




Best Web Hosting Provider In India 2024
‘పహల్గామ్’ ఉగ్రవాదుల ఇళ్లల్లో ఆర్మీ తనిఖీ- ఆ సమయంలోనే పేలుడు! అసలేం జరిగింది?
కశ్మీర్లో పహల్గామ్ ఉగ్రదాడిలో పాలుపంచుకున్నట్టు అనుమానిస్తున్న ఇద్దరు లష్కర్ ఉగ్రవాదుల ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఆయా చోట్ల సైన్యం గాలింపులు చేపట్టగా, అప్పటికే అమర్చిన పేలుడు పదార్థాలు పేలిపోయాయి. ఫలితంగా ఇళ్లు ధ్వంసమయ్యాయి.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రమేయం ఉందని భావిస్తున్న లష్కరే తోయిబా టెర్రరిస్ట్ ఆసిఫ్ షేక్ ఇల్లు గురువారం రాత్రి ధ్వంసమైంది. అంతేకాదు, ఆసిఫ్ షేక్‌తో పాటు మరొక ఉగ్రవాది ఇల్లు కూడా పేలుడులో ధ్వంసమైనట్టు తెలుస్తోంది.
ఈ సమాచారాన్ని హెచ్‌టీ తెలుగు, హెచ్‌టీ స్వతంత్రంగా ధృవీకరించలేదు.
ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఆదిల్ హుస్సేన్ థోకర్, ఆసిఫ్ షేక్ ఇళ్లలో భద్రతా దళాలు తనిఖీలు నిర్వహిస్తుండగా.. అప్పటికే వాటిల్లో అమర్చిన పేలుడు పదార్థాలు పేలినట్టు సమాచారం. ఫలితంగా ఆయా పేలుళ్లలో ఇళ్లు ధ్వంసమయ్యాయని నివేదిక తెలిపింది.
దక్షిణ కశ్మీర్‌లోని అనంత్ నాగ్ జిల్లా బిజ్ బెహరా బ్లాక్‌కు చెందిన ఆదిల్ హుస్సేన్ తోకర్ మంగళవారం జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. పుల్వామా జిల్లా త్రాల్‌కు చెందిన ఆసిఫ్ షేక్ ఈ దాడి కుట్రలో పాలుపంచుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఆదిల్ హుస్సేన్ థోకర్‌ను మోస్ట్ వాంటెడ్‌గా ప్రకటించిన అనంత్ నాగ్ పోలీసులు అతడిని ఆచూకీ చెప్పిన వారికి రూ .20 లక్షల రివార్డును ఇస్తామని వెల్లడించారు. ఇదే కేసులో ఇద్దరు పాక్ జాతీయులను మోస్ట్ వాంటెడ్‌గా అధికారులు ప్రకటించారు.
ఆదిల్ హుస్సేన్ థోకర్ 2018లో పాకిస్థాన్ వెళ్లి అక్కడ ఉగ్రవాద శిక్షణ పొందాడని, ఆ తర్వాత జమ్ముకశ్మీర్‌కు తిరిగి వచ్చాడని తెలుస్తోంది.
సుశిక్షితులైన, కరడుగట్టిన పాక్ ఉగ్రవాదులకు స్థానిక గైడ్‌గా థోకర్ వ్యవహరిస్తున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన వివరాల ఆధారంగా పహల్గామ్ దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదుల స్కెచ్ (ఊహా చిత్రాలు)లను అధికారులు విడుదల చేశారు. వీటిల్లో ఆసిఫ్ షేక్, సులెమాన్ షా, అబు తల్లా ఫొటోలు ఉన్నాయి.
పాకిస్థాన్ ఆధారిత లష్కరే తోయిబాకు చెందిన రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) మంగళవారం దాడి వెనుక ఉందని భావిస్తున్నారు. లష్కరే తోయిబా టాప్ కమాండర్ సైఫుల్లా కసూరి అలియాస్ ఖలీద్.. పహల్గామ్ ఉగ్రదాడికి సూత్రధారి అని కొన్ని నివేదికలు సూచించాయి. ఈ వాదనలపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
మంగళవారం జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో 26మంది టూరిస్ట్‌లు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. ఉగ్రదాడి సమయంలో తీసిన దృశ్యాలు, బాధితుల ఆర్థనాథాలు, దయనీయ కథలు యావత్ ప్రపంచాన్ని కదిలించాయి. ఉగ్రదాడికి కఠినంగా బదులు చెబుతామని భారత్ తేల్చిచెప్పింది. ఈ విషయంలో భారత్‌కు సానుభూతి తెలుపుతూ ప్రపంచ దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link