



Best Web Hosting Provider In India 2024
‘‘అవును.. ఉగ్రవాదానికి సపోర్ట్ చేశాం..’’ – ఒప్పుకున్న పాక్ రక్షణ మంత్రి
ఉగ్రవాద సంస్థలకు అన్ని రకాలుగా మద్ధతు ఇస్తున్నట్లు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అంగీకరించారు. స్కై న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో గత మూడు దశాబ్దాలుగా పాకిస్తాన్ ఉగ్ర వాద సంస్థలకు ఆర్థికంగా మద్ధతు ఇస్తోందని, శిక్షణ ఇస్తోందని అంగీకరించారు.
26 మందిని పొట్టనబెట్టుకున్న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన చర్యలు భారత్, పాక్ ల మధ్య పూర్తి స్థాయి యుద్ధానికి దారితీస్తాయని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో హెచ్చరించారు. అణ్వాయుధాలు కలిగి ఉన్న రెండు దేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరిగే అవకాశం ఉందని, ఈ విషయంపై ప్రపంచం ఆందోళన చెందాలని ఖవాజా ఆసిఫ్ స్కై న్యూస్ తో అన్నారు.
అవును.. ఉగ్రవాదానికి సపోర్ట్ చేశాం..
ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వడం, ఆర్థికంగా సపోర్ట్ చేయడం, వారికి శిక్షణ ఇవ్వడం, నిధులు సమకూర్చడంలో పాకిస్తాన్ కు సుదీర్ఘ చరిత్ర ఉందని మీరు అంగీకరిస్తారా అని స్కై న్యూస్ జర్నలిస్ట్ యాల్దా హకీమ్ అడిగిన ప్రశ్నకు ఖవాజా ఆసిఫ్ స్పష్టమైన సమాధానమిచ్చారు. “మేము సుమారు 3 దశాబ్దాలుగా అమెరికా కోసం ఈ నీచమైన పని చేస్తున్నాము… బ్రిటన్ సహా పశ్చిమ దేశాలు కూడా ఇందులో ఉన్నాయి.. అది పొరపాటు. దాని కోసం మేము బాధ పడ్డాం, అందుకే మీరు నాతో ఇలా మాట్లాడుతున్నారు. సోవియట్ యూనియన్ పై యుద్ధంలో, ఆ తర్వాత 9/11 తర్వాత జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ చేరకపోయి ఉంటే పాకిస్తాన్ ట్రాక్ రికార్డ్ వేరేలా ఉండేది’’ అని ఆసిఫ్ వ్యాఖ్యానించారు.
అన్నిరకాలుగా సిద్ధం
భారత్ తో దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు పాక్ సైన్యం సిద్ధంగా ఉందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. ‘భారత్ ఏం చర్య చేపట్టినా మా ప్రతిస్పందనతో మేం సిద్ధంగా ఉంటా. భారత్ చర్యలకు సరైన ప్రతిచర్య ఉంటుంది.. ఆల్ అవుట్ ఎటాక్ లేదా మరేదైనా జరిగితే కచ్చితంగా యుద్ధం తప్పదు’ అని వ్యాఖ్యానించారు. ఒకవేళ పరిస్థితులు విషమిస్తే, ఈ ఘర్షణలో విషాదకరమైన పరిణామం చోటుచేసుకునే అవకాశం ఉందని ఆసిఫ్ వ్యాఖ్యానించినట్లు స్కై న్యూస్ పేర్కొంది.
చర్చల ద్వారా పరిష్కారం..
అయితే చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచం ఆందోళన చెందాలా అని అడిగినప్పుడు, మంత్రి బదులిచ్చారు, “అవును, నేను అలా అనుకుంటున్నాను. రెండు అణ్వస్త్ర శక్తుల మధ్య ఘర్షణ ఎల్లప్పుడూ ఆందోళన కలిగిస్తుంది…” అన్నారు.
భారత్ కఠిన నిర్ణయాలు
పహల్గామ్ లో 26 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం అట్టారీలోని ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టును మూసివేయడం, పాక్ పౌరులకు సార్క్ వీసా మినహాయింపు పథకాన్ని నిలిపివేయడం, వారు తమ దేశానికి తిరిగి రావడానికి 48 గంటల సమయం ఇవ్వడం, ఇరువైపులా ఉన్న హైకమిషన్లలో అధికారుల సంఖ్యను తగ్గించడం వంటి పలు దౌత్య చర్యలను ప్రకటించింది. పహల్గామ్ దాడి నేపథ్యంలో 1960లో కుదుర్చుకున్న సింధు జలాల ఒప్పందాన్ని కూడా భారత్ నిలిపివేసింది.
మోదీ ప్రతిన
ఈ దాడికి కారకులైన ఉగ్రవాదులతో పాటు కుట్ర పన్నిన వారికి కూడా ఊహకు అందని శిక్ష పడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు. ఉగ్రవాద స్థావరాలను నిర్మూలించాల్సిన సమయం ఆసన్నమైందని, 140 కోట్ల మంది భారతీయుల సంకల్పబలం ఇప్పుడు ఉగ్రవాదానికి పాల్పడిన వారి వెన్నెముకను విచ్ఛిన్నం చేస్తుందని మోదీ ఉద్ఘాటించారు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link