Best Web Hosting Provider In India 2024
Spicy Chutney: పంచభక్ష్య పరమాన్నాలు పెట్టినా అందులో కచ్చితంగా పచ్చడి ఉండాల్సిందే. తెలుగువారికి పచ్చడి అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. కూర, పప్పు, పెరుగు ఉన్నా కూడా ఏదో ఒక పచ్చడిని పక్కన పెట్టుకుంటారు. కొన్ని నిల్వ పచ్చళ్ళు ఉంటే, కొన్ని అప్పటికప్పుడే చేసుకునే పచ్చళ్ళు ఉంటాయి. ఈ రెండూ కూడా వేడి వేడి అన్నంలో కలుపుకుంటే రుచి అదిరిపోతాయి. ఇక్కడ మేము ఉల్లి వెల్లుల్లితో చేసే పచ్చడి రెసిపీ చెబుతున్నాం. ఇది స్పైసీగా చేసుకుంటే రుచి అదిరిపోతుంది. అంతేకాదు ఇందులో వాడిన పదార్థాలన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. రోగనిరోధక శక్తిని పెంచేవే. కాబట్టి వారానికి ఒకసారి ఈ చట్నీ తింటే ఎంతో ఆరోగ్యం. ఇందులోని వెల్లుల్లి, ఉల్లిపాయ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. దీని తయారీ ఎలాగో చూద్దాం.
ట్రెండింగ్ వార్తలు
ఉల్లి వెల్లుల్లి చట్నీకి కావలసిన పదార్థాలు
వెల్లుల్లిపాయలు – 20 రెబ్బలు
ఉల్లిపాయ – రెండు
ధనియాలు – రెండు స్పూన్లు
మినప్పప్పు – ఒకటిన్నర స్పూను
పల్లీలు – గుప్పెడు
అల్లం – చిన్న ముక్క
ఉప్పు – రుచికి సరిపడా
ఎండుమిర్చి – రెండు
చింతపండు – నిమ్మకాయ సైజులో
కొత్తిమీర తరుగు – మూడు స్పూన్లు
కరివేపాకు – గుప్పెడు
పచ్చిమిర్చి – పది
నూనె – రెండు స్పూన్లు
శెనగపప్పు – రెండు స్పూన్లు
ఉల్లి వెల్లుల్లి పచ్చడి తయారీ ఇలా
1. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోవాలి. ఇందులో మూడు స్పూన్ల నూనె వేసుకోవాలి.
2. మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి.
3. ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఆ మిక్సీ జార్‌లోనే రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ చేసుకోవాలి.
4. కాస్త నీళ్లు పోసి పచ్చడిలా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
5. ఆ నూనెలో ఆవాలు, కరివేపాకులు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి వేసి పోపు చేసుకోవాలి.
6. ఆ పోపును ఈ పచ్చడిలో వేసి కలుపుకోవాలి. అంతే స్పైసీగా ఉల్లి వెల్లుల్లి చట్నీ రెడీ అయినట్టే.
7. దీన్ని వేడి వేడి అన్నంలో తింటే అదిరిపోతుంది. దీనిలో పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఎక్కువగా వేసాము కాబట్టి స్పైసీగా ఉంటుంది.
8. కారం తక్కువ తినేవారు పచ్చిమిర్చిని తగ్గించుకుంటే సరిపోతుంది.
9. ఈ పచ్చడి చేసుకుంటే దోశెలోకి, ఇడ్లీలోకి, అన్నం లోకి కూడా అదిరిపోతుంది.