వేసవిలో మజ్జిగ తాగడం ఎంత ముఖ్యమో తెలుసా? పెరుగు కన్నా మజ్జిగే మంచిది

Best Web Hosting Provider In India 2024

వేసవిలో మజ్జిగ తాగడం ఎంత ముఖ్యమో తెలుసా? పెరుగు కన్నా మజ్జిగే మంచిది

Haritha Chappa HT Telugu

వేసవిలో శరీరానికి చలువ చేసే పానీయాలను, ఆహారాన్ని ఎంపిక చేసుకుని తినాలి. ముఖ్యంగా శరీరం వేసవి వేడికి డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలంటే ప్రతిరోజూ మజ్జిగ తాగాల్సిన అవసరం ఉంది. పెరుగు తినే బదులు వేసవిలో మజ్జిగ తాగడం ఎందుకు ముఖ్యమో తెలుసుకోండి.

వేసవిలో మజ్జిగ ఉపయోగాలు

మజ్జిగ తాగడం వల్ల వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఎండల తీవ్రత రోజురోజుకి పెరుగుతోంది. అందరూ హైడ్రేట్‌గా ఉండాల్సిన సమయం ఇది. హైడ్రేషన్ కోసం సరిపడా నీరు త్రాగడం చాలా ముఖ్యం. కానీ రోజంతా నీరు మాత్రమే తాగడం వల్ల ఉపయోగం లేదు.

వేసవిలో హైడ్రేట్‌గా ఉండటానికి నారింజ జ్యూస్, నీళ్ళు, పండ్లు తో పాటు రోజుకు రెండుసార్లు మజ్జిగ కూడా ఆహారంలో చేర్చుకోవాలి. పెరుగుతో తయారయ్యే మజ్జిగ ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా మంది నిపుణులు రోజూ ఒక గ్లాసు మజ్జిగ త్రాగమని సలహా ఇస్తారు. వేసవిలో ఆరోగ్యానికి మజ్జిగ.. పెరుగు కంటే మెరుగైనది.

పెరుగుతోనే మజ్జిగ తయారవుతున్నప్పటికీ పెరుగు కన్నా మజ్జిగ ఎందుకు మెరుగైనది అనే సందేహం వచ్చే ఉంటుంది. ఆ ప్రశ్నకు సమాధానం ఇక్కడ ఇచ్చాము.

మజ్జిగ ఎందుకు మంచిది?

కొన్ని నివేదికల ప్రకారం పెరుగులో చురుకైన బ్యాక్టీరియా ఉంటాయి. అవి వేడికి గురైనప్పుడు పులియడం ప్రారంభిస్తాయి. కాబట్టి, మనం పెరుగు తిన్నప్పుడు అది పొట్టలో చేరి అక్కడ వేడికి పులియడం ప్రారంభిస్తుంది. అలాంటప్పుడు ఇది శరీరాన్ని చల్లార్చడానికి బదులుగా వేడి చేస్తుంది. ఈ పులిసే ప్రక్రియను నిరోధించడానికి మజ్జిగ మెరుగైనది. ఎందుకంటే దీన్ని పెరుగులో నీరు కలిపి తయారు చేస్తారు. అంతేకాకుండా మజ్జిగలో కొంతమంది జీలకర్ర పొడి, పింక్ సాల్ట్, కొత్తిమీర, పుదీనా వంటివి కూడా కలుపుతారు. దీని వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. కొంతమంది మజ్జిగలో ఇంగువ కలిపి త్రాగడానికి ఇష్టపడతారు. దీనివల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది.

ఆయుర్వేదం ఏమి చెబుతుంది?

ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం, మజ్జిగలో చల్లదనం ఇచ్చే లక్షణాలు ఉంటాయి. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి ఇది ఒక అద్భుతమైన పానీయం. కాబట్టి, ఆయుర్వేదంలో పెరుగు కంటే మజ్జిగను ఆరోగ్యకరమైన ఎంపికగా పరిగణిస్తారు. పెరుగులో నీరు కలిపి మజ్జిగ తయారు చేయడం వల్ల జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. అందువల్ల, ఈ పానీయం జీర్ణ సమస్యలతో బాధపడుతున్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది.

అయితే పెరుగు వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఇక్కడ మేము చెప్పడం లేదు. పెరుగు తినడం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ వేసవిలో మాత్రం పెరుగు కన్నా మజ్జిగ తాగడం వల్లే చలవు చేస్తుంది. ఇది ఆరోగ్యకరమైన వేసవి చలువ పానీయంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రతిరోజూ వేసవిలో నెలల్లో ఒకటి లేదా రెండు గ్లాసులో మజ్జిగ తాగేందుకు ప్రయత్నించండి.

(గమనిక: ఈ సమాచారం పూర్తిగా నమ్మకాలు, గ్రంథాలు, వివిధ మాధ్యమాలపై ఆధారపడి ఉంటుంది. సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా సమాచారాన్ని ఆమోదించే ముందు నిపుణులను సంప్రదించండి.)

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి https://www.linkedin.com/in/haritha-ch-288a581a8/

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024