



Best Web Hosting Provider In India 2024
‘‘ఉగ్రదాడిని అడ్డుకుని, టెర్రరిస్ట్ నుంచి రైఫిల్ లాక్కోవడానికి ప్రయత్నించి..’’ – పహల్గామ్ లో సామాన్యుడి సాహసం
పహల్గామ్ ఉగ్రదాడి సమయంలో ఉగ్రవాదులను అడ్డుకుని, ప్రాణాలు కోల్పోయిన ఒక స్థానికుడి వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. పోనీ రైడ్ ఆపరేటర్ సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించి దాడి సమయంలో ఒక ఉగ్రవాది నుంచి రైఫిల్ లాక్కోవడానికి ప్రయత్నించి, వారి కాల్పుల్లో చనిపోయాడు.
దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడి సమయంలో కశ్మీరీ పోనీ రైడ్ ఆపరేటర్ చేసిన సాహసోపేత చర్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఉగ్రవాదిని అడ్డుకుని..
పహల్గామ్ లో కార్ పార్కింగ్ ప్రాంతం నుంచి బైసరన్ మైదానానికి పర్యాటకులను తన గుర్రంపై తీసుకువెళ్లే సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా మంగళవారం నాటి ఉగ్రవాదుల దాడి సమయంలో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించారు. కాల్పులు జరుపుతున్న ఒక ఉగ్రవాది నుంచి తుపాకీని లాక్కోవడానికి ప్రయత్నించాడు. కానీ దురదృష్టవశాత్తు ఉగ్రవాదుల కాల్పుల్లో అక్కడికక్కడే మరణించాడు.
వృద్ధ తల్లిదండ్రులు, భార్యాపిల్లలు
సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా రెగ్యులర్ గా తన గుర్రంపై కారు పార్కింగ్ నుండి బైసరన్ మైదానానికి పర్యాటకులను తీసుకువెళ్లేవాడు. అదే అతడి జీవనాధారం. సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా కు వృద్ధులైన తల్లిదండ్రులు, భార్యాపిల్లలు ఉన్నారు. ఆ కుటుంబానికి అతను ఒక్కడే ఆధారం. “నా కుమారుడు నిన్న పని కోసం పహల్గామ్ కు వెళ్లాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో దాడి గురించి మాకు తెలిసింది. మేము అతనికి కాల్ చేసాము. కాని అతని ఫోన్ స్విచ్ఛాఫ్ అయి ఉంది. అనంతరం సాయంత్రం 4.40 గంటలకు ఫోన్ ఆన్ అయింది, కానీ ఎవరూ స్పందించలేదు. మేము వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్ళాము. అప్పుడే నా కుమారుడు ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయాడని మాకు తెలిసింది. బాధ్యులను కఠినంగా శిక్షించాలి’’ అని సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా తండ్రి సయ్యద్ హైదర్ షా అన్నారు.
పహల్గామ్ ఉగ్రదాడిలో ఇద్దరు విదేశీయులు మృతి
పహల్గామ్ లోని బైసరన్ మైదానంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో పలు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు సహా 26 మంది మృతి చెందారు. మృతుల్లో యూఏఈ, నేపాల్ కు చెందిన ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. మృతుల్లో మరో ఇద్దరు స్థానికులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో కర్ణాటక, మహారాష్ట్ర, హరియాణా, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు ఉన్నారు. క్షతగాత్రుల్లో గుజరాత్ కు చెందిన ఒకరు, తమిళనాడుకు చెందిన ముగ్గురు, మహారాష్ట్రకు చెందిన ఇద్దరు ఉన్నారు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link