





Best Web Hosting Provider In India 2024

అప్పుడు ఇంటర్ ఫెయిలయ్యాడు, ఇప్పుడు సివిల్స్ సాధించాడు.. ఒక్క వైఫల్యం ఎవరి విజయాన్ని ఆపలేదు
ఒక్క వైఫల్యం ఎవరి జీవితాన్ని ఆపేయలేదు. అది కేవలం ఒక అడ్డంకి మాత్రమే. మళ్ళీ ప్రయత్నించడానికి నేర్చుకోవడానికి మరింత బలంగా తిరిగి రావడానికి వైఫల్యం అనేది ఒక అవకాశం.
సివిల్స్ ర్యాంకర్లందరూ చదువుల్లో టాప్ అనే భావన ఎంతో మందిలో ఉంటుంది. కేవలం బాగా చదివేవారు, టెన్త్, ఇంటర్లో టాపర్లు మాత్రమే సివిల్స్ ర్యాంకర్లుగా నిలుస్తారని అపోహ కూడా ఎంతో మందిలో ఉంది. చదువుల్లో మంచి మార్కులు తెచ్చుకున్న వారే సివిల్స్ లో కూడా ర్యాంకులు సాధిస్తారని అనుకునే వారికి పామూరు సురేష్ జీవితం ఒక ఉదాహరణ. సాధారణ విద్యార్థులు కూడా కష్టపడితే సివిల్స్ ర్యాంకర్లుగా మారొచ్చని నిరూపించాడు ఈ సాధారణ యువకుడు.
పామూరు సురేష్‌ది తిరుపతి జిల్లా నారాయణవనం మండలం గోవిందప్పనాయుడు కండ్రిగ గ్రామం. అతడు టెన్త్ వరకు అత్యంత సాధారణ విద్యార్థి. ఇంటర్ మొదటి సంవత్సరంలో ఫెయిల్ అయిపోయాడు. దాంతో ఇంటర్ వదిలేసి డిప్లమో చేశాడు. అప్పట్లో అతడికి చదువు రాదని ఎంతోమంది ఎన్నో మాటలు అన్నారు. ఇంటర్ ఫెయిల్ అయినప్పుడు ఇంటి నుంచి బయట ఎన్నో అవమానాలు కూడా ఎదురయ్యాయి.
ఆ సమయంలోనే అతను స్వామి వివేకానంద, అబ్దుల్ కలాం వంటి పుస్తకాలు చదవడం ప్రారంభించాడు. ఆ పుస్తకాలు అతని జీవితంలో ఎంతో మార్పును తెచ్చాయి. అతనిలో స్ఫూర్తి కలిగింది. జీవితంలో వైఫల్యాలు వచ్చినా కూడా అబ్దుల్ కలాం ఎలా నిలిచి గెలిచారో అతడికి అర్థమైంది. డిప్లొమో చేశాక ఈసెట్ రాసి రాష్ట్రస్థాయిలో ఏడో ర్యాంకు సాధించాడు. ఇంటర్ ఫెయిల్ అయిన వ్యక్తి ఈసెట్లో ఏడో ర్యాంకు సాధించడం ఆ ఊరిలోనే వార్తగా నిలిచింది.
ఆ తర్వాత కర్నూలులో ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా సాధించాడు. ఆ తర్వాత సివిల్స్ నే లక్ష్యంగా పెట్టుకున్నాడు. 2017లో తొలిసారి సివిల్స్ పరీక్షను రాశాడు. కానీ ప్రిలిమ్స్ కూడా దాటలేకపోయాడు. మరి మళ్ళీ రెండోసారి ప్రయత్నించాడు. ఈసారి ఇంటర్వ్యూ వరకు వెళ్ళాడు. కానీ తుది జాబితాలో చోటు దక్కలేదు.
దీంతో 2020లో అతడికి వినికిడి సమస్య వచ్చింది. అయితే ఐపీఎస్ కావాలన్న తన లక్ష్యం వినికిడి సమస్య వల్ల సాధించలేని పరిస్థితి. దాంతో ఐఏఎస్ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. తన ప్రభుత్వ ఉద్యోగానికి కూడా రాజీనామా చేశాడు. లక్షన్నర జీతాన్ని వదిలి సివిల్స్ పరీక్ష కోసం పట్టు వదలకుండా ప్రయత్నించాడు. చివరికి 2024లో ఏడో ప్రయత్నం చేశాడు. అప్పుడు 988వ ర్యాంకు వచ్చింది.
ఇంటర్ ఫెయిల్ అయిన వ్యక్తి సివిల్స్ ర్యాంకు సాధిస్తాడని ఎవరూ అనుకుని ఉండరు. అతను కూడా తన జీవితం అంతేనని ఆగిపోయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ ఒక వైఫల్యం అతనిని ఆపలేకపోయింది. వైఫల్యం అనేది విజయానికి ఒక ముందడుగుగా మారింది.
వైఫల్యం వచ్చినప్పుడు నిరాశ చెందకుండా మళ్ళీ ప్రయత్నించాలని కొత్త మార్గాలను అన్వేషించాలన్నదే సురేష్ ఉద్దేశం. సురేష్ లాంటి సాధారణ విద్యార్థులు ఎంతోమంది ఉంటారు. అలాంటివారు ఇతను చూసి ఎంతో నేర్చుకోవాలి. పదో తరగతి ఫెయిల్ అయిపోయినా, ఇంటర్ ఫెయిల్ అయిపోయినా జీవితం మరిచిపోయినట్టు కాదు. ఇంకా ఎంతో జీవితం ఉంది. మరింత బలంగా తిరిగి రావడానికి ప్రయత్నించండి. వైఫల్యం ద్వారా పొందిన అనుభవం, జ్ఞానం, పట్టుదల, మీలో విజయం సాధించడానికి ఎంతో సహాయపడతాయి.
సంబంధిత కథనం