సారంగపాణి జాతకం రివ్యూ – కోర్ట్ త‌ర్వాత ప్రియ‌ద‌ర్శికి మ‌రో హిట్ ద‌క్కిందా – క్రైమ్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?

Best Web Hosting Provider In India 2024

సారంగపాణి జాతకం రివ్యూ – కోర్ట్ త‌ర్వాత ప్రియ‌ద‌ర్శికి మ‌రో హిట్ ద‌క్కిందా – క్రైమ్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?

Nelki Naresh HT Telugu

ప్రియ‌ద‌ర్శి హీరోగా మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సారంగ‌పాణి జాత‌కం మూవీ ఏప్రిల్ 25న థియేట‌ర్ల‌లో రిలీజైంది. క్రైమ్ కామెడీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించిందా? లేదా? అంటే?

సారంగ‌పాణి జాత‌కం రివ్యూ

కోర్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత ప్రియ‌ద‌ర్శి హీరోగా న‌టించిన మూవీ సారంగ‌పాణి జాత‌కం. క్రైమ్ కామెడీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు మోహ‌నకృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. రూపా కొడ‌వాయూర్ హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీలో వెన్నెల‌కిషోర్‌, వైవా హ‌ర్ష కీల‌క పాత్ర‌లు పోషించారు.ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సారంగ‌పాణి జాత‌కం ఎలా ఉందంటే?

సారంగ‌పాణి మ‌ర్డ‌ర్ క‌ష్టాలు…

సారంగ‌పాణి(ప్రియ‌ద‌ర్శి) ఓ కార్ షోరూమ్‌లో సేల్స్‌మెన్‌గా ప‌నిచేస్తుంటాడు. జాత‌కాల పిచ్చి ఎక్కువ‌. చేతి గీత‌లే త‌న త‌ల‌రాత‌ను నిర్దేశిస్తాయ‌ని న‌మ్ముతుంటాడు. త‌న షోరూమ్‌లోనే మేనేజ‌ర్‌గా ప‌నిచేసే మైథ‌లిని (రూప కొడ‌వాయూర్‌) ఇష్ట‌ప‌డ‌తాడు. మైథిలి కూడా సారంగ‌పాణిని ప్రేమిస్తుంది. పెద్ద‌ల‌ను ఒప్పించి మైథిలితో ఏడ‌డుగులు వేయాల‌ని సారంగ‌పాణి అనుకుంటాడు. ఎంగేజ్‌మెంట్ జ‌రుగుతుంది.

సాఫీగా సాగిపోతున్న సారంగ‌పాణి జీవితం ఆస్ట్రాల‌జ‌ర్ జిగేశ్వ‌నంద్ (శ్రీనివాస్ అవ‌స‌రాల‌) కార‌ణంగా అనుకోని మ‌లుపులు తిరిగుతుంది. సారంగ‌పాణి ఓ మ‌ర్డ‌ర్ చేస్తాడ‌ని అత‌డి చేతి రేఖ‌లు చూసి జాత‌కం చెబుతాడు జిగేశ్వ‌ర‌నంద్‌. హంత‌కుడి భార్య అనే ముద్ర మైథిలిపై ప‌డ‌కూడ‌ద‌ని పెళ్లికి ముందే ఓ హ‌త్య చేయాల‌ని సారంగపాణి ప్లాన్స్ చేస్తాడు.

మ‌ర్డ‌ర్ ప్లాన్‌లో సారంగ‌పాణికి అత‌డి స్నేహితుడు చందు (వెన్నెల‌కిషోర్‌) ఎలా సాయం చేశాడు. అహోటెల్ ఓన‌ర్ అహోబిల‌రావును (త‌నికెళ్ల భ‌ర‌ణి) చంప‌మ‌ని సారంగ‌పాణికి జిగేశ్వ‌ర‌నంద్ ఎందుకు చెప్పాడు? అత‌డి మ‌ర్డ‌ర్ ప్లాన్ స‌క్సెస్ అయ్యిందా? సారంగ‌పాణితో ఎంగేజ్‌మెంట్‌ను మైథిలి ఎందుకు క్యాన్సిల్ చేసుకుంది? జాత‌కాల పిచ్చి కార‌ణంగా సారంగ‌పాణి ఎలాంటి క‌ష్టాల‌ను ఎద‌ర్కొన్నాడు అన్న‌దే సారంగ‌పాణి జాత‌కం మూవీ క‌థ‌.

క్రైమ్ కామెడీ మూవీ…

ద‌ర్శ‌కుడిగా తొలి నుంచి సున్నిత‌మైన భావోద్వేగాల‌తో కూడిన వినోదాత్మ‌క క‌థాంశాల‌తోనే సినిమాలు చేస్తోన్నాడు ద‌ర్శ‌కుడు మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి. సారంగ‌పాణి జాత‌కం కూడా అదే పంథాలో సాగుతుంది. కామెడీకి క్రైమ్ ఎలిమెంట్ జోడించి ఈ మూవీని తెర‌కెక్కించాడు.

జాత‌కాల పిచ్చితో ఓ యువ‌కుడు హ‌త్య చేయాల‌ని అనుకోవ‌డం, ఈ క్ర‌మంలో ఎదుర‌య్యే ప‌రిణామాల‌తో నెక్స్ట్‌ ఏం జ‌రుగుతుందో అనే థ్రిల్‌ను పంచుతూనే క‌డుపుబ్బా న‌వ్విస్తుంది ఈ మూవీ. మూఢ‌న‌మ్మ‌కాల వ‌ల్ల ఎదుర‌య్యే అన‌ర్థాల‌ను ఈ మూవీలో చూపించారు. మెసేజ్‌ను సీరియ‌స్‌గా కాకుండా కామెడీతోనే ఈ పాయింట్‌ను చెప్పిన తీరు ఆక‌ట్టుకుంటుంది.

స్క్రీన్‌ప్లేతో మ్యాజిక్‌…

సారంగ‌పాణి జాత‌కం క‌థ పెద్ద‌దేమి కాదు. లాజిక్ ల‌తో ప‌నిలేకుండా ఆడియెన్స్ బోర్ ఫీల‌వ్వ‌కుండా ఆద్యంతం ఎంట‌ర్‌టైన్ చేసేలా స్క్రీన్‌ప్లేతో మ్యాజిక్ చేశాడు మోహ‌న‌కృష్ణ‌. సారంగ‌పాణి పాత్ర ప‌రిచ‌యం అత‌డి ప్రేమ‌క‌థ‌తో సినిమా స్లోగా మొద‌ల‌వుతుంది.

జిగేశ్వ‌ర‌నంద్‌ జాత‌కం న‌మ్మిన సారంగ‌పాణి హ‌త్య చేయాల‌ని అనుకున్నటి నుంచి సినిమా ఆస‌క్తిక‌రంగా మారుతుంది. చందుతో క‌లిసి సారంగ‌పాణి మ‌ర్డ‌ర్స్ ప్లాన్ చేయ‌డం, వాటికి సంబంధించిన డిస్క‌ష‌న్స్‌, ఆ ప్ర‌య‌త్నాలు బెడిసికొట్టే సీన్స్ నుంచి చ‌క్క‌టి ఫ‌న్ జ‌న‌రేట్ అయ్యింది. ప్రియ‌ద‌ర్శి, వెన్నెల‌కిషోర్ పంచ్ డైలాగ్స్ బాగా పేలాయి.

క‌థ మొత్తం ఒకే చోట‌…

సెకండాఫ్‌లో క‌థ‌ను ఓ హోట‌ల్‌కు షిప్ట్ చేశారు డైరెక్ట‌ర్‌. ఆ హోట‌ల్ నేప‌థ్యంలోనే న‌డిపించారు. అయినా కామెడీ డోసు ఏ మాత్రం త‌గ్గ‌కుండా చూసుకున్నారు సెకండాఫ్‌లో కామెడీ భారాన్ని ప్ర‌య‌ద‌ర్శి, వెన్నెల‌కిషోర్‌తో పాటు వైవా హ‌ర్ష మోశారు.

హీరోయిన్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌తో పాటు మ‌రికొన్ని కామెడీ ట్రాక్స్‌లో హిలేరియ‌స్‌గా ఫ‌న్ వ‌ర్క‌వుట్ అయ్యింది. ఎక్క‌డ అశ్లీల‌త‌, అస‌భ్య‌త లేకుండా స్వ‌చ్ఛ‌మైన తెలుగు, సాయ‌, భాష‌ల‌తో క్లీన్‌గా డైలాగ్స్ రాసుకున్నారు. హెల్తీ కామెడీ ఈ సినిమాకు ప్ల‌స్ పాయింట్‌గా నిలిచింది.

క‌న్వీన్సింగ్ క్లైమాక్స్‌…

సారంగ‌పాణి జాత‌కంలో కోసం ద‌ర్శ‌కుడు ఎంచుకున్న మెయిన్ పాయింట్‌లోనే బ‌లం లేదు. సినిమాను ముగించిన తీరు క‌న్వీన్సింగ్‌గా అనిపించ‌దు. వివేక్ సాగ‌ర్ బీజీఎమ్ బాగున్నా…పాట‌లు అంత‌గా ఆక‌ట్టుకోవు.

కామెడీ టైమింగ్‌…

జాత‌కాల పిచ్చి ఉన్న యువ‌కుడిగా ప్రియ‌ద‌ర్శి త‌న కామెడీ టైమింగ్‌తో న‌వ్వించాడు. కామెడీని పండించే విష‌యంలో ప్రియ‌ద‌ర్శితో వెన్నెల‌కిషోర్‌, వైవా హ‌ర్ష పోటీప‌డ్డారు. ఈ మ‌ధ్య కాలంలో వెన్నెల‌కిషోర్ బాగా న‌వ్వించిన సినిమాల్లో ఒక‌టిగా సారంగ‌పాణి జాత‌కం గుర్తుండిపోతుంది. వైవా హ‌ర్ష ఎక్స్‌ప్రెష‌న్స్‌తోనే వినోదాన్ని పండించిన తీరు బాగుంది.

హీరోయిన్ రూప‌కొడ‌వాయూర్ పాత్ర చిన్న‌దే. ఉన్నంత‌తో చ‌క్క‌గా న‌టించింది. శ్రీనివాస్ అవ‌స‌రాల రోల్ స‌ర్‌ప్రైజింగ్‌గా అనిపిస్తుంది. సీనియ‌ర్ న‌రేష్‌, త‌నికెళ్ల‌భ‌ర‌ణి, రూపాల‌క్ష్మితో పాటు మిగిలిన యాక్ట‌ర్స్ త‌మ ప‌రిధుల మేర న‌వ్వించారు.విజువ‌ల్స్‌, నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

ఫుల్ టైమ్‌పాస్‌…

సారంగ‌పాణి జాత‌కం ఆద్యంతం న‌వ్వుంచే టైమ్‌పాస్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ. కామెడీని ఆశించి థియేట‌ర్ల‌లో ఆడుగుపెట్టే ప్రేక్ష‌కుల‌కు ఏ మాత్రం డిస‌పాయింట్ చేయ‌దు.

రేటింగ్‌: 3.25/5

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024