Best Web Hosting Provider In India 2024
Janasena PawanKalyan: ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో పార్టీ నాయకులతో సమీక్షలు ప్రారంభించారు. పార్టీకి ప్రజల్లో ఉన్న అభిమానాన్ని వచ్చే ఎన్నికల్లో ఓట్ల రూపంలో మార్చేలా వ్యూహాలు రచించాలని దిశానిర్దేశం చేస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు
పార్టీ కోసం పని చేసేవారినీ, పార్టీ అంటే ఇష్టవారినీ పోలింగ్ బూత్ వరకూ తీసుకువెళ్లే బాధ్యత నాయకులు తీసుకోవాలని చెప్పారు. 2019 ఎన్నికల్లో ఉదారతతో కొంతమందికి పార్టీ టిక్కెట్లు ఇచ్చామని, అయితే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తుతో ఎన్నికలకు వెళ్తున్న తరుణంలో ప్రతి సీటు ముఖ్యమేనని నాయకులకు స్పష్టం చేశారు.
టీడీపీతో పొత్తులు దృష్టిలో పెట్టుకొని బలంగా ఎలక్షనీరింగ్ చేయాలని చెప్పారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ చాలామంది ఉదాసీనంగా వ్యవహరించారని, ఈసారి అలాంటి పొరపాట్లకు తావు ఇవ్వవద్దన్నారు. టిక్కెట్ ఆశపడే అభ్యర్థులు వ్యక్తిగతంగా 10 నుంచి 15 వేల ఓట్లు తెచ్చుకోవల్సి ఉంటుందని, అలాంటి వారికే ప్రాధాన్యం ఉంటుందని స్పష్టంగా తెలిపారు.
జీరో బడ్జెట్ పాలిటిక్స్ సాధ్యం కాదు…
జీరో బడ్జెట్ పాలిటిక్స్ తాను అన్నట్లు ప్రచారం చేస్తున్నారని అది వాస్తవం కాదని పవన్ తెలిపారు. ఎలక్షన్ కమిషన్ అధికారికంగా రూ.40 లక్షలు ఖర్చు చేసుకోవచ్చని చెబుతుంటే, నేను జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేయాలని ఎలా చెబుతానానని నాయకుల వద్ద ప్రశ్నించారు. సభలకు వచ్చిన జనం.. పోలింగ్ బూత్ దగ్గర కనిపించాలనీ.. దీనికోసం ప్రతి నాయకుడు, కార్యకర్త సన్నద్ధమై పని చేయాలని దిశా నిర్దేశం చేశారు.
రాబోయే ఎన్నికల్లో ప్రతి సీటు కీలకమే.. అందువల్ల ప్రతి స్థానాన్ని గెలవడానికి పూర్తి స్థాయిలో ప్రణాళిక సిద్ధం చేస్తున్నామనీ, నియోజకవర్గ స్థాయిలోనూ ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో వైసీపీని ఢీ కొడుతున్నామనీ చెబుతూ, తెలుగుదేశం పార్టీతో సయోధ్యతో ప్రయాణం చేసేవారికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఎన్నికల్లో ఎలాంటి ప్రచార విధానాలు అవలంబించాలి… ఎక్కడ సభలను నిర్వహించాలనే ఇతర అంశాలను నాయకులతో చర్చించారు.
జనసేన – టీడీపీ ప్రభుత్వం దశాబ్దం పాటు కొనసాగాలి
2024లో జనసేన- తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తప్పకుండా వస్తుందని, పదేళ్లపాటు అధికారంలో నిలిచి అద్భుతమైన ఆంధ్రాను తీర్చిదిద్దే బాధ్యత తాము తీసుకుంటామని పవన్ కళ్యాణ్ చెప్పారు.
“దశాబ్ద కాలంగా వైసీపీ గూండా నాయకులను బలంగా ఎదుర్కోగలుగు తున్నామంటే యువత, మహిళలే మన ప్రధాన బలమన్నారు. వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ దిక్కు లేకుండా అయిపోయిందని రాష్ట్రాన్ని వైసీపీ పాలకులు కుక్కలు చింపిన విస్తరి చేశారన్నారు. మళ్లీ ఆంధ్రప్రదేశ్ కు పునరుజ్జీవం తీసుకురావాలని రాష్ట్రాన్ని గాడిలోపెట్టాలన్నారు.
రాబోతున్న జనసేన – తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అధికారులు ప్రజల కష్టాలు తీర్చడానికి, కన్నీళ్లు తుడవడానికి పని చేస్తారని, సినిమా టికెట్ల కోసం తహశీల్దార్ నుంచి సీఎస్ వరకు పని చేసే రోజులు పోతాయన్నారు. ఈ ఎన్నికల్లో మనస్ఫూర్తిగా జనసేన పార్టీను బలంగా నమ్మండి. అందరికీ అవకాశం ఇచ్చారు. ప్రజల కోసం అధికారంలో లేకపోయినా పనిచేసిన జనసేన పార్టీకి ఈసారి అవకాశం ఇచ్చి చూడండి. ప్రజలు మెచ్చేలా పరిపాలన అందించి రాష్ట్రం బాధ్యతను నేను తీసుకుంటానని పవన్ చెప్పారు.
• బీజేపీకి మద్దతు ఇచ్చానని భయపడొద్దు
చాలా మంది ముస్లింలు నన్ను పూర్తి స్థాయిలో నమ్మినప్పటికీ నేను బీజేపీతో కలిశాననే కారణంతో ముందుకు రావడానికి సంశయిస్తున్నారని పవన్ అన్నారు. రాష్ట్ర విభజన తరువాత బీజేపీకి మద్దతుగా నిలబడ్డామని ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉంటే ఏదో ఒక జాతీయ పార్టీతో ఉండక తప్పదన్నారు. నేను బీజేపీతో ఉన్నా సరే ముస్లింలకు ఏ విషయంలో అన్యాయం జరిగినా నేను మీ పక్షం తీసుకుంటానని చెప్పారు.
ముస్లింల వైపు మాత్రమే పవన్ కళ్యాణ్ ఉంటాడు అని గుర్తుపెట్టుకోవాలన్నారు. అదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ మతాల పొరపొచ్చాలు లేవని సామరస్యంగా అన్నదమ్ముల మాదిరిగానే కలసిమెలసి ఉంటామని రాష్ట్ర ప్రయోజనాలు, మన ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చి ముందుకు వెళ్దామన్నారు.
జనసేన పార్టీ ప్రచార విభాగం ఛైర్మన్ గా బన్నీవాస్..
జనసేన పార్టీ ప్రచార విభాగం ఛైర్మన్ గా బన్నీ వాస్ ను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియమించారు. గురువారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నియామక ఉత్తర్వులను పవన్ కళ్యాణ్ అందజేశారు. ప్రచార విభాగం పార్టీకి కీలకమైందని, సమన్వయంతో ప్రచార విభాగాన్ని ముందుకు నడిపించాలని ఈ సందర్భంగా సూచించారు. పార్టీ ఆశయాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంతోపాటు రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపునకు వినూత్న కార్యక్రమాలను రూపొందించాలని చెప్పారు.