Best Web Hosting Provider In India 2024
Running vs Skipping: గంటలు గంటలు కదలకుండా ఉద్యోగాలు చేసేవారు త్వరగా రోగాల బారిన పడతారు. కాబట్టి ప్రతిరోజూ రన్నింగ్, స్కిప్పింగ్, జాగింగ్ వంటివి తప్పకుండా చేయాలి. ఎక్కువమంది చేసేవి రన్నింగ్, స్కిప్పింగ్. ఈ రెండిట్లో ఏది చేయడం వల్ల త్వరగా బరువు తగ్గుతారో వివరిస్తున్నారు ఫిట్నెస్ నిపుణులు. నిజానికి రన్నింగ్, స్కిప్పింగ్… ఈ రెండూ కూడా శరీరానికి మంచివే. ఊబకాయంతో పాటు అనేక వ్యాధుల బారిన పడకుండా ఇవి కాపాడతాయి. చెమట పట్టేలా రన్నింగ్ చేయడం లేదా స్కిప్పింగ్ చేయడం ఎంతో మంచిదని వైద్యులు కూడా చెబుతున్నారు. ప్రపంచంలో ఎంతోమంది ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ సమస్య బారిన పడకముందే వ్యాయామాలను చేయాలి. అలాగే అధిక కేలరీలు ఉండే ఆహారాన్ని తినడం తగ్గించాలి. రన్నింగ్, స్కిప్పింగ్… ఈ రెండూ కూడా మంచివే. కానీ ఈ రెండింట్లో చిన్న తేడా ఉంది.
ట్రెండింగ్ వార్తలు
రన్నింగ్ vs స్కిప్పింగ్
రన్నింగ్, స్కిప్పింగ్… ఈ రెండూ కూడా కండరాలతో చేసే వ్యాయామాలే. ఈ రెండింటిలోనూ శరీర కదలిక ఎక్కువగానే ఉంటుంది. క్యాలరీల ఖర్చు కూడా ఎక్కువే. అయితే రన్నింగ్‌తో పోలిస్తే స్కిప్పింగ్ చేయడమే కాస్త కష్టం. శరీరానికి అధిక శ్రమ అవసరం. స్కిప్పింగ్ 10 నిమిషాలు చేస్తే ఖర్చయ్యే క్యాలరీల సంఖ్య, పది నిమిషాలు రన్నింగ్ చేస్తే ఖర్చయ్యే క్యాలరీల కన్నా ఎక్కువ. కాబట్టి రన్నింగ్, స్కిప్పింగ్… ఈ రెండిట్లో స్కిప్పింగ్ ద్వారా త్వరగా బరువు తగ్గొచ్చు అని అంటున్నారు ఫిట్నెస్ నిపుణులు.
త్వరగా కొవ్వును కరిగించాలనుకునే వారు రన్నింగ్ కంటే స్కిప్పింగ్ ఎంచుకోవడమే మంచిది. రోజూ పది నిమిషాలు నుంచి అరగంట సేపు స్కిప్పింగ్ చేస్తే ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవుతాయి. వీపు భాగంలోని కండరాలు బలంగా మారుతాయి. శరీరం స్టామినా పెరుగుతుంది.
గుండె కండరాలకు మేలు చేసేది రన్నింగ్. దీనివల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రన్నింగ్ చేస్తున్న సమయంలో మూడ్‌ని సంతోషంగా మార్చే ఎండార్పిన్, సెరటోనిన్ హార్మోన్లు విడుదలవుతాయి. దీనివల్ల మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. శరీరం తేలికవుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఊపిరితిత్తుల్లో ఉండిపోయిన కార్బన్ డయాక్సైడ్ కూడా బయటికి పోతుంది. ఊపిరితిత్తుల సమస్యలు తగ్గుతాయి.
రన్నింగ్ చేయడం వల్ల డిప్రెషన్ వంటి మానసిక వ్యాధులు కూడా దూరం అవుతాయి. ఊపిరితిత్తుల్లో కఫం పట్టడం తగ్గుతుంది. శ్వాస కోశ కండరాలను ఇది బలంగా మారుస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. గుండెకు రక్తప్రసరణను మెరుగుపడేలా చేస్తుంది. అలాగే హై బీపీ బారిన పడకుండా కాపాడుతుంది. కాబట్టి రన్నింగ్, స్కిప్పింగ్ రెండూ కూడా ఆరోగ్యానికి మంచిదే. స్కిప్పింగ్ వల్ల త్వరగా బరువు తగ్గుతారు. రన్నింగ్ మానసికంగా, శారీరకంగా కూడా మేలు చేస్తుంది. ఈ రెండిట్లో ఏది చేయాలో మీ అవసరాన్ని మీరే నిర్ణయించుకోవాలి.
టాపిక్