





Best Web Hosting Provider In India 2024

ఆవు పేడతో ఏడాదికి కోటి రూపాయల సంపాదన, సక్సెస్‌కు వయసుతో సంబంధం లేదని నిరూపించిన భీమ్‌రాజ్
నలభై ఏళ్లకే తాము వృద్ధులమైనట్టు ఎంతో మంది చతికిలబడతారు. ఇక విజయం సాధించలేమని సన్యాసం తీసుకున్న వారిలా మాట్లాడతారు. 50 ఏళ్ల వయసులో కూడా జీవితంలో తొలి విజయాన్ని అందుకున్నాడు ఒక వ్యక్తి.
విజయానికి వయసుతో సంబంధం లేదు. మంచి ఆలోచన, కష్టం, సంకల్పబలం ఇవి ఉంటే చాలు… ఏ వయసులోనైనా కూడా విజయం మీతో స్నేహం చేస్తుంది. అందుకు భీమ్‌రాజ్ శర్మ ఒక ఉదాహరణ. అతడు ఒక మధ్య తరగతి మనిషి. కూతురు పెళ్లి కోసం ముందు నుంచే కొంత కొంత డబ్బులు దాచుకుంటూ వచ్చాడు.
భీమ్‌రాజ్ వయసు యాబై ఏళ్ల పైనే. ఆ సమయంలో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఇప్పుడు అతి పెద్ద స్టార్టప్ గా మారి ఏడాదికి కోటి రూపాయల ఆదాయాన్ని ఇస్తోంది.
కూతురి ప్రశ్నతో…
భీమ్‌రాజ్ శర్మది జైపూర్. 2014లో అతను ఏనుగు పేడతో కాగితపు షీట్లను తయారు చేసే వ్యాపారం మొదలుపెట్టాడు. ఏనుగు పేడను సంపాదించడం చాలా కష్టం. ఇందుకోసం ఖర్చు కూడా ఎక్కువగానే అవుతుంది. మధ్యతరగతి మనిషి ఏనుగు పేడను సేకరించలేకపోయాడు. అదే సమయంలో అతని కూతురు ఒక ప్రశ్న అడిగింది. ‘ఏనుగు పేడ ఎందుకు? మన ఊర్లో బోలెడంత ఆవు పేడ దొరుకుతుందిగా… దానితో ప్రయత్నించు నాన్న’ అని చెప్పింది. కూతురు అన్న ఆ మాట అతని మెదడు తొలిచేసింది.
ఏనుగు పేను సేకరించడం చాలా కష్టం. అదే ఆవు పేడ అయితే ఎక్కడపడితే అక్కడే దొరుకుతుంది. రైతుల నుంచి కూడా కొనుక్కోవచ్చు. కాబట్టి ఆవు పేడతో కాగితాలను తయారు చేయాలని అనుకున్నాడు.
పిచ్చోడు అని పిలిచారు
ఇదే విషయాన్ని తన కుటుంబంతో స్నేహితులతో పంచుకున్నాడు. కానీ వారంతా కూడా ఇదేం ఆలోచన… జరగనే జరగదు అంటూ కొట్టి పడేశారు. ఈ విషయం ఊర్లో వారికి తెలిసి పిచ్చోడంటూ ముద్రవేశారు. ఎంతమంది ఎన్ని మాటలు అన్నా కూడా భీమ్‌రాజ్ మాత్రం పట్టించుకోలేదు. ముందుకు అడుగులు వేశాడు. కొంత డబ్బును స్నేహితుల నుండి అప్పు అడిగాడు. అతని ఆలోచన నచ్చని స్నేహితులు అతనికి ఆర్థికంగా సహాయం చేయడానికి కూడా ముందుకు రాలేదు.
చివరికి తన కూతురు పెళ్లి కోసం దాచిన ఆ కొంత మొత్తాన్ని ఉపయోగించి చిన్న యూనిట్ పెట్టాడు. 2017లో మొదటిసారి ఒక యూనిట్ మొదలైంది. దానికి గౌకృతి అని పేరు పెట్టాడు. అదే ఇప్పుడు అతి పెద్ద కంపెనీగా మారిపోయింది.
ఆవు పేడ కొంటూ…
ఊర్లో రైతుల దగ్గర పేడను కిలోకి 10 రూపాయలు చొప్పున కొనేవాడు. రైతులు అతనికి పేడను అమ్ముతూనే వెనుక నుంచి నవ్వేవారు. ఆ నవ్వులు భీమ్రాజ్‌కు వినబడినా కూడా పట్టించుకోకుండా ముందుకు సాగేవాడు. ఏనుగు పేడతో కాగితాన్ని ఎలా తయారు చేస్తార… ఆవుపేడతో కూడా అలాగే తయారు చేయడానికి భీమ్ రాజ్ ప్రయత్నించాడు. కానీ ప్రయత్నాలు విఫలమయ్యాయి.
కొన్ని నెలల పాటు పరిశోధన చేశాడు. ఆవు పేడను నాణ్యమైన కాగితంగా మార్చడానికి ఎంతో ప్రయత్నించాడు. మొదటిసారి కాగితం చేసినప్పుడు అది ఉపయోగించే విధంగా రాలేదు. కానీ ఎంతో కొంత విజయాన్ని మాత్రం సాధించాడు. అదే నమ్మకంతో మళ్ళీ ప్రయత్నించాడు. ఈసారి అతడి విఫలం కాలేదు. మంచి నాణ్యమైన కాగితపు షీట్లు తయారయ్యాయి. ఇందుకోసం ఆయన ఉపయోగించింది ఆవు పేడ, ఆవు మూత్రం, పత్తి నుంచి వచ్చే వ్యర్ధాలు.
తాను తయారు చేసిన కాగితపు షీట్లను అమ్మడం మొదలుపెట్టాడు. మెల్లగా తన వ్యాపారాన్ని న్యూఢిల్లీ వరకు చేర్చాడు. ఢిల్లీలో కొంతమంది క్లయింట్లను పట్టుకొని వారికి కాగితాలను అమ్మడం మొదలుపెట్టాడు. వారి ద్వారా ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాదు ఇలా అనేక నగరాలకు ప్రస్తుతం కాగితపు షీట్లను అమ్మడం మొదలుపెట్టాడు.
30 లక్షల రూపాయలతో ఇప్పుడు అతిపెద్ద యూనిట్ ను పెట్టి అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు కూడా కాగితపు షీట్లను ఎగుమతి చేస్తున్నారు. ఇది ఒక్కటే కాదు… కాగితం తయారీ యూనిట్లో గ్రామీణ మహిళలకు కూడా ఉపాధి దొరికింది. ఒకప్పుడు ఆయనను చూసి నవ్విన వారే ఇప్పుడు అతని విజయాన్ని చూసి సిగ్గుపడుతున్నారు.
యాభై ఏళ్ల వయసులో కూడా ఒక స్టార్టప్ ను మొదలుపెట్టి విజయం సాధించడం అంటే సాధారణ విషయం కాదు. అందులోనూ పెళ్లీడు వయసున్న ఆడపిల్లలు ఉన్న ఇంట్లో మరింత బాధ్యతలు ఉంటాయి. వారికి పెళ్లి చేయాలనే ఆలోచన మనసును తొలుస్తూనే ఉంటుంది. అయినా భీమరాజు తన స్టార్టప్ పై నమ్మకంతో ముందుకు వెళ్లాడు. ఒకప్పుడు కూతురు పెళ్లి కోసం రూపాయి రూపాయి దాచిన భీమ్రాజ్ తర్వాత కూతురు పెళ్లిని అంగరంగ వైభవంగా నిర్వహించాడు.
భీమ్ రాజ్ సాధించిన విజయం ఆ గ్రామంలోనే కాదు చుట్టుపక్కల ఊళ్ళల్లో కూడా మారుమోగింది. స్టార్టప్ పెట్టడానికి, సక్సెస్ సాధించడానికీ వయసు అడ్డంకి కాదని నిరూపించింది. సమాజం నుండి విమర్శలు, ఎగతాళి గురించి పట్టించుకుంటే మనిషి అక్కడే ఆగిపోతాడు. కొత్త దారిలో విప్లవాత్మకంగా అడుగులు వేస్తేనే అతడు విజయం దక్కుతుంది. దీనికి భీమరాజు జీవితమే ఒక ఉదాహరణ.
సంబంధిత కథనం