





Best Web Hosting Provider In India 2024

పదో తరగతి పరీక్షల్లో కూలీ కుమార్తె ప్రతిభ.. ఎకరం పొలం మంజూరు చేసిన కలెక్టర్!
పదో తరగతి పరీక్షల్లో చాలామంది నిరుపేద విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. వారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. పల్నాడు జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని ప్రతిభ గురించి తెలుసుకున్న కలెక్టర్.. ఆమె కుటుంబానికి ఎకరం పొలాన్ని మంజూరు చేశారు. ఆ విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పదో తరగతి పరీక్షల్లో 593 మార్కులు సాధించిన అమూల్య అనే విద్యార్థిని ప్రతిభను.. కలెక్టర్ గుర్తించారు. అమూల్య కుటుంబానికి ఎకరం పొలం మంజూరు చేస్తూ.. పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు ఆదేశాలిచ్చారు. నాదెండ్ల మండలం చిరుమామిళ్ల జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని అమూల్య.. పదో తరగతి ఫలితాల్లో 593 మార్కులు సాధించి ప్రతిభ చాటింది.
ఎకరం పొలం మంజూరు..
అయితే.. అమూల్య కుటుంబం కూలికి వెళ్తేనే పూట గడుస్తుందని తెలుసుకున్న కలెక్టర్ చలించిపోయారు. భూమి లేని నిరుపేదల పథకం కింద విద్యార్థిని కుటుంబానికి ఎకరం పొలం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అమూల్యతో పాటు మరో ముగ్గురు ఆడపిల్లలను తల్లిదండ్రులు అనిల్, రూతమ్మ కష్టపడి చదివిస్తున్నారు. సొంతభూమి అయితే.. మరింత కష్టపడి పిల్లలను ఉన్నత విద్యావంతులను చేసుకుంటామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
81.14 శాతం ఉత్తీర్ణత..
ఈ సంవత్సరం మొత్తం 6,14,459 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 4,98,585 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం ఉత్తీర్ణత 81.14 శాతంగా ఉంది. బాలికల ఉత్తీర్ణత 84.09 శాతం కాగా.. బాలుర ఉత్తీర్ణత శాతం 78.31గా ఉంది. పార్వతీపురం మన్యం జిల్లా అత్యధికంగా 93.90 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో ఉంది. 1,680 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. అలాగే 19 పాఠశాలల్లో 0 శాతం ఉత్తీర్ణత నమోదైంది..
రీకౌంటింగ్, రీవెరిఫికేషన్..
ఫలితాలపై సంతృప్తి చెందని విద్యార్థులు ఏప్రిల్ 24, 2025 నుండి మే 1, 2025 వరకు ఆన్‌లైన్‌లో రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ.500, రీవెరిఫికేషన్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ.1000 ఫీజు ఉంటుంది. దరఖాస్తు, ఫీజు చెల్లింపు ఆన్‌లైన్‌లో మాత్రమే చేయాలి.
సప్లిమెంటరీ పరీక్షలు..
ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షలు మే 19, 2025 నుండి మే 28, 2025 వరకు నిర్వహించనున్నారు. సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించడానికి ఏప్రిల్ 24 నుండి ఏప్రిల్ 30 వరకు ఎటువంటి ఆలస్య రుసుము లేదు. మే 1 నుండి మే 18 వరకు రూ.50 ఆలస్య రుసుముతో చెల్లించవచ్చు.
సంబంధిత కథనం
టాపిక్