



Best Web Hosting Provider In India 2024
పాకిస్తాన్ దళాల అదుపులో బీఎస్ఎఫ్ జవాను; క్షేమంగా తీసుకురావడానికి ప్రయత్నాలు
పొరపాటున పాక్ భూభాగంలోకి ప్రవేశించిన బీఎస్ఎఫ్ జవానును ఆ దేశ భద్రతాదళాలు అదుపులోకి తీసుకున్నాయి. అతడిని సురక్షితంగా, త్వరగా తిరిగి తీసుకువచ్చే ప్రయత్నాలు భారత ప్రభుత్వం చేస్తోంది. భారత జవాను ను తిరిగి అప్పగించాలని కోరుతూ భారత్ రాసిన లేఖకు ఇంకా స్పందన రాలేదు.
ఫిరోజ్ పూర్ సెక్టార్ లో అనుకోకుండా, పొరపాటున జీరో లైన్ దాటినందుకు సరిహద్దు భద్రతా దళం కానిస్టేబుల్ పూర్ణబ్ కుమార్ షాను పాకిస్తాన్ రేంజర్ లు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. పహల్గామ్ లో 26 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రదాడికి సంబంధించి పాకిస్థాన్ పై భారత్ దౌత్యపరమైన కఠిన చర్యలకు దిగిన రోజే ఈ ఘటన జరిగింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ తో అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
పొరపాటున పాక్ భూభాగంలోకి..
‘‘బీఎస్ఎఫ్ జవాను పొరపాటున పాక్ భూభాగంలోకి ప్రవేశించడంతో అతడిని పాక్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. అతడిని సురక్షితంగా, త్వరగా తిరిగి వచ్చేలా అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి” అని బిఎస్ఎఫ్ పంజాబ్ ఫ్రాంటియర్ ఇన్స్పెక్టర్ జనరల్ అతుల్ ఫుల్జెలే తెలిపారు. బుధవారం సాయంత్రం, గురువారం మధ్యాహ్నం సమయాల్లో రెండు దళాల మధ్య జరిగిన రెండు ఫ్లాగ్ మీటింగ్ లు అసంపూర్తిగా ముగిశాయి. 24వ బెటాలియన్ కు చెందిన, పశ్చిమబెంగాల్ వాసి అయిన పూర్ణబ్ కుమార్ షా ప్రస్తుతం పాక్ రేంజర్స్ కస్టడీలో ఉన్నాడు.
రైతులకు కాపలా కాస్తూ..
మమ్ దోత్ బ్లాక్ లోని కోబ్రా ఫెన్సింగ్ సమీపంలో గోధుమలు కోస్తున్న స్థానిక రైతుల బృందానికి పూర్ణబ్ కుమార్ షా కాపలా కాస్తూ, పొరపాటను సరిహద్దు దాటాడు. అతన్ని అదుపులోకి తీసుకున్నప్పుడు షా యూనిఫాంలో ఉన్నాడని, తనతో పాటు జీ 2 సర్వీస్ రైఫిల్, మూడు మ్యాగజైన్లు, 60 రౌండ్లు కలిగి ఉన్నాడని అధికారులు తెలిపారు. 2025 ఏప్రిల్ 10 నుంచి షా సరిహద్దు ప్రాంతంలో తాత్కాలిక బృందంలో విధులు నిర్వర్తించారు. షాకు ఇటీవల, మొదటిసారి అక్కడ పోస్టింగ్ ఇచ్చినందున ఆ ప్రాంతం భౌగోళిక స్వరూపంపై పూర్తి అవగాహన లేదని సీనియర్ అధికారులు తెలిపారు.
కుటుంబం ఆందోళన
తన భర్త క్షేమంగా తిరిగి వచ్చేలా చూడాలని ఆయన భార్య రజనీ పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి, కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. తన భర్తను పాక్ సైనికులు నిర్బంధించారని, ఆయనను స్వదేశానికి రప్పించేందుకు ఫ్లాగ్ మీటింగులు జరుగుతున్నాయని తన భర్త సహోద్యోగి ద్వారా తెలిసిందన్నారు. వీలైనంత త్వరగా నా భర్త క్షేమంగా ఇంటికి వచ్చేలా చూడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆమె విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటనలు గతంలో జరిగాయని, సాధారణంగా ఫ్లాగ్ మీటింగ్ లు, పరస్పర అవగాహన ద్వారా పరిష్కరించుకునేవారని భద్రతా అధికారులు తెలిపారు.
సరిహద్దుల్లో సాధారణమే
సాధారణంగా కంటికి కనిపించని సరిహద్దుకు 150 మీటర్ల దూరంలో ఉన్న కంచెకు సమీపంలో సరిహద్దు గ్రామాల వాసులకు చెందిన వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి. నిర్దిష్ట సమయాల్లో పొలం పనుల కోసం పొలాలను తెరుస్తారు. ఆ సమయంలో బీఎస్ఎఫ్ జవాన్లు రైతుల వెంట ఉంటారు. అలాంటి సమయంలో జవాను అనుకోకుండా సరిహద్దు దాటడంతో పాక్ రేంజర్లు బీఎస్ఎఫ్ జవానును పట్టుకున్నారు’ అని ఈ విషయం తెలిసిన ఓ అధికారి తెలిపారు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link