



Best Web Hosting Provider In India 2024
‘‘ఇంత బాధ్యతారాహిత్యమా?’’ – రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు ఆగ్రహం
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వాతంత్య్ర సమర యోధులపై అనుచిత వ్యాఖ్యలను సహించబోమని స్పష్టం చేసింది. సావర్కర్ పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని మండిపడింది.
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర సమరయోధులపై బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు హితవు పలికింది. స్వాతంత్య్ర సమరయోధుడు సావర్కర్ ను బ్రిటీష్ వారి సేవకుడిగా పేర్కొంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బాధ్యతారాహిత్య వ్యాఖ్యలని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే, ఆ వ్యాఖ్యలపై లక్నో కోర్టు రాహుల్ గాంధీకి జారీ చేసిన సమన్లపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు సుముఖత వ్యక్తం చేసింది.
భారత్ జోడో యాత్రలో
2022 నవంబర్ లో భారత్ జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్వాతంత్య్ర సమరయోధుడు సావర్కర్ పై చేసిన వ్యాఖ్యలపై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్ తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ, ‘‘ఎలాంటి చరిత్ర, భౌగోళిక పరిస్థితులు తెలుసుకోకుండా స్వాతంత్య్ర సమరయోధులపై ఆయన ఎలాంటి అనుచిత ప్రకటనలు చేయకూడదు’’ అని వ్యాఖ్యానించింది. మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో జరిగిన ర్యాలీలో తాను సావర్కర్ పై చేసిన వ్యాఖ్యలపై గత ఏడాది డిసెంబర్ లో ట్రయల్ కోర్టు తనకు జారీ చేసిన సమన్లను కొట్టివేయడానికి నిరాకరిస్తూ అలహాబాద్ హైకోర్టు ఏప్రిల్ 4న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాహుల్ దాఖలు చేసిన పిటిషన్ ను శుక్రవారం సుప్రీం కోర్టు విచారించింది.
సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించడానికి న్యాయపరమైన అంశాలను రాహుల్ గాంధీ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వివరించారు. ఈ సందర్భంగా, ‘‘మీ క్లయింట్ (రాహుల్ గాంధీ) నానమ్మ ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఈ పెద్దమనిషిని (సావర్కర్) ప్రశంసిస్తూ లేఖ రాసిన విషయం మీ క్లయింట్ కు తెలుసా? మహాత్మాగాంధీ కూడా వైస్రాయ్ ను ఉద్దేశించి ‘మీ నమ్మకమైన సేవకుడు’ అని లేఖ చివరలో పేర్కొన్న విషయం ఆయనకు తెలుసా?’’ అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link