Best Web Hosting Provider In India 2024
CM Revanth in Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా… బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు. ఓడిపోయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో మార్పు రాలేదన్నారు. తెలంగాణ ప్రజలన్నీ గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలంతా కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారని చెప్పారు. ప్రజా తీర్పును గౌరవించకపోతే… బయటికే పంపుతారని అన్నారు.
ట్రెండింగ్ వార్తలు
“ప్రగతి భవన్ లో ప్రజావాణి కార్యక్రమం తీసుకొచ్చాం. గతంలో ప్రగతి భవన్ లోకి రాకుండా హోంమంత్రిని అడ్డుకున్నారు. బీఆర్ఎస్ పాలన కేవలం కుటుంబం వరకే పరిమితం. ప్రగతిభవన్ ముందు గద్దర్ గంటల తరబడి నిరీక్షించినా లోనికి అనుమతించలేదు ప్రజాతీర్పును చూసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తట్టుకోలేకపోతున్నారు. ప్రజా తీర్పును బీఆర్ఎస్ గౌరవించాలి. తాము ఎన్నికల హామీలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తాం. అన్ని వివరాలను సభ ముందు ఉంచుతాం. ప్రతిపక్షాలు ఇచ్చే సూచనలు పరిగణనలోకి తీసుకుంటాం. ఇవాళ అమరవీరుల గురించి బీఆర్ఎస్ మాట్లాడుతుంది. అలాంటి బీఆర్ఎస్… కనీసం ప్రగతి భవన్ లోకి ఆహ్వానించారా..? కానీ కుటుంబ సభ్యులకు మాత్రం పదవులను కట్టబెట్టారు. ఓడిపోయిన కవితకు తిరిగి ఎమ్మెల్సీ ఇచ్చారు. రాజ్యసభ సీట్లను అమ్ముకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ఇవాళ గడీలు బద్దలుకొట్టి ప్రజావాణికి జనం క్యూ కడుతుంటే బీఆర్‌ఎస్ నేతలు భరించలేకపోతున్నారు. తెలంగాణ కోసం డీఎస్పీగా ఉన్న నళిని రాజీనామా చేసింది. అలాంటి ఉద్యమకారిణి గురించి ఈ బీఆర్ఎస్ ఆలోచించిందా..?” అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
బీఆర్ఎస్ కు నా సవాల్..
తెలంగాణ ఉద్యమంలో నమోదైన కేసుల ఎత్తివేత విషయంలో కూడా బీఆర్ఎస్ విఫలమైందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కనీసం ఈ విషయంపై నాటి ముఖ్యమంత్రి సమీక్షించారా..?అని నిలదీశారు. “ ధర్నా చౌక్ ను ఎత్తివేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టేందుకు ధర్నాచౌక్ ను తిరిగి పునరుద్ధరించాం. గత ప్రభుత్వ హయాంలో ఫోన్లు ట్యాంపింగ్ చేశారు. రైతు ఆదాయంలో తెలంగాణ స్థానం 25గా ఉంది. ఈవిషయాన్ని రాజ్యసభలో కేంద్రమంత్రి పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ స్థానం ఎప్పుడు చూసిన ఒకటి లేదా రెండుగా ఉంది.రైతు బ్రతికి ఉన్నప్పుడు ఆదుకోవాలి కానీ చనిపోయిన తర్వాత బీమా ఇవ్వడమేంటి..? రైతుపంటలకు బీమా ఉండాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రత్యామ్నాయ పంటలను పండిచకుండా.. కేవలం వరిపైనే ఆధారపడాల్సి వచ్చింది. వరి వద్దని చెప్పి.. కేసీఆర్ ఫామ్ హౌస్ లో మాత్రం వరిని పండించారు. బీఆర్ఎస్ హయాంలో కనీసం పంటకు మద్దతు ధర కల్పించారా..? కేసీఆర్ పండించిన వరి పంటకు 4250 ధర కల్పిస్తే.. సామాన్య రైతులకు మాత్రం 1500 కూడా కల్పించలేదు. ఈ విషయంలో నా సవాల్ ను స్వీకరించే దమ్ము ప్రతిపక్షానికి ఉందా..?” అని నిలదీశారు సీఎం రేవంత్ రెడ్డి.
విద్యుత్ వినియోగంలో పదో స్థానం
విద్యుత్ విషయంలోనూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం అబద్ధాలను చెప్పిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యుత్ తలసరి వినియోగంలో తెలంగాణ పదో స్థానంలో ఉందని పేర్కొన్నారు. విద్యుత్ తలసరి వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో బీఆర్ఎస్ అబద్ధాలు చెప్పవద్దని కోరారు.” కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చామని బీఆర్ఎస్ చెప్పింది. కానీ రాష్ట్రంలో పంప్ సెట్లు ఎందుకు పెరిగాయి..? కాలువల ద్వారా ఎక్కడ నీళ్లిచ్చారు..? వికారాబాద్, చేవెళ్ల, కొడంగల్ వంటి ప్రాంతాలపై వివక్ష చూపించారు. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును ఎందుకు మార్చారు..? పాలమూరులోని ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కాలేదు. పాలమూరు ఇవ్వాళ్టికి ఎడారిగా ఎందుకు మారింది. పాలమూరు ప్రజలు ఎంపీగా గెలిస్తే… ఆ ప్రాంతానికి ఏం చేశావు…? పాలమూరుపై ఎందుకీ వివక్ష..? పాలమూరు ప్రజలకు బీఆర్ఎస్ వాళ్లు క్షమాపణలు చెప్పాలి. మిడ్ మానేరులో భూములు కోల్పోయిన వారికి ఆదుకుంటామని చెప్పి మోసం చేశారు. ముంపు బాధితులు పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇండ్లు కోల్పోయిన వారికి కూడా పట్టాలు ఇవ్వలేదు. కానీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ కు మాత్రం అర్ అండ్ ఆర్ ప్యాకేజీలో ఇళ్ల ప్యాకేజీని పొందారు. ఇన్ని తప్పులు చేసిన బీఆర్ఎస్ కు మమ్మల్ని ప్రశ్నించే అస్కారం లేదు” అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
కేటీఆర్ పై సీఎం ఫైర్
ఇందిరమ్మ రాజ్యం తీసుకువస్తామని మరోసారి పునరుద్ఘాటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇండ్లు కట్టిస్తామని, అసైన్డ్ భూమలు కల్పిస్తామని.. మంచి వైద్యం అందజేస్తామని చెప్పారు. ఇవన్నీ కూడా ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమవుతుందన్నారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ సభ్యులను బయటికి పంపే ఉద్దేశ్యం లేదని… వారికి ఈ పచ్చి నిజాలన్నీ తెలియాల్సిన అవసరం ఉందన్నారు. గవర్నర్ ప్రసంగం విని నిజంగానే కేటీఆర్ సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు. ఇసుక దోపిడీలో బీఆర్ఎస్ పాత్ర లేదా అని ప్రశ్నించారు. నేరెళ్లలో దళితులపై థర్డ్ డిగ్రీ పెట్టించిన చరిత్ర కూడా బీఆర్ఎస్ పార్టీదేనని విమర్శించారు. ఖమ్మలో రైతులకు బేడీలు వేయించారని.. అలాంటి బీఆర్ఎస్ సిగ్గుపడాలన్నారు. కనీసం పరీక్షలను కూడా సరిగ్గా నిర్వహించలేదన్నారు.