





Best Web Hosting Provider In India 2024

ఉగ్రదాడి ఓ అనాగరిక చర్య, ఏపీ బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం – సీఎం చంద్రబాబు
ఉగ్రవాద చర్యలు భారతదేశాన్ని ఏమీ చేయలేవని సీఎం చంద్రబాబు అన్నారు. పహల్ గామ్ ఉగ్రదాడిలో మృతి చెందిన విశాఖ వాసి చంద్రమౌళి భౌతిక కాయానికి సీఎం చంద్రబాబు నివాళులు అర్పించారు. ఏపీకి చెందిన బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు.
జమ్ము కశ్మీర్ పహల్ గామ్ ఉగ్రదాడి ఒక అనాగరిక చర్యగా సీఎం చంద్రబాబు అభివర్ణించారు. ఉగ్రదాడిలో మరణించిన విశాఖ వాసి చంద్రమౌళి మృతదేహానికి సీఎం చంద్రబాబు నివాళి నివాళులర్పించారు. చంద్రమౌళి కుటుంబ సభ్యులని ఓదార్చి ధైర్యం చెప్పారు.
ఉగ్రవాద చర్యలు భారతదేశాన్ని ఏమీ చేయలేవని సీఎం చంద్రబాబు చెప్పారు. దేశంలో సుస్థిరమైన ప్రభుత్వం ఉందని తెలిపారు. కశ్మీర్లో ఉగ్రవాదాన్ని నిర్మూలించి, అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో ఉగ్రదాడి జరగడం చాలా బాధకరమన్నారు.
రూ.10 లక్షల ఆర్థిక సాయం
దేశంలోని ప్రతి ఒక్కరూ ఈ దాడిని ఖండించాల్సిన అవసరముందన్నారు. పహల్ గామ్ ఉగ్రదాడిలో ఏపీకి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారని, బాధిత కుటుంబాలకు రూ. 10 లక్షలు చొప్పున ఆర్థిక సాయం చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
ఉగ్రవాదులు ముందస్తు ప్రణాళిక ప్రకారమే దాడి చేశారని, సరిహద్దుల్లో చొరబాటుదారులను సమర్థంగా అడ్డుకోవాల్సి ఉందని సీఎం వ్యాఖ్యానించారు. ఉగ్రదాడిలో నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్, విశాఖకు చెందిన చంద్రమౌళి మరణించారు.
“భారత్ లో అస్థిరత సృష్టించేందుకు కొన్ని శక్తులు కుట్ర చేస్తున్నాయి. ఇలాంటి చర్యలను అంతా ఖండించాలి. పహల్గామ్ ఉగ్రదాడిలో, రాష్ట్రానికి చెందిన ఇద్దరు చనిపోయారు. చనిపోయిన కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరుపున రూ.10 లక్షలు అందచేస్తాం” –సీఎం చంద్రబాబు
ఉగ్రవాదుల దాడి అత్యంత హేయం- ఎమ్మెల్సీ నాగబాబు
జమ్ము కశ్మీర్ పహల్ గామ్ లో పర్యాటకులపై జరిగిన దాడిని ముక్త కంఠంతో ఖండిస్తున్నామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కె.నాగబాబు స్పష్టం చేశారు. పర్యాటకులపై ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ మృతులకు సంతాపం తెలియజేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపు మేరకు బుధవారం సాయంత్రం హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో నాగబాబు పాల్గొన్నారు.
ర్యాలీలో పాల్గొన్న అనంతరం ఎమ్మెల్సీ నాగబాబు మాట్లాడుతూ పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడి హేయమైనదని స్పష్టం చేశారు. ఈ ఘటన పట్ల అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర మనోవేదనకు గురయ్యారన్నారు. ఈ ఘటనకు కారకులను కఠినంగా శిక్షించి బలమైన పాఠం చెప్పాలన్నారు.
బాధిత కుటుంబాల వేదన కలచి వేస్తోందని, మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మృతి చెందిన వారికి సంతాపం తెలుపుతున్నట్లు నాగబాబు ప్రకటించారు.
వైసీపీ ర్యాలీలు
వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, నిన్న జమ్ము కశ్మీర్ లోని పహల్గామ్ దగ్గర పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ, ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి ఆత్మలకు శాంతికలగాలని రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వైసీపీ నేతలు ర్యాలీ చేశారు. కశ్మీర్లో పర్యాటకులపై దాడిని మానవత్వంపై దాడిగా వైయస్ఆర్సీపీ పరిగణిస్తోందని ఆ పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.
ఉగ్రదాడిలో చనిపోయిన వారి ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తున్నామన్నారు. అలానే బాధితుల కుటుంబాలకి పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని ఈరోజు ఈ క్యాండిల్ ర్యాలీ ద్వారా చాటుతున్నామన్నారు.
సంబంధిత కథనం
టాపిక్