Best Web Hosting Provider In India 2024
Janasena On CM Jagan : తెలంగాణలో జనసేన అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు రాలేదని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా పవన్ పార్టీకి రాలేదని సెటైర్లు వేశారు. సీఎం జగన్ వ్యాఖ్యలకు జనసేన ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చింది. కొల్లాపూర్ లో సామాన్యురాలు బర్రెలక్క స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ఓట్లు 5754 (2.99%) కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చేసిన వైఎస్ఆర్ మరణం అనంతరం సింపతీపై నిర్మించబడిన వైసీపీ తరపున 2014 ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థికి కొల్లాపూర్ నియోజకవర్గంలో వచ్చిన ఓట్లు 1240 (0.81%) అని తెలిపారు. పక్క రాష్ట్రంలో పక్క పార్టీకి వచ్చిన ఫలితాలపై కాకుండా ఉన్న 90 రోజులైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పనికొచ్చే పనులకి సమయాన్ని వెచ్చించాలని వైసీపీకి హితవు పలికింది.
ట్రెండింగ్ వార్తలు
తెలంగాణలో పోటీ చేసే దమ్ము లేదు
దీంతో పాటు జనసేన మరో ట్వీట్ చేసింది. సెల్ఫ్ గోల్ వేసుకోడంలో సీఎం జగన్ ను మించిన వాళ్లు లేరంటూ తెలిపింది. 2014 తెలంగాణ ఎన్నికల్లో వైసీపీ పార్టీకి వచ్చిన ఓట్లు, తెలంగాణ ప్రజలు రాళ్లతో కొట్టిన తీరు మర్చిపోయారా? ఇండిపెండెంట్ గా నిలబడి పోటీ చేసే దమ్ము బర్రెలక్కకైనా ఉంది కానీ, తెలంగాణలో పోటీ చేసే దమ్ము వైసీపీకి లేదని విమర్శలు చేసింది.
పవన్ పై సీఎం జగన్ సెటైర్లు
తెలంగాణ ఎన్నికల్లో దత్తపుత్రుడు పవన్ కు డిపాజిట్లు కూడా రాలేదని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. కొల్లాపూర్ లో ఇండిపెండెంట్ గా నిలిచిన బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా జనసేన అభ్యర్థులకు రాలేదని సెటైర్లు వేశారు. చంద్రబాబు ఎన్నికలు వచ్చే సరికి ఎత్తులు, పొత్తులు, చిత్తులు నాటకాలు ఆడతారన్నారు. తెలంగాణలో నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్, చంద్రబాబు, బీజేపీ కలిసిపోటీ చేశారన్నారు. ఏపీలో మాట్లాడుతూ తెలంగాణ పాలకులకు చుక్కలు చూపిస్తానని డైలాగులు కొడతారని, తెలంగాణలో ఏపీ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడతారని విమర్శించారు. ఉత్తరాంధ్రకు చంద్రబాబు, పవన్ ద్రోహం చేశారన్నారు. ఉత్తరాంధ్రలోని విశాఖను రాజధానిగా చేస్తామంటే చంద్రబాబు, పవన్ అడ్డుకుంటున్నారన్నారు. నాన్ లోకల్స్ అయిన చంద్రబాబు, పవన్ పక్క రాష్ట్రంలో ఉంటూ ఏపీలో ఏం చేయాల్లో నిర్ణయిస్తామంటారంటూ సీఎం జగన్ మండిపడ్డారు.