Best Web Hosting Provider In India 2024
ఇటీవల కాలంలో దాదాపుగా ప్రతి ఇంట్లోనూ మధుమేహ వ్యాధిగ్రస్తులు కనిపిస్తున్నారు. ఇదివరకు వయసు పైబడిన వారిలో మాత్రమే కనిపించే ఇది ఇప్పుడు చిన్న వారిలోనూ అధికంగా దర్శనమిస్తోంది. ఇది మనలో స్లో పాయిజన్‌లా పనిచేస్తూ ఉంటుంది. మన జీవన విధానాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. దాని వల్ల వచ్చే ప్రతికూల ప్రభావాలు అనేకం. అయితే కొన్ని చర్మ సంబంధిత సమస్యలు మనలో కనిపిస్తూ ఉంటే అవి బహుశా మధుమేహానికి సూచనలు కావొచ్చు. అలా షుగర్ వ్యాధిగ్రస్తులకు వచ్చే చర్మ సంబంధిత రుగ్మతలేంటో తెలుసుకుందాం రండి.
ట్రెండింగ్ వార్తలు
ప్యాచ్‌లు :
చర్మంపై పసుపు, ఎరుపు, ముదురు రంగుల్లో ప్యాచ్‌ల్లాంటివి వస్తాయి. వీటి మీద మొటిమల మాదిరిగా చిన్నచిన్న పొక్కులు వస్తాయి. ఆ ప్యాచ్ దగ్గర చర్మం రఫ్‌గా ఉండి వాచినట్లుగా అవుతుంది. దాని చుట్టుపక్కల చర్మం మెరుస్తూ కనిపిస్తుంది. కొందరిలో రక్త నాళాలు కూడా తేలి కనిపిస్తాయి. దురద పుడుతుంది. సమస్య ఎక్కువ అవుతున్నట్లు గుర్తిస్తే వైద్యుల్ని సంప్రదించాలి.
చర్మం ముదురు రంగులోకి మారడం :
మధుమేహం ఉన్న వారిలో కొందరికి మెడ దగ్గర, బాహు మూలాల్లో, మొల దగ్గర చర్మం ఊదా రంగులోకి మారుతుంది. అంటే దీని అర్థం మీ రక్తంలో అత్యధికంగా ఇన్సులిన్ ఉందని.
చర్మం మొద్దు బారడం :
సాధారణంగా అందరికీ చర్మం సాగే లక్షణాన్ని కలిగి ఉంటుంది. అయితే మధుమేహం ఉన్న వారిలో చర్మం ఈ లక్షణాన్ని కోల్పోతూ ఉంటుంది. చర్మం దళసరిగా మారి మొద్దుబారినట్లు అవుతుంది. ముఖ్యంగా పాదాలు, చేతి కాలి వేళ్లు, వీపు పైన, మెడ తదితర భాగాల్లో దళసరిగా మారుతూ అది క్రమంగా ఇతర భాగాలకు వ్యాపిస్తూ వస్తుంది.
చర్మపు ఇన్‌ఫెక్షన్లు :
షుగర్ ఉండే వారు ఎక్కువగా చర్మ ఇన్‌ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు ఉంటాయి. అది పొడి బారడం, పొట్టులా రాలడం, దురదలు రావడం, గోకితే పుండ్లు పడి తెల్లటి చీము లాంటి పదార్థం కారడం, కాలి వేళ్ల సంధుల్లో గోళ్ల దగ్గర, స్కాల్ప్ మీద బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి.
దెబ్బలు తగ్గకపోవడం :
ఎక్కువ కాలం పాటు రక్తంలో చక్కెర స్థాయిలు పరిమితికి మించి ఉంటే నరాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. వాటిలోకి రక్త ప్రసరణ తగ్గిపోవడం వల్ల గాయాలు ఎప్పటికోగాని మానవు. ముఖ్యంగా పాదాల దగ్గర గాయాలు తగ్గడం చాలా కష్టం అవుతుంది.
పొక్కులు :
చర్మంపై ఎర్రటి పొక్కులు అక్కడక్కడా కనిపిస్తుంటాయి. ప్యాచ్‌లా ఒకే చోట అవి ఉంటాయి. కొన్ని సార్లు ఎర్రగా, కొన్ని సార్లు చర్మపు రంగులో కనిపిస్తాయి. అలాగే మరి కొందరిలో చర్మం కాయల్లా మారి బయటకు పొడుచుకుంటుంది. చూడ్డానికి అవి పులిపిరి కాయల మాదిరిగా ఉంటాయి.
ఇలాంటి చర్మ సమస్యలు ఏం కనిపిస్తున్నా సరే ముందు వైద్యుడిని సంప్రదించాలి. మధుమేహ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి.