Best Web Hosting Provider In India 2024
BRS Ex MLA Jeevan Reddy: `నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కంచుకోట. జిల్లాలో మా పార్టే బలమైన పార్టీ. ఎన్నిక ఏదైనా గెలుపు కారు పక్షమే` ఇదంతా మొన్నటి వరకు ముచ్చట. ఒక్క అసెంబ్లీ ఎన్నికల ఓటమితో పార్టీ కుదేలయ్యింది. దీనికితోడు అధికారం అడ్డుపెట్టుకుని ఆర్మూరు ఎమ్మెల్యే, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు చేసిన అవినీతి, అక్రమాలు డొంక కదులుతుండటంతో ఏం చేయాలో బీఆర్ఎస్ శ్రేణులకు మింగుడు పడటం లేదు. అధికారంలో ఉన్న సమయంలో ఏనాడూ పార్టీ నిర్మాణంపై దృష్టి సారించలేదు. జిల్లా అధ్యక్షుడిగా జీవన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువా ఏనాడూ ఓ సమావేశం నిర్వహించిన దాఖలాలు లేవు. పైగా `నేనంటే నేనే గొప్ప` అనే ఫీలింగ్‌తో ఏ అంశంపై కూడా ఎమ్మెల్యేలు కలిసి రాలేదు. చివరకు జిల్లా మంత్రిగా ఉండే ప్రశాంత్‌రెడ్డి సైతం.. ప్రభుత్వం ప్రవేశపెట్టే ఏ సంక్షేమ పథకమైనా జిల్లా కేంద్రంలో కాకుండా తన నియోజకవర్గం బాల్కొండలోనే ప్రారంభించేవారు. మిగితా ఎమ్మెల్యేల సహకారం లేకపోవడంతో ఏమీ చేయలేకపోయారు.
ట్రెండింగ్ వార్తలు
ఓటమిపై సమీక్ష ఏది?
అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. హ్యట్రిక్ సాధిస్తామని భావించిన ఎమ్మెల్యేలు కొన్ని స్థానాల్లో మూడో స్థానానికి పరిమితమయ్యారు. అయితే ఓటమికి గల కారణాలపై ఏ ఒక్కరూ సమీక్షించుకునే పరిస్థితి లేకపోవడం గమనార్హం. జిల్లా కమిటీ సభ్యులు ఎవరు? ఎన్నిసార్లు సమావేశం నిర్వహించారు? అన్నదేదీ లేదు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పదేండ్లుగా అధికారినాకి దూరమైనా రాష్ట్ర నాయకత్వం ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా కలిసి కట్టుగా కార్యక్రమాలు చేపడతారు. కానీ అందుకు పూర్తి విరుద్ధంగా బీఆర్ఎస్ ఎమ్మేల్యేల తీరు ఉండటం గమనార్హం. ఈ అసెంబ్లీ ఫలితాలపై కూడా ఇప్పటి వరకు సమీక్షా సమావేశం నిర్వహించలేదు. తమ ఓటమికి గల కారణాలు విశ్లేషించుకోలేదు.
గెలిచినా ఓడినా హైదరాబాద్‌లోనే…
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొదటి నుంచి ప్రజలకు అందుబాటులో లేకపోవడం ప్రధాన సమస్య. గెలిచినా ఓడినా ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. రెండోసారి గెలిచిన తరువాత ప్రజలకు కనిపించడమే గగనమయ్యింది. తమ వ్యాపార కార్యకలాపాలు చక్కదిద్దుకోవడంతోనే సరిపోయిందనేది స్వంత పార్టీ నాయకుల నుంచి వస్తున్న విమర్శలు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రత్యర్థులు ఈ అంశాన్ని కూడా ప్రధాన అస్త్రంగా మార్చుకుని బీఆర్ఎస్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. అయితే ఈ ఓటమితోనైనా తాజా మాజీ ఎమ్మెల్యేలు తమ తీరు మార్చుకుని ప్రజలతో మమేకం కావాలని పార్టీ శ్రేణులు కోరుతున్నారు. లేకపోతే లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇబ్బందులు తప్పవని స్పష్టం చేస్తున్నారు.
రిపోర్టింగ్ : భాస్కర్, నిజామాబాద్ జిల్లా ప్రతినిధి
సంబంధిత కథనం