Best Web Hosting Provider In India 2024
Tea in Winter: చలికాలం వస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలు మొదలయిపోతాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం వంటివి దాడి చేస్తాయి. మరెన్నో శ్వాసకోశ సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆస్తమా ఉన్నవారికి ఊపిరి ఆడడమే కష్టం అయిపోతుంది. ఊపిరితిత్తులకు కఫం పట్టేసి ఇబ్బంది పెడుతుంది. రోజంతా అనారోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇలా కఫాన్ని వదిలించుకోవడానికి ఆయుర్వేదంలో ఒక చిట్కా ఉంది. రోజుకు రెండుసార్లు లవంగంతో చేసిన టీ ని తాగడం వల్ల కఫాన్ని వదిలించుకోవచ్చు. కఫాన్ని తొలగించుకోవడం కోసం మందులు వాడే బదులు లవంగ టీని తాగితే త్వరగా ఉపశమనం లభిస్తుంది. లవంగాలకు కఫాన్ని విరిచే సామర్థ్యం ఉంటుంది. ఈ టీ చేయడం కూడా చాలా సులువు.
ట్రెండింగ్ వార్తలు
లవంగ టీ ఇలా చేయండి
లవంగం టీ చేయడానికి కావాల్సింది రెండు లవంగాలు, చిన్న అల్లం, దాల్చిన చెక్క ముక్క, నీళ్లు. స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో రెండు కప్పుల నీళ్లు పోయాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు అల్లం తరుగును, దాల్చిన చెక్క ముక్కను, లవంగాలలో వేసి చిన్న మంట మీద మరిగించాలి. బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఆ నీటిని గ్లాసులో వడకట్టి కాస్త తేనే కలుపుకోవాలి. తీయదనం కోసమే తేనె… నచ్చకపోతే తేనె కలుపుకోకుండానే ఆ లవంగ టీని తాగచ్చు. లవంగ టీ వేడివేడిగా గొంతులోకి వెళుతూ ఉంటే ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుంది. కఫాన్ని విరిచేస్తుంది. మసాలా నీళ్ల మాదిరిగా ఉంటుంది. కాబట్టి రుచి కూడా బానే ఉంటుంది. చలికాలంలో రోజుకి రెండుసార్లు ఈ లవంగ టీని తాగడం చాలా మంచిది. కఫంతో పాటు ఇతర శ్వాసకోశ సమస్యలు కూడా తగ్గుతాయి.
లవంగ టీ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తరచూ వైరస్, బ్యాక్టీరియాల కారణంగా వ్యాధులు దాడి చేయకుండా ఉంటాయి. ఈ లవంగ టీలో యాంటీ వైరల్ లక్షణాలు, యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఎక్కువ.
ఆహారంలో కూడా లవంగాలను భాగం చేసుకుంటూ ఉండాలి. లవంగాలను ఇలా నీళ్ళల్లో మరిగించి తాగితే తల తిరగడం, వాంతులు, అలసట, అజీర్తి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ లవంగ టీ తాగడం వల్ల దంతాలు, చిగుళ్లలో కూడా సమస్యలు తగ్గుతాయి. చిగుళ్ళ నొప్పి వంటివి తగ్గుతాయి.
ఈ లవంగాలలో క్యాల్షియం, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్, కార్బోహైడ్రేట్లు, సోడియం, విటమిన్ ఏ, మాంగనీస్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి అత్యవసరమైనవి. ఇవి మన పొట్టలో చేరాక అక్కడ ఉండే మంచి బ్యాక్టీరియాను కాపాడతాయి. కొన్ని రకాల సూక్ష్మజీవుల నుండి మనల్ని రక్షిస్తాయి. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతాయి. లవంగాలు డయాబెటిస్ వ్యాధిని కూడా అదుపులో ఉంచుతాయి. ఎవరైతే మధుమేహంతో బాధపడుతున్నారో వారు ప్రతి రోజూ లవంగ టీ తాగడం చాలా ముఖ్యం. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటుంది. అలాగే ఎముకల సమస్యలను కూడా తగ్గిస్తుంది. దీన్ని తాగడం వల్ల నోటి దుర్వాసన రాకుండా అడ్డుకుంటుంది.