



Best Web Hosting Provider In India 2024
‘‘నా పేరు భరత్ అని చెప్పగానే కుటుంబ సభ్యుల ముందే కాల్చి చంపారు’’: పహల్గామ్ విషాదం
కశ్మీర్లోని పహల్గామ్ లో ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన వారి కన్నీటి గాధలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రవాదుల రాక్షసత్వాన్ని కళ్లకు కట్టుతున్నాయి. బెంగళూరుకు చెందిన భరత్ భూషణ్ అనే టెక్కీని పహల్గామ్ లో ఉగ్రవాదులు పేరు అడిగి, తన పేరు భరత్ అని చెప్పగానే కాల్చి చంపారు.
పహల్గాంలోని అందమైన లోయలో ప్రశాంతమైన కుటుంబ విహారయాత్రగా మొదలైన కార్యక్రమం ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు పీడకలగా మారింది. అందులో ఒక కుటుంబం మంగళవారం ఉగ్రవాదుల చేతిలో దారుణ హత్యకు గురైన బెంగళూరుకు చెందిన 35 ఏళ్ల టెక్కీ భరత్ భూషణ్ ది. “నా పేరు భరత్” అనే అతని చివరి మాటలు పూర్తి కాకముందే ఉగ్రవాదులు అతి దగ్గర నుంచి కాల్పి చంపారు. అతని మతపరమైన గుర్తింపును ధృవీకరించుకున్న వెంటనే ముష్కరులు అతని భార్య, బిడ్డ ముందే అతని తలపై కాల్చారు.
కుటుంబంతో విహారంలో ఉండగా..
35 ఏళ్ల వయస్సున్న భరత్ భూషణ్ బెంగళూరుకు చెందిన టెక్కీ. అతని భార్య శిశు వైద్యురాలు. వారికి 3 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. కశ్మీర్ పర్యటనకు వెళ్లిన ఆ కుటుంబానికి ఉగ్రదాడి తీరని విషాదాన్ని మిగిల్చింది. పహల్గామ్ లోని అందమైన లోయలో విహరిస్తున్న వారిపైకి ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. భరత్ భూషణ్ వద్దకు వచ్చి, అతడి పేరు, మతం అడిగారు. తన పేరు భరత్ భూషణ్ అని, తాను హిందువునని చెప్పగానే, పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చి చంపారు. ఈ వివరాలను భరత్ భూషణ్ తండ్రి చెన్నవీరప్ప చెప్పారు.
కొన్ని గంటల ముందే వీడియో కాల్
చనిపోవడానికి కొన్ని గంటల ముందు, భరత్ భూషణ్ తన ఇంటికి వీడియో కాల్ చేసి, మంచుతో కప్పి ఉన్న ఆ ప్రాంతం అందాలను చూపించాడని అతడి తండ్రి కన్నీళ్ల మధ్య తెలిపాడు. తదుపరి తమ ప్రణాళికల గురించి తమకు వివరించి, తన ఆనందాన్ని పంచుకున్నాడని ఆ తండ్రి వివరించాడు. వీడియో కాల్ లో అందమైన దృశ్యాలను చూపించాడు’ అని చెప్పారు.
మర్నాటి ఉదయం వరకు..
మరుసటి రోజు ఉదయం మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో కన్నడ దినపత్రిక చదువుతున్న చెన్నవీరప్పకు తన కుమారుడి మరణవార్త తెలిసింది. “నా కాళ్ళు విరిగిపోయాయి. ఏం చేయాలో తోచలేదు. ఈ విషయాన్ని నా కుటుంబ సభ్యులు నాకు, నా భార్యకు తెలియకుండా గోప్యంగా ఉంచారు’’ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో పహల్గాంలో పలువురు పర్యాటకులు మృతి చెందినట్లు స్నేహితులు, శ్రేయోభిలాషులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. భరత్ అన్న ప్రీతమ్ ఈ వార్తలను ధృవీకరించడానికి ప్రయత్నించాడు. కాని ఫోన్ సిగ్నల్ మరియు ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోవడంతో ఈ విషాద వార్త వారికి ఆలస్యంగా తెలిసింది. అర్ధరాత్రి 2 గంటలకు వారికి కన్ఫర్మేషన్ వచ్చింది.
దేశం దిగ్భ్రాంతి
మతపరమైన గుర్తింపు ఆధారంగా పౌరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు చేసిన ఈ దాడి దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఘర్షణలు జరిగే ప్రాంతాల్లో పర్యాటకులు ఎదుర్కొంటున్న బెదిరింపులకు భరత్ హత్య నిదర్శనంగా మారింది. “ఈ భూమికి భారతదేశం అనే పేరు పెట్టడానికి కారణమైన భరత్ రాజు పేరు మీద మేము మా కుమారుడికి భరత్ అనే పేరు పెట్టాము. ఆ పేరు అడిగిన తరువాత ఉగ్రవాదులు అతన్ని చంపేశారు.” అని ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.
బెంగళూరుకు చేరుకున్న భరత్ పార్థివదేహం
భరత్ పార్థివదేహాన్ని గురువారం ఉదయం విమానంలో బెంగళూరుకు తరలించి, అనంతరం అంత్యక్రియల కోసం ఆయన నివాసానికి తరలించారు. ఇటీవలి కాలంలో పౌరులపై జరిగిన అత్యంత క్రూరమైన ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన అమాయకులకు నివాళి అర్పిస్తూ పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link