైనా విలేకరులతో మాట్లాడుతూ.. దక్షిణ కశ్మీర్ లోని పహల్గామ్ లో పర్యాటకులపై పాక్ ఉగ్రవాదులు పిరికిపంద దాడికి పాల్పడ్డారు. పిరికిపంద పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత సైన్యం, జమ్ముకశ్మీర్ పోలీసులు, మన పారామిలటరీ దళాల ధైర్యవంతులైన సైనికులను ఎదుర్కోలేరు. గతేడాది జమ్ముకశ్మీర్ లోని గగన్ బల్ జిల్లాలోని గగన్ గిర్ లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ వైద్యుడు, ఆరుగురు భవన నిర్మాణ కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. స్థానికేతర కార్మికులపై జరిగిన దాడి దుర్మార్గమని, పిరికిపంద చర్యగా ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అభివర్ణించారు. గుండ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో పనిచేస్తున్న ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన కార్మికుల శిబిరంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

Sudarshan V

eMail
వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link