Best Web Hosting Provider In India 2024
Sorakaya Dosa: దక్షిణాదిలో దోశెను మించిన అల్పాహారం లేదు. దీనిలో ఎన్నో రకాలు ఉన్నాయి. ఆనియన్ దోశ, రవ్వ దోశ, మసాలా దోశ… ఇవన్నీ కూడా టిఫిన్ సెంటర్లలో దొరుకుతాయి. కానీ సొరకాయ దోశ మాత్రం దొరకదు. దీన్ని ఇంట్లోనే తయారు చేసుకోవాలి. దీని రుచి చాలా బాగుంటుంది. పిల్లలకు, పెద్దలకు ఇద్దరికీ నచ్చుతుంది. ఒకసారి దీన్ని చేసుకొని చూడండి. దీంతో కొబ్బరి చట్నీ, టమోటో చట్నీ జతగా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.
ట్రెండింగ్ వార్తలు
సొరకాయ దోశ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
సొరకాయ – అర ముక్క
బియ్యం – రెండు కప్పులు
ఎండుమిర్చి – ఐదు
జీలకర్ర – రెండు స్పూన్లు
అల్లం – చిన్న ముక్క
నూనె – రెండు స్పూన్లు
నీళ్లు – సరిపడినన్ని
ఉప్పు – రుచికి తగినంత
సొరకాయ దోశ రెసిపీ ఇలా
1. బియ్యాన్ని ముందే శుభ్రం చేసుకుని మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి.
2. సొరకాయ పైన తొక్క తీసి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టి ఎండుమిర్చి, జీలకర్ర వేయించుకోవాలి.
4. మిక్సీలో బియ్యం, సొరకాయ తరుగు, అల్లం ముక్క, ఉప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వంటివన్నీ కలిపి ఇందులో రుబ్బుకోవాలి.
5. అవసరమైతే నీళ్లను కలుపుకోవచ్చు. ఆ మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
6. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి కాస్త నూనె వేసి వేడెక్కాక సొరకాయ రుబ్బుతో దోశలు వేసుకోవాలి.
7. ఈ దోశెలు చాలా పలుచగా వస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుకోవడం కోసం కాస్త పసుపును కూడా కలుపుకోవచ్చు.
8. ఈ దోశెలు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ దోశెలు పలుచగా క్రిస్పీగా వస్తాయి.
9. వీటిని కొబ్బరి చట్నీతో తింటే రుచి అదిరిపోతుంది.
సొరకాయ తినడం వల్ల లాభాలు…
సొరకాయ మన శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలను అందిస్తుంది. సొరకాయతో పాటు బియ్యం, అల్లం, జీలకర్ర వంటివి ఇందులో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనకి మేలు చేసేవే. శీతాకాలంలో ఈ సొరకాయ దోశలను తినడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ముఖ్యంగా డయాబెటిక్ రోగులకు ఇది మేలు చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా చేస్తుంది. ఇందులో బియ్యం ఉన్నాయని భయపడక్కర్లేదు. మూడు దోశెల వరకు తినవచ్చు. తెల్లబియ్యాన్ని వాడడం ఇష్టం లేనివారు, బ్రౌన్ రైస్ ఉపయోగించి దోశలు చేసుకోవచ్చు. సొరకాయ వల్ల శరీరంలో రక్తప్రసరణ సవ్యంగా జరుగుతుంది. అలాగే రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. గుండెజబ్బులు రాకుండా అడ్డుకునే శక్తి దీనికి ఉంది. ముఖ్యంగా మలబద్ధకం సమస్య రాదు. దీనిలో ఎక్కువ శాతం నీరే ఉంటుంది. కాబట్టి తేలిగ్గా జీర్ణం అయిపోతుంది.