Best Web Hosting Provider In India 2024
CM Jagan On Andhra Pradesh Elections 2024: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వచ్చినట్లు ఏపీలో కూడా నోటిఫికేషన్ ముందుగానే వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఏపీ కేబినెట్ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఈ కామెంట్స్ చేశారు. నోటిఫికేషన్ ముందుగానే వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో… ఎన్నికలకు పూర్తి సన్నద్ధంగా ఉండాలన్నారు.
ట్రెండింగ్ వార్తలు
అన్ని కార్యక్రమాలు ఫిబ్రవరి మొదటి వారంలో పూర్తి కావాలని అన్నారు ముఖ్యమంత్రి జగన్. ఎన్నికలకు పూర్తి సన్నద్ధంగా ఉన్నామని… అయినప్పటికీ మంత్రులు క్షేత్ర స్థాయిలో మరింత సమర్థవంతంగా పని చేయాలని దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది.
మరోవైపు ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. మరో వారం పదిరోజుల్లో నియోజక వర్గాలకు బాధ్యులను ప్రకటించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ సిద్ధమవుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దాదాపు 40-50మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థాన చలనమో లేకుంటే అసలు టిక్కెట్ దక్కక పోవచ్చని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2019 ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 151 మంది ఎమ్మెల్యేలను గెలిచిన వైఎస్సార్సీపీ 2024ఎన్నికల్లో వై నాట్ 175 లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతిపక్షమే లేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని జగన్ భావిస్తున్నా, క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితుల్ని పూర్తిగా బేరీజు వేసుకుంటున్నారు. ఇప్పటికే అభ్యర్థుల పనితీరు, ఆరోపణలు, మళ్లీ టిక్కెట్ ఇస్తే గెలిచే పరిస్థితి ఉందా లేదా అనే అంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఇందులో భాగంగా… ఇప్పటికే పలు నియోజకవర్గ ఇంఛార్జులను కూడా మార్చేశారు. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు అన్ని జిల్లాల్లో దాదాపు 50మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈ సారి పోటీ చేసే అవకాశం లభించకపోవచ్చని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
గెలిచే అవకాశాలు లేని వారితో మొహమాటానికి పోయి తెలంగాణ మాదిరి ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆలోచన వైసీపీ అధినేతలో ఉంది. ప్రస్తుత క్యాబినెట్‌లో ఉన్న ఇద్దరు మంత్రులను వారి జిల్లా నుంచి పొరుగు జిల్లాలో పోటీ చేయించే అవకాశాలున్నాయి. తిరుపతి జిల్లా నుంచి లోక్‌సభకు ప్రతినిధ్యం వహిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యేల స్థానాలు తారుమారు కానున్నాయి. ఎంపీ గురుమూర్తిని అసెంబ్లీకి, మంత్రి నారాయణ స్వామిని పార్లమెంటుకు పోటీ చేయించే ఆలోచన ఉన్నట్టు సమాచారం. వేర్వేరు బృందాల నుంచి సేకరించిన సమాచారం ఆధారం ఏ మాత్రం గెలిచే అవకాశం లేని అభ్యర్థులను పూర్తిగా పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నారు. 2024ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వస్తే వారి గౌరవానికి భంగం కలగకుండా అవకాశాలు, పదవులు కల్పిస్తామని బుజ్జగించనున్నారు. బెట్టు చేసే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని భావిస్తున్న వైసీపీ అందుకు అనుగుణంగా ప్రణాళికను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పలువురు మంత్రులు, మాజీ మంత్రులు సైతం అభ్యర్థుల జాబితా నుంచి మాయమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.
సంబంధిత కథనం