Best Web Hosting Provider In India 2024
Tirumala News: తిరుమల శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. వైష్ణవాలయాల సంప్రదాయాలను పాటిస్తూ డిసెంబరు 23 నుండి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వారం 10 రోజుల పాటు తెరచి ఉంచి భక్తులకు దర్శనభాగ్యం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.
ట్రెండింగ్ వార్తలు
విశిష్టత ఇదే…
పురాణాల ప్రకారం వైకుంఠ ద్వార దర్శనం విశిష్టత ఇలా ఉంది. వైకుంఠంలో శ్రీమహావిష్ణువుకు ఒక రోజు అంటే భూలోకంలో ఒక సంవత్సరం అని అర్థం. అదేవిధంగా అక్కడ పగలు 12 గంటలు ఇక్కడ 6 నెలలు ఉత్తరాయణం, రాత్రి 12 గంటలు ఇక్కడ 6 నెలలు దక్షిణాయణం. వైకుంఠంలో తెల్లవారుజామున 120 నిమిషాలు భూలోకంలో 30 రోజులతో సమానం. దీన్ని ధనుర్మాసంగా పిలుస్తున్నాం. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో 40 నిమిషాలు శ్రీమహావిష్ణువు దేవతలకు, ఋషులకు దర్శనమిస్తారు. ఇది వైకుంఠంలో ఆ కాలమానం ప్రకారం ప్రతిరోజు జరిగే ప్రక్రియ. భూలోకం కాలమానం ప్రకారం సంవత్సరంలో ఒకసారి జరిగే ప్రక్రియగా కనిపిస్తుంది.
ఈ 40 నిమిషాలు భూలోకంలో 10 రోజులకు సమానం కావున వైష్ణవ ఆలయాలలో ఈ 10 రోజులలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే శ్రీమహా విష్ణువును ప్రత్యక్షంగా దర్శనం చేసుకున్న భాగ్యం కలుగుతుంది అనేది నమ్మకం. కాబట్టి వైకుంఠ ద్వార దర్శనం ఈ 10 రోజులలో ఏరోజు చేసుకున్నా అన్ని రోజులూ సమానమే. భక్తులు ఈ విషయాన్ని గమనించి దర్శనానికి రావాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
తిరుమలలో గదులు పరిమితంగా ఉన్న కారణంగా ఈ పర్వదినాలలో భక్తుల రద్దీ దృష్ట్యా తిరుపతిలో గదులు పొందాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. గతంలో వలెనే ఈ సంవత్సరం కూడా స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపిలకు పరిమితంగా మాత్రమే బ్రేక్ దర్శనం ఇవ్వబడుతుందని… సిఫారసు లేఖలు స్వీకరించబడవని స్పష్టం చేసింది.
వైకుంఠ ద్వార దర్శన ఫలితం 10 రోజలు పాటు ఉంటుందని… కావున విఐపిలు, ఇతర భక్తులు తొలిరోజైన వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే దర్శనం చేసుకోవాలనే తొందరపాటు లేకుండా పది రోజుల్లో ఏదో ఒకరోజు దర్శనం చేసుకోవడానికి ప్రణాళికలు రూపొందించుకోవాలని భక్తులను కోరింది.
సంబంధిత కథనం