కష్టాలు అందరికి వస్తాయ్… వాటిని ఎలా ఎదుర్కొని మెరుగవుతావనేదే ముఖ్యం, అదే నీ నిజమైన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది!

Best Web Hosting Provider In India 2024

కష్టాలు అందరికి వస్తాయ్… వాటిని ఎలా ఎదుర్కొని మెరుగవుతావనేదే ముఖ్యం, అదే నీ నిజమైన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది!

Ramya Sri Marka HT Telugu

జీవితం ప్రతి ఒక్కరికీ పరీక్షలు పెడుతుంది. కానీ వాటి ద్వారా మనం ఏం నేర్చుకున్నామా అనేదే ముఖ్యం. ఓ చిన్నఅమ్మాయి ఒత్తిడులకు కుంగిపోయి జీవితం నచ్చడం లేదని తండ్రికి చెబుతుంది. దానికి అతను మూడు వస్తువుల ద్వారా జీవిత పాఠాన్ని ఆమెకు అర్థమయ్యేలా చెబుతాడు. ఆ నాన్న చెప్పిన కథ వింటే కష్టాలను చూసి ఎవరూ భయపడరు.

కష్టాలు అందరికి వస్తాయ్… వాటిని ఎలా ఎదుర్కొని మెరుగవుతావనేదే అసలు విషయం!

జీవితం అనేది ఎప్పుడూ ఒకేలా జరిగే సాఫీ ప్రయాణం కాదు. ఒక్కోరోజూ ఒకలా ఉంటుంది. ప్రతి మనిషి జీవితంలో ఒక దశ వస్తుంది. ఈ దశలో ఆత్మవిశ్వాసం పూర్తిగా సన్నగిల్లిపోతుంది, సమస్యలన్నీ చుట్టుముట్టి నేలలో కూరుకుపోతున్నట్లు అనిపిస్తుంది. అలాంటి సందర్భంలో చాలా మంది ఇంత కష్టం ఎందుకొచ్చింది, ఎందుకు నాకే ఎప్పుడూ కష్టాలు వస్తుంటాయి అని ఫీలవుతుంటారు, వీటిని ఎన్నాళ్లు ఎదుర్కోవాలని బాధపడుతుంటారు.కొందరు జీవితం మీద ఆశలు కోల్పోయి నిరాశలోనే జీవిస్తారు.

సరిగ్గా ఇలాంటి ఆలోచనలతోనే ఓ కూతురు నాన్న దగ్గరకు వెళుతుంది. జీవితంలో తాను ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందనీ, బతుకు భారంగా మారిందని, తట్టుకోవడం కష్టంగా ఉందనీ బాధపుడుతూ ఉంటుంది. అప్పుడు ఆ నాన్న కూతురికి ఏం చెబుతాడో తెలిస్తే మీరు కూడా మీ ఆలోచనను మార్చుకుంటారు. కష్టాలను చూసి ఎప్పుడూ భయపడరు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఈ కథ మీకెంత దగ్గరగా ఉంటుందో చూద్దాం రండి.

క్యారెట్, గుడ్డు, కాఫీ గింజల కథ..

ఒక చిన్న పట్టణంలో వర్షం బాగా పడుతోంది. బయట వర్షం, ఇంట్లో నాన్న మౌనం. అప్పుడే కాఫీ కప్పుతో వచ్చిన చిన్న అమ్మాయి పెద్దగా నిట్టూరుస్తూ ఇలా అంటుంది.”నాన్నా… నాకు జీవితం చాలా కష్టం అయిపోయింది. ప్రతీ రోజు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. చదువు ఒత్తిడి, స్నేహితుల నుంచి దూరం, మనసులో ఒంటరిదానిని అనే భావన పెరిగిపోతుంది. నాకైతే ఇప్పుడు లైఫ్ అన్నదే భారంగా అనిపిస్తోంది. ఇక తట్టుకోలేను.” అంటుంది.

ఆమె మాటలు విని ఆమె నాన్న ముఖంలో చిన్న నవ్వు కనిపిస్తుంది. అప్పుడు చిన్న నవ్వుతో “నాకు చిన్న సహాయం కావాలి. చేస్తావా తల్లి” అని అడిగి ఆమెను వంటగదిలోకి తీసుకెళతాడు. అప్పుడు వంటగదిలో ఉన్న మూడు స్టవ్ లను వెలిగిస్తాడు. వాటిపై మూడు స్టీల్ పాత్రలు ఉంచి వాటిల్లో నీళ్లను నింపుతాడు. మూడు పాత్రలు మరిగిపోతుండగా వాటిలో ఒక దానిలో క్యారెట్, రెండవ దానిలో గుడ్డు, మూడవ దానిలో కాఫీ గింజలు వేసాడు.

అమ్మాయి ఆశ్చర్యంగా చూస్తూ.. “ఇదేంటి నాన్నా?” అని అడుగుతుంది. దానికి బదులుగా “కొంచెం ఓపిక పట్టు బంగారం…” అని చిరునవ్వుతో అంటాడు. పదిహేను నిమిషాల తర్వాత… స్టవ్ ఆర్పేసి ఆ మూడు పాత్రలను ఓపెన్ చేస్తాడు. వాటిల్లో ఉన్న క్యారెట్‌ను ఒక గిన్నెలో వేస్తాడు. గుడ్డును తీసి పక్కన పెడతాడు. మూడవ గిన్నెలో ఉన్న కాఫీని మగ్గులో పోస్తాడు.

“ఇప్పుడు చూడు” అని అమ్మాయిని దగ్గరకు రమ్మని పిలుస్తాడు. వచ్చిన అమ్మాయిని

  1. “క్యారెట్ను ముట్టుకో. ఇప్పుడెలా ఉంది” అని అడుగుతాడు. ఆ అమ్మాయి ఇది మృదువుగా ఉంది అని సమాధానమిస్తుంది..
  2. ఆ తర్వాత “గుడ్డును పగలగొట్టు” అని చెప్పి ముందుకు ఇప్పటికీ తేడా చెప్పమంటాడు. దానికి ఆ అమ్మాయి లోపల గట్టిగా అయిందని బదులిస్తుంది.
  3. “ఇప్పుడు ఈ కాఫీని ఓ సిప్ తాగు, ఏం గమనించావ్” అని ప్రశ్నిస్తాడు. అప్పుడామె ఒక సుగంధ రుచితో నోటిలో విస్తరించింది. అని ఆశ్చర్యంతో తల ఊపుతూ చెప్తుంది.

అప్పుడు వాళ్ల నాన్న స్పష్టంగా మాట్లాడుతూ.. “బంగారం… ఇదేనమ్మా జీవితం చెప్పే గొప్ప పాఠం.” “కష్టాలు అంటే మరిగే నీళ్ల లాంటివి. అవి మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయనేది మన మనసు మీదే ఆధారపడి ఉంటుంది.”

  • – క్యారెట్ మొదట బలంగానే కనిపిస్తుంది, కానీ నీళ్లలో మరిగేసరికి బలహీనమైపోతుంది.
  • – గుడ్డు ముందుగా మృదుత్వం కలిగి ఉంటుంది, కానీ కష్టాల వేడికి కఠినమైపోతుంది.
  • – అలాగే కాఫీ గింజలు వేడి నీటిలో మరిగేసరికి తాము మారిపోవడమే కాకుండా… నీటిని కూడా మార్చేశాయి. వాసన, రుచిని పంచుతాయి.

“జీవితం కూడా అంతే. నువ్వు జీవితంలో ఎదుర్కొనే పరిస్థితులను బట్టి ఎలా మారగలవో అది నీచేతుల్లోనే ఉంటుంది. కష్టం వచ్చినప్పుడు క్యారెట్ లా బలహీనమవుతావో.., కోడిగుడ్డులా లోపలుండి కఠినంగా తయారువుతావో, లేదా కాఫీలా, కష్టాల్ని ఎదుర్కొని పరిసరాలను కూడా సానుకూలంగా మార్చుకోగలుగుతావో.. అది పూర్తిగా నీ మీదే ఆధారపడి ఉంటుంది” అని అంటాడు నాన్న.

ఆ మాటలు విన్న అమ్మాయి… ఓ చిన్న చిరునవ్వుతో తన నాన్న చేతిలోని కాఫీ మగ్గును తీసుకుని, “నాన్నా, నేను కాఫీలా మారాలనుకుంటున్నాను. నేను మారడమే కాకుండా నా పరిసరాలపై కూడా సానుకూలమైన మార్పు తీసుకొస్తాను. మీరు నేర్పిన ఈ పాఠం జీవితాంతం గుర్తుంచుకుంటాను” అని చెప్తుంది.

సారాంశం ఏంటంటే..

ఈ కథ ఓ పెద్ద ఉపన్యాసం కాదు, ఓ పాఠ్యపుస్తకం పాఠం కాదు, కానీ మన మనసును తాకే జీవన సత్యం. ప్రతి ఒక్కరికీ జీవితంలో ఉడికే నీళ్ల లాంటి పరిస్థితులు తప్పవు. కానీ వాటిని ఎలా తట్టుకున్నామని, వాటి ద్వారా నువ్వు నేర్చుకుని జీవితంలో ఎలా ఎదగగలుగుతావనేది నీ చేతుల్లోనే ఉంటుంది. అదే నీ నిజమైన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. కష్టాల నుంచి చూసి భయపడకుండా, కాఫీ గింజలా గెలిచి చూపించు.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024