Best Web Hosting Provider In India 2024
Telangana Assembly Session 2023: పాతబస్తీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పారు ఎంఐఎం అక్బరుద్దీన్ ఓవైసీ. గవర్నర్ ప్రసంగంపై మాట్లాడిన అక్బరుద్దీన్… సభలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా గెలిపించుకోలేకపోయాయని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చిందని.. కానీ ఎన్ని నెరవేర్చారు అనేది ముఖ్యమని అన్నారు. కాంగ్రెస్ కు తాము దగ్గర ఉన్నామంటే.. అందుకు కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రమే అని స్పష్టం చేశారు. ముస్లింల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు.
ట్రెండింగ్ వార్తలు
గత ప్రభుత్వం ఉర్దూకు తగిన ప్రాధాన్యత ఇచ్చిందని, అందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్తున్నామన్నారు అక్బరుద్దీన్. కానీ…. ప్రస్తుత ప్రభుత్వంలో ఉర్దూకు ప్రాధాన్యత తగ్గిందన్నారు. మేనిఫెస్టోలో ఆ అంశాన్ని కూడా కాంగ్రెస్ ప్రస్తావించలేదన్నారు. ఉర్దూకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లను ఎన్నికల ప్రచారంలో పదే పదే కాంగ్రెస్ గుర్తుచేసిందని, కానీ మేనిఫెస్టోలో మాత్రం పెట్టలేదన్నారు. ఇమామ్ లకు రూ.12వేలు కాదని.. రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
డీఎస్సీ మాత్రమే కాదని… ఇతర పరీక్షలు కూడా ఉర్దూలో నిర్వహించాలని కోరారు ఓవైసీ. ఆర్టీసీ పరిస్థితిపై పూర్తి వివరాలు ఇవ్వాలని కోరారు. ఉచిత ప్రయాణాన్ని స్వాగతిస్తున్నామని.. ఇదే సమయంలో ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు. రైతుభరోసా, గృహజ్యోతి, ఉచిత కరెంట్ వంటి అంశాలపై స్పష్టమైన విధివిధానాలను ప్రకటించాలని కోరారు. ఆరోగ్య శ్రీ పథకానికి సంబంధించి జోవోను కూడా ఇవ్వలేదని ప్రస్తావించారు.
కాంగ్రెస్ – ఎంఐఎం మధ్య పొత్తు ఉంటుందని ఇటీవలే కొన్ని పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయని.. అలాంటి అవకాశం లేదన్నారు ఓవైసీ. తాము నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం మంచి చేస్తే ప్రశంసిస్తామని… అలా చేయకపోతే తప్పకుండా విమర్శిస్తామన్నారు. గత ప్రభుత్వంలో కూడా తాము అలాగే వ్యవహరించామన్నారు. సభలో పలు అంశాలను ప్రస్తావించిన ఓవైసీ… పలుమార్లు బీఆర్ఎస్ ను కూడా ఇరుకునపెట్టేలా మాట్లాడటం ఆసక్తికరంగా మారింది.