



Best Web Hosting Provider In India 2024
‘‘కెమెరాలున్న హెల్మెట్ ధరించి, దారుణాన్ని రికార్డు చేసి..’’ పహల్గామ్ ఉగ్రదాడి పూర్తి వివరాలు
పహల్గామ్ ఉగ్రదాడి భారతీయులను ఆగ్రహావేశాలకు లోను చేస్తోంది. లష్కరే తోయిబా అనుబంధం సంస్థ టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు కశ్మీర్ పర్యటనకు వచ్చిన టూరిస్టులపై విచక్షణారహితంగా కాల్పులు 26 మంది ప్రాణాలు తీశారు. మంగళవారం మధ్యాహ్నం 2.30 లేదా 3 గంటల సమయంలో జరిగిన ఈ దాడి పూర్తి వివరాలను ఇక్కడ చూడండి.
జమ్ముకశ్మీర్ లోని సుందరమైన పర్యాటక ప్రాంతమైన పహల్గామ్ లో విహారయాత్రను ఆస్వాదిస్తున్న పౌరులపై సాయుధ ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో అక్కడి దృశ్యం భయానకంగా మారింది. ఈ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జరిగిన అత్యంత దారుణమైన దాడి ఇది.
పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించిన పూర్తి వివరాలు
- మంగళవారం మధ్యాహ్నం 2.30 లేదా 3 గంటల సమయంలో పహల్గామ్ ఉగ్రదాడులు జరిగినట్లు తెలుస్తోంది. లోయ చుట్టుపక్కల దట్టమైన పైన్ అడవి నుంచి ఉగ్రవాదులు ఒక్కసారిగా బయటకు వచ్చి అక్కడ ఉన్న 40 మంది పర్యాటకులపై కాల్పులు ప్రారంభించారు.
- 2. మిలటరీ దుస్తుల్లో ఉన్న ఇద్దరు ముగ్గురు ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ” చాలా సేపు కాల్పుల శబ్దం వినిపించింది. అందరూ అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి తప్పించుకోవాలనుకున్నాం కాబట్టి వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి పారిపోయాం’’ అని మరో ప్రత్యక్ష సాక్షి తెలిపారు.
3. అక్కడి పర్యాటకులను ముందుగా వారి మతం గురించి అడిగి, ఆ తరువాత ముస్లింలు కాని వారిపై కాల్పులు జరిపి చంపేశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఒక మతానికి చెందిన పర్యాటకులను ఉగ్రవాదులు వేరుగా చేశారని, వారితో ‘కల్మా’ ను పఠించమని కోరారని, ఆ తరువాత వారిని కాల్చి చంపారని ప్రత్యక్ష సాక్షులు భద్రతా దళాలకు చెప్పారు.
4. ఈ దాడిలో హర్యానాకు చెందిన నేవీ అధికారి వినయ్ నర్వాల్ చనిపోయారు. ఆయన భార్య హిమాన్షి ఈ దారుణాన్ని ఇలా వివరించారు. ‘నేను నా భర్తతో కలిసి భేల్ పూరీ తింటున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు. నా భర్త ముస్లిం కాదని చెప్పి, ఆపై తుపాకీతో కాల్చి చంపాడు’ అని తెలిపారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. హర్యానాకు చెందిన వినయ్ కొచ్చిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఉగ్రదాడి జరగడానికి కొద్ది రోజుల ముందు అంటే ఏప్రిల్ 16న ఆయన వివాహం జరిగింది. చలనం లేని వినయ్ నర్వాల్ మృతదేహం పక్కన హిమాన్షి కూర్చున్న చిత్రం పహల్గామ్ విషాదానికి ముఖ చిత్రంగా మారింది.
5. ఈ దాడిలో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, హర్యానా, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు ఉన్నారు. క్షతగాత్రుల్లో గుజరాత్ కు చెందిన ఒకరు, తమిళనాడుకు చెందిన ముగ్గురు, మహారాష్ట్రకు చెందిన ఇద్దరు ఉన్నట్లు పీటీఐ తెలిపింది.
టెర్రరిస్టులు ఎవరు?
6. మంగళవారం జరిగిన దాడికి తామే బాధ్యులమని రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది. టీఆర్ ఎఫ్ లష్కరే తోయిబాకు ఫ్రంట్ గా భావిస్తున్నారు. వీడియో క్లిప్పింగ్ ద్వారా ఇద్దరు ఉగ్రవాదులను గుర్తించినట్లు, వీరిద్దరూ కశ్మీరీలేనని, శిక్షణ కోసం పాకిస్థాన్ కు వెళ్లారని ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి.
7. జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ లో పర్యాటకులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదుల్లో ఒకరు ఉన్న ఫొటోను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదిలావుండగా, 26 మందిని పొట్టనబెట్టుకున్న పహల్గామ్ దాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదుల సెట్ స్కెచ్ లను జమ్ముకశ్మీర్ పోలీసులు విడుదల చేశారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ఆధారంగా స్కెచ్ లు వేసినట్లు పోలీసులు తెలిపారు.
8. పహల్గామ్ లో దాడికి పాల్పడిన ఉగ్రవాదులు తమ తలలకు కెమెరాలను అమర్చిన హెల్మెట్ లను ధరించారని, మొత్తం దాడి క్రమాన్ని రికార్డు చేశారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
9. దాడి తరువాత మృతులను ముగ్గురు ఉగ్రవాదులు ఒకచోట చేర్చి, వారి గుర్తింపును ధృవీకరించినట్లు తెలిసింది. కొంతమందిని స్నైపర్ లాంటి వాటితో దూరం నుంచి కాల్చారని తెలిసింది. ఎక్కువమంది తీవ్ర రక్త స్రావంతో చనిపోయారని నివేదిక తెలిపింది.
10. ఉగ్రవాదులు దాడి కోసం వ్యూహాత్మకంగా ఆ ప్రదేశాన్ని ఎన్నుకున్నారని, అక్కడైతే సహాయక చర్యలు ఆలస్యమవుతాయని, తద్వారా ప్రాణనష్టం ఎక్కువగా ఉంటుందని వారు ప్రణాళిక వేసుకున్నారని భద్రతాదళాలు భావిస్తున్నాయి.
వారు పర్యాటకులు కాదు.. ఏజెంట్స్
కాగా, తాము హతమార్చింది సాధారణ పర్యాటకులను కాదని, వారు భారత భద్రతా విభాగాలకు చెందిన వారు ఉన్నారని, వారు ఒక సెక్యూరిటీ రీసెర్చ్ లో భాగంగా అక్కడికి వచ్చారని ఉగ్రదాడికి పాల్పడిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది సాధారణ పర్యాటక బృందం కాదని, పరిశోధనలకు సంబంధించిన అండర్ కవర్ ఏజెన్సీ అని ఆరోపించింది.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link