




Best Web Hosting Provider In India 2024

ఆఫ్ జీబీ జీవితానికి స్వస్తి పలకండి! మీ మెదడు పూర్తి సామర్థ్యం ఏంటో తెలుసుకోండి
మీ మెదడు ఒక శక్తివంతమైన కంప్యూటర్ లాంటిదని మీకు ఎప్పుడైనా అనిపించిందా? దానిలా చాలా మంది తమ మానసిక ‘RAM’ ను పూర్తిస్థాయిలో ఉపయోగించ లేకపోతున్నారంటే మీరు నమ్ముతారా? ‘ఆఫ్ జీబీ పర్సనాలిటీ’ అంటే ఏంటి? దాని తాలూకా లక్షణాలు మీలో ఏమైనా ఉన్నాయా? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం రండి.
మనిషి జీవన వికాసం అంతర్గత, బాహ్య శరీర నిర్మాణం మరియు జీవ మానసిక ప్రక్రియ అనే మూడు ప్రధాన అంశాలపై ఆధారపడి ఉంటుంది. డెవలప్‌మెంట్ సైకాలజీలోని “అభివృద్ధి మరియు వికాసము” అనే సిద్ధాంతం ఈ అంశాన్ని సవివరంగా తెలియజేస్తుంది. ఆధునిక సాంకేతిక రంగంలో అత్యంత ప్రధాన పాత్ర పోషించే పరికరం కంప్యూటర్. మానవ శరీర నిర్మాణంలోని ప్రధాన భాగమైన మెదడు నిర్మాణం మరియు పనితీరు కంప్యూటర్‌తో సారూప్యతను కలిగి ఉంటాయి. మానవ మెదడుకు మరియు ఆధునిక కంప్యూటర్‌కు నిర్మాణంలో, పనితీరులో పోలిక ఉంది. దాని గురించే వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కంప్యూటర్‌లో రాండమ్ యాక్సెస్ మెమరీ (RAM) యొక్క శక్తిసామర్థ్యంపై కంప్యూటర్ పనితీరు పూర్తిగా ఆధారపడి ఉంటుంది. 20 ఏళ్ల క్రితం ఆ సామర్థ్యం కేవలం మెగాబైట్లలో (MB) ఉండేది. దానితోపాటు మరో ముఖ్యమైన నిక్షిప్త సామర్థ్యం హార్డ్ డ్రైవ్ డిస్క్ (HDD) ఉంటుంది. దీనిని మానవ మెదడుతో పోలుస్తుంటాం. HDD కేవలం మెదడులోని జ్ఞాపకశక్తి సామర్థ్యం లాంటిది. కానీ RAM మనస్సు లాంటిది. పూర్తి ప్రక్రియను నడిపించేది RAM యొక్క శక్తిసామర్థ్యం మాత్రమే. ఆఫ్ జీబీ వాడుకలో ఉన్నప్పుడే మొబైల్ లేదా కంప్యూటర్ సామర్థ్యం ఎంతో అభివృద్ధి చెందిందని భావించేవాళ్లం. కానీ ఆ సామర్థ్యం నేడు అవుట్‌డేటెడ్, అంటే కాలం చెల్లిపోయింది. అదే సామర్థ్యం నేడు 8 జీబీ నుండి 32 జీబీ మధ్య నడుస్తుంది.
ఇదిగో వీరే:
నేటి సమాజంలో మానసిక వికాసము, పనితీరు, సామర్థ్యము, స్పందన మరియు ప్రతిస్పందనలను ఆధారంగా కొంతమంది వ్యక్తుల ప్రవర్తనను ఈ పదబంధం ద్వారా వర్గీకరించవచ్చు. వ్యక్తిగత, ఉద్యోగపరమైన సామర్థ్యంలో ఎటువంటి లోపాలు లేనప్పటికీ, సగటు మనిషిగా గౌరవప్రదమైన సామాజిక సంబంధాలు కలిగి ఉన్నప్పటికీ ప్రభావిత మానసిక శక్తి సామర్థ్యాల లోపంతో జీవిస్తుంటారు.
అందులో ముఖ్యమైనవి:
- తమకు అన్నీ తెలుసు అనే మానసిక చట్రంలో ఇరుక్కుపోతూ మానసిక స్తబ్దతకు గురవుతారు (Mental Stagnation), తద్వారా కాలక్రమేణా రిజిడ్ మైండ్‌సెట్ (Rigid Mindset) ఏర్పడిపోతుంది.
- తమను తాము తక్కువగా లేదా ఎక్కువగా అంచనా వేసుకుంటూ అసంకల్పిత మాటతీరును, ప్రవర్తనావళిని ప్రదర్శిస్తుంటారు.
- వయసుకు తగ్గ లేదా ఇతరుల అంచనాకు తగ్గ మానసిక పరిపక్వతను ప్రదర్శించడంలో విఫలమవుతుంటారు.
- సానుకూల వాతావరణంలోనే జీవించగలుగుతారు. అంటే వారి జీవితాలు ‘By Chance but not by choice’. జీవిత సవాళ్లను ఎదుర్కొంటూ జీవించలేరు.
- ఆత్మన్యూనతా భావాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆదిక్యతా భావాన్ని ప్రదర్శిస్తుంటారు.
- సమస్యా పరిష్కార సామర్థ్యాల లోపంతో ఉంటారు.
- అధిక సందర్భాలలో వీరి మనస్సు క్షణికావేశాలతో, భావోద్వేగాలతో, ప్రచోదనలతో మరియు గత జ్ఞాపకాలతో నిండి ఉంటుంది.
- విషయ వికాసమే తప్ప బుద్ధి వికాసం లోపించి ఉంటుంది.
- ఉన్నది ఉన్నట్లు కక్కే ప్రయత్నం చేస్తూ ఉంటారు.
- ఏకదృష్టి కోణంలో జీవిస్తూ ఉంటారు. వైఖరిలో మార్పుకు అవకాశం ఇవ్వరు. సమగ్ర వికాసం కలిగి ఉండరు. కాలానుగుణ మానసిక నవీకరణలో వెనుకబడి ఉంటారు.
- అంతర్గతంగా అన్ని సామర్థ్యాలు ఉండి వికాసంపై విముఖత కలిగి ఉన్న వ్యక్తులను ఆఫ్ జీబీ వ్యక్తులుగా ఏ ఆక్షేపణ లేకుండా పిలుచుకోవచ్చు.
మార్చుకోవడం ఎలా?
- ఇతరుల మాటలు వినడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి పని యొక్క ఫలితాన్ని మరియు పర్యవసానాన్ని గమనిస్తూ గుర్తిస్తూ వ్యవహరించాలి.
- మానసిక శిక్షణా పద్ధతుల ద్వారా భావోద్వేగ సమతుల్యతను అలవర్చుకునే ప్రయత్నం చేయాలి.
- ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ సమస్యా పరిష్కార శక్తిని అభివృద్ధి చేసుకోవాలి.
- సమస్యలు ఎదురయ్యేటప్పుడు సమస్య చరిత్రను ఏకరువు పెట్టకుండా పరిష్కార మార్గాలపై దృష్టి పెట్టాలి. ఆ సమస్య యొక్క మూలం, దాని ప్రభావం మరియు పరిష్కార మార్గం అనే సమగ్ర దృక్పథంతో అన్వేషించగలగాలి.
- సామాజిక పోకడలపై అవగాహన కలిగి ఉంటూ లౌకిక జ్ఞానం అభివృద్ధి చేసుకోవాలి.
- మానసిక శాస్త్ర అవగాహన సదస్సులకు హాజరవుతూ మానసిక ఉత్తీర్ణతను పొందే ప్రయత్నం చేయాలి.
- స్థితిస్థాపకత కలిగి ఉండాలి (Resilience). దీనినే ‘bouncing back’ పద్ధతి అని కూడా అంటారు.
- జ్ఞానంపైనే కాకుండా నైపుణ్యాల సాధనపై దృష్టి పెట్టాలి.
- ప్రతి రోజూ స్వీయ అవగాహన, స్వీయ నియంత్రణ మరియు స్వీయ సమర్పణపై దృష్టి పెట్టాలి.
మానసిక శాస్త్రం, తత్వశాస్త్రం లేదా సామాజిక శాస్త్రం ప్రకారం, మనిషి తన మొదటి సంవత్సరంలో పొందిన అనుభవాన్ని దశాబ్దాల పాటు కొనసాగిస్తూ అనుభవజ్ఞుడిగా భావిస్తూ ఉంటాడు. చివరికి పది లేదా ముప్పై ఏళ్ల అనుభవం తనదని ప్రకటిస్తూ ఉంటారు. ఆ పాతిక లేదా ముప్పై ఏళ్లు ప్రతి క్షణం, ప్రతి దినం, ప్రతి వారం, ప్రతి సంవత్సరం మానసిక ఉన్నతి పొందిన నాడు మనిషి మెదడుకు ఏ కంప్యూటర్లు సాటి రావు. లేదంటే, మనిషి జీవితం ఆఫ్ జీబీకే పరిమితం అవుతుంది.